బ్రహ్మదేవుడు తన కూతురిని చూసి మోహించాడా? - వితండ వాదులకు ధీటైన సమాధానం !
ఇటువంటి విషయం విన్న పాపం శమించుగాక !!! కొందరు పనిగట్టుకుని మరీ ఇటువంటి విపరీతమైన విషయాలను బాగా ప్రాచుర్యం చేస్తున్నారు. పూర్తి విషయాలు తెలియకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటివి ఎవరు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. వీరేకాక పూర్తిగా పురాణజ్ఞానం లేని కొందరు వక్రభాష్యాలు చెప్పడం చూస్తున్నాము. వేరేవారికి అర్ధం కాకపోయినా ఫరవాలేదు, మన సాంప్రదాయంలో ఉన్నవారు కూడా పూర్తిగా విషయావగాహన లేక సగం సగం చదివి పండితులమని చెప్పుకు తిరిగే వారి మాటలు నమ్మి మోసపోతున్నారు.
అసలు బ్రహ్మగారి పుట్టుక గురించి ఒకసారి పురాణాలు చదివితే మిగిలిన విషయాలు ఎరుకలోకి వస్తాయి. వటపత్రశాయి అయిన శ్రీమన్నారాయణుని నాభినుండి ఒక కమలం ఉద్భవించి ఆ కమలంలో బ్రహ్మ జనియిస్తాడు. ఆయన తాను తామరపువ్వులోకి ఎలా వచ్చాను, తానెవరు అన్న ప్రశ్నలతో సతమతమయివున్నప్పుడు ఆయనకు ఆకాశవాణి “తపః తపః” అని చెబుతుంది. కొన్నేళ్ళు తపస్సు చేసి తామరతూడుద్వారా వెళ్లి ఆ పీతాంబరధారి అయిన పరమపురుషుని దర్శనం చేసుకుని ఆయనను తన తండ్రిగా గుర్తించి స్తోత్రం చేస్తాడు. మధుకైటభుల అపాయం నుండి కాపాడమని తదుపరి ఆయనను వేడుకోగా ఆయన ఐదు వేల సంవత్సరాలు వారితో పోరాడి వారిని లీలామాత్రంగా హతమారుస్తాడు. అటుపై ఆయన కనుబొమల రౌద్రం నుండి రుద్రుడు ఉద్భవిస్తాడు.. అసలు విష్ణుమూర్తి ఎవరిని ధ్యానిస్తున్నాడో తెలియజేయమని చతుర్ముఖబ్రహ్మ తన తండ్రిని వేడుకోగా అప్పుడు ఆయన యోగమాయాదేవి లీలగా ఒక విమానం రప్పించి అందులో ముగ్గిరిని ఎక్కమని చెబుతుంది. త్రిమూర్తులు ముగ్గురు ఆ విమానం అధిరోహించగానే ఆ విమానం ఈ బ్రహ్మాండాన్ని దాటి మరొక బ్రహ్మాండానికి తీసుకు వెళ్తుంది. అక్కడ అచ్చం చతుర్ముఖబ్రహ్మ లాంటి మరొక బ్రహ్మను, బ్రహ్మలోకాన్ని, రుద్రుని లాంటి మరొక మహాదేవుని, కైలాసాన్ని, మరొక విష్ణుమూర్తిని, వైకుంఠనగరాన్ని చూపించగా అందరూ ఆశ్చర్యచకితులవుతారు.
అటువంటి త్రిమూర్తులను కొన్ని వేలమందిని చూపుతూ, కొన్ని కోట్ల బ్రహ్మాండాలను చూపిస్తూ ఆ విమానం మణిద్వీపం చేరుకుంటుంది. అక్కడ విరాజమానమైన మహాలక్ష్మి దేవిని చూసి అందరూ భక్తితో నమస్కరిస్తారు. వీరిని అందరినీ కూడా స్త్రీ రూపాలుగా మార్చి ఆ లోకానికి స్వాగతం చెప్పి ఆ జగత్జనని అందరినీ ప్రేమతో చూస్తుంది. ఒకొక్కరు స్తోత్రం చేసిన తరువాత ఆవిడ సాక్షాత్తు తానే ఆ పరమపురుషుని మహామాయ మహాలక్ష్మి అని చెప్పి వారికి తనకు పరమపురుషునికి తేడా లేదని చెప్పి వారిని అనుగ్రహిస్తుంది. ఒకొక్కరికి ఒకొక్క బాధ్యత అప్పజెప్పి వారికి తోడుగా తన వివిధశక్తులను తోడుగా ఇస్తుంది. విష్ణుమూర్తికి తన సాత్త్విక అంశ అయిన లక్ష్మీదేవిని అనుగ్రహించి, శివునికి మహాకాళి ని అనుగ్రహించి, బ్రహ్మకు మహాసరస్వతిని అప్పజెపుతుంది. వారంతా ఆ శక్తులతో కలిసి తమ బాధ్యతలు నిర్వర్తించాలి అని నిరాదరణ చెయ్యవద్దని హెచ్చరించి అందరిని మామూలు రూపాలలో ఆ విమానంలో తిరిగి పంపుతుంది. లక్ష్మీదేవి విష్ణువు హృదయస్థానంలో భద్రంగా చేరగా, కాళీదేవి రుద్రుని అర్ధశరీరం దాల్చి ఆయనలో అంతర్భాగామైతే, మహాసరస్వతి బ్రహ్మవర్చస్సులో చేరుతుంది. ఇదంతా దేవీభాగవతం ఎంతో అద్భుతంగా వివరిస్తుంది.
