భక్తికి వశం
శివుడిని శరణు కోరిన మార్కండేయుడు యమపాశం నుంచి బయటపడి చిరంజీవి అయ్యాడు. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన అనంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగర తీరంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి, అర్చించి పాపవిముక్తుడయ్యాడు. శివుడికి తన కన్నులనే అర్పించిన తిన్నడు భక్తకన్నప్పగా ప్రసిద్ధి చెందాడు... ఇలా చెప్పుకుంటూపోతే ఎందరో మహాభక్తుల చరితలు మనకు దృష్టాంతాలుగా కన్పిస్తాయి. అలాంటి నిగర్వి, నిరాకార, నిర్గుణ, నిరాడంబరుడైన నిలాక్షుడి ప్రేమానురాగాలు తెలిపే గాథలు అనంతం.
ఎల్లలు లేనిది ఆయన మమకారం. ‘శివా’ అని ఆర్తిగా పిలిస్తే, మరుక్షణం చెంతనిలిచే ఆశ్రిత వత్సలుడాయన. అంతేనా, ఆ భక్తవశంకరుడి వాత్సల్యానికి సురాసుర భేదం లేదు. అందుకే కదా, భస్మాసురుడు ఆ నీలకంఠుడి నుంచి అవలీలగా వరాన్ని పొందగలిగాడు. ఎవరి తలమీద చెయ్యి పెడితే వాడే బుగ్గయి పోతాడన్న భరోసా దక్కించుకున్నాడు. శివుడి మీదనే ఆ వరబలాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. అప్పుడిక ఆ రాక్షసుడి బారినపడకుండా తప్పించుకునేందుకు ఆ కైలాసనాథుడు నానాయాతనా పడాల్సివచ్చింది. రావణాసురుడూ అలాగే కదా ఆ పరమపావనుడిని ప్రసన్నం చేసుకున్నది. ఇక్కడే అంతర్లీనమైన ఒక ధర్మసూక్ష్మం ఉంది. దుష్టుల పట్ల జాగరూకతతో మెలగడం మనిషిలక్షణం. దుర్మార్గుడిని సైతం ప్రేమించగలగడం దైవత్వం.
పశుపతి అసలైన దైవం కాబట్టే రాక్షసుల విషయంలోనూ దయనూ ప్రేమనూ ప్రకటించగలిగాడు. ఆ దిశగా యోచన చేసి తీరాలంటూ మానవాళికి హితవు చెప్పాడు.
రచన: ఏ.సీతారామారావు