ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.
రచన: కళ్యాణ్