అటుపై త్రిమూర్తులంతా మన బ్రహ్మాండానికి చేరుకొని తమ బాధ్యతలు నెరవేర్చే క్రమంలో తమ తమ నగరాలు నిర్మించుకుని బ్రహ్మను సృష్టి చెయ్యమని వారి పనులలో నిమగ్నమవుతారు. బ్రహ్మ తన కమలంలో కూర్చుని విష్ణుమూర్తి ఆదేశానుసారం సృష్టి చెయ్యడానికి తపస్సు చేస్తుంటాడు. ఈలోపు రుద్రుడు తన ఏకాదశ అంశలతో సృష్టి ప్రారంభించగా పెద్ద పెద్ద భూతాలతో భయంకరమైన సృష్టి చేస్తుంటే బ్రహ్మ ఇక ఆపమని వారిని తపస్సు చేసుకోమని పంపుతాడు. ఇక ఆయన తపస్సు పరిపూర్ణం చేసుకుని తన బోటని వేలు నుండి దక్షుని, తోడనుండి నారదుని, నాభి నుండి పులహుని, చెవులనుండి పులస్త్యుని, ఇంకా భ్రుగువు, క్రతువు, అంగిరసుడు, వశిష్టుడు, మరీచి, అత్రిని ఆవిర్భావింపచేస్తాడు. ఇక మిగిలిన సృష్టిని చేస్తుండగా ఆయన ముఖంలో శక్తి అంశగా మహాలక్ష్మి ద్వారా అనుగ్రహింపబడిన సరస్వతి బయటకు వస్తుంది. ఆయనకు జగజ్జనని అనుగ్రహించిన శక్తిని చూసి గుర్తించి ఆవిడను చేపడతాడు. ఇదీ సరస్వతీ బ్రహ్మల పునఃకలయిక. ఇక్కడ ఆయనకు అనుగ్రహింపబడిన శక్తి ఆయనకు సృష్టిలో సహకరించడానికి బయటకు వచ్చింది. కాబట్టి ఆవిడ ఏ రకంగా చూసుకున్నా ఆయన కూతురు కాదు. ఆవిడ బ్రహ్మసృష్టి కాదు.
శక్తి రూపం బయటకు వేరుగా వచ్చినప్పుడు వారికి మానవ పరిభాషలో మనం మాట్లాడకూడదు. కొన్ని పురాణాలు కొంచెం ఇబ్బందిగా చెప్పినట్టు కనిపించినా సరిగ్గా అర్ధం చేసుకుంటే అన్నీ అనుసంధానం చేసుకుని చదివితే తత్త్వం బోధపడుతుంది. లేదంటే మనం కూడా ఆ విష్ణుమాయలో పడి పాడయిపోయే అవకాశం వుంది. ఆయన పాదాలు పట్టుకుని సత్యం బోధించమని వేడుకుంటే మనకు సరిగ్గా అవగాహన కలుగుతుంది.
బ్రహ్మ సృష్టి చేస్తే బుద్ధిని సిద్ధింపచేసేది అమ్మ సరస్వతి. ఆవిడ విద్యలకన్నింటికీ అధిష్టాన దేవత. మనకు బుద్ధి ప్రచోదనం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇలా కొడుకు , కోడలు గా మనం మానవ సంబంధాల పరంగా చూసి మోసపోతూ ఉంటాము. మహాదేవి త్రిమూర్తులను ఉద్దేశించి మీరంతా ఒకే అంశ, సమయాన్ని బట్టి ఒకొక్క గుణం ప్రచోదనం అయి ఆ విధంగా నడుస్తారని మీ ముగ్గురిలో భేదం ఏమీ లేదని చెబుతుంది. ఉన్న ఒక్క పరమాత్మ తనకు తాను వివిధావతారాలలో ఈ సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఆయన శక్తి సృష్టి సమయంలో సరస్వతీ అవతారంగా బ్రహ్మకు సహాయపడినట్టు కనిపిస్తుంది, పాలన సమయంలో లక్ష్మీ శక్తి తో విష్ణువు ద్వారా చేయిస్తున్నట్టు కనిపించి లయసమయం లో కాళీ సహిత రుద్రుని రూపంలో మారుతుంది తప్ప, అక్కడ ఉన్న శక్తి ఒకటే, అది ఆ పరమపావనమూర్తి లోని ఒక అంశ. అటువంటి ఈ బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వరుడు సదా మనకు సరైన బుద్ధి ప్రచోదనం చేసి సత్యాన్ని ఎరుకపరచాలని ఆయన్ను ప్రార్ధిద్దాం.
రచన: హిందు జ్వాల