బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా అత్తి వరదర్, గరుడగమన గోవిందా దేవతారూపాలు
తిరుమల, 2019 సెప్టెంబరు 28: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈసారి కల్యాణవేదిక వద్ద తమిళనాడులోని కాంచీపురంలో గల శ్రీ అత్తి వరదరాజస్వామివారి సెట్టింగు, గరుడగమన గోవిందా సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఉద్యానవన విభాగం ఫలపుష్ప ప్రదర్శనలో భాగంగా పురాణాల్లోని అంశాలతో భక్తులను ఆకట్టుకునేలా సెట్టింగులను రూపొందిస్తోంది.
40 ఏళ్ల తరువాత ఇటీవల దర్శనమిచ్చిన కాంచీపురంలోని శ్రీ అత్తి వరదరాజస్వామివారిని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్న విషయం విదితమే. తిరిగి 2059వ సంవత్సరంలోనే స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. గతంలో దర్శించుకోలేని భక్తుల కోసం టిటిడి మూడు భంగిమల్లో అనంతసరోవరంలోని శ్రీ అత్తి వరదరాజస్వామివారి సెట్టింగులను ఏర్పాటుచేసింది.
అదేవిధంగా, గరుడ గమన గోవిందా అనే పేరుతో బెంగళూరుకు చెందిన సోదరీమణులు కుమారి గౌరి, కుమారి నీలాంబిక చక్కటి సైకత శిల్పాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ మహావిష్ణవు తనకిష్టమైన గరుడునిపై వస్తున్న విధంగా ఉన్న ఈ సైకత శిల్పం భక్తులకు భక్తిభావాన్ని పంచుతోంది. రెండు రోజుల్లో ఈ సైకత శిల్పం తయారీ పూర్తవుతుంది.
మూలము: తి.తి.దే