దేవదేవుడూ, పశుపతీ అయిన ఆ పరమేశ్వరుడు ఆడంబరాలకు దూరంగా ఉంటాడు. భిక్షాటనే జీవనాధారం.
రుద్రభూమే శాశ్వత స్థానం. ఎప్పుడూ పులితోలు కప్పుకుని తిరుగుతుంటాడు. ఆభరణాల ఊసేలేదు సరికదా విషపునాగులను మాలలుగా ధరించి మురిసిపోతుంటాడు. రుద్రాక్షల్ని దండలుగా గుచ్చుకుని హారాలంటాడు. పోనీ, సిగలోని చంద్రుడినైనా చూసి ముచ్చటపడదామంటే అదీ కుదరదు. ఆ జడలను పట్టుకు వేలాడేవాడు వెన్నెల సోనలు వెదజల్లే నిండు చంద్రుడేం కాదు కళాకాంతీలేని సన్నని చంద్రవంక. రంకెలేయలేని ముసలి ఎద్దే వాహనంగా ఊరేగుతాడు.
నిరాడంబర శివః |
ఇక శివుడి చుట్టూ ఉండే పరివారం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకటో రకం ప్రమథ గణం. నందికి నందే సాటి, భృంగికి భృంగే పోటీ. వీరినే మగపెళ్లివారిగా తీసుకుని పర్వత రాజు ఇంటికి ధూంధాంగా బయలుదేరాడట పశుపతి. వియ్యాలవారు ఈ దండు మొత్తాన్నీ చూసి ముక్కునవేలేసుకున్నారట. పర్వతరాజు వీరిని ఎలా సంబాళించుకురాగలడోననీ, పార్వతి సంసారం ఎలా సాగుతుందోననీ భయపడ్డారట.
ఇంత సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నవాడు జగతికి ఏ రీతిన సందేశమివ్వగలడని సంశయించవచ్చు. అక్కడే ఉంది చిదంబర రహస్యం. కలియుగంలోని మనుషుల తీరు చంద్రశేఖరుడికి తెలిసినట్టుగా మరొకరికి తెలీదు. వెయ్యి చెబితే పదో పరకో అవగాహన చేసుకునే మనస్తత్వం మనది. కాబట్టే తనను తాను తక్కువగా చేసుకున్నట్లు కనిపిస్తూ నేలమీద నడవడమంటే ఇదేనంటూ మనిషి జీవితం ఇలానే ఉండాలంటూ సందేశాన్ని అందిస్తున్నాడు. ‘మామూలు మనుషులుగా ప్రేమ స్వరూపులుగా మెలగండి, ఆడంబరాలను నెత్తికెక్కించుకోకుండా మానవత్వంతో జీవించండి’ అనే హితోక్తులను తన ప్రవర్తన ద్వారా అందరికీ చెబుతున్నాడన్నమాట.
రచన: దంతుర్తి లక్ష్మీప్రసన్న