శుభోదయం - సుభాషితాలు
పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం
నా భ్యర్థితో జలధరోపి జలం దదాతి
సంతః స్వయం పరహితే విహితాభి యోగాః
అర్థము: ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు, చంద్రుడు కలువలను వికసింప చేయు చున్నాడు, అడుగకయే మేఘుడు వర్ష ధారలు గురిపించి జీవన దాన మొనర్చు చున్నాడు: సత్పురుషులు తమంత తామే పరహితమును చేయుటకు పరమోత్సాహము కలిగి యుందురు కదా!
(భర్తృహరి సుభాషితం)
ఆరోప్యతే శిలా శైలే యత్నేన మహతా యథా
నిపాత్యతే క్షణేనా ధః తధాత్మా గుణ దోషయో:
అర్థము: పర్వతము మీదికొక పెద్ద శిలను యెక్కించుట కెంత యో ప్రయత్నము అవసరము. దానినే ఆచటి నుండి క్రిందికి త్రోసివేయుట ఎంతో సులభము.అట్లే మానవునికి మంచివాడని కీర్తి పొందుట చాలా కష్టము. చెడ్డవాడనిపించు కొనుట ఎంతో సులభము.(హితోపదేశం)
సర్వం పర వశం దుఃఖం ; సర్వ మాత్మ వశం సుఖం
ఏత ద్విద్యా త్సమానే న ; లక్షణం సుఖ దుఃఖ యో
అర్థము: ఇతరుల మీద ఆధారపడి జీవించడమే దుఃఖ దాయకము. స్వశక్తి మీద ఆధారపడి కార్యనిర్వహణ చేసుకో గలిగితే
సుఖము అని తెలుసు కోవాలి. సుఖ దుఃఖ స్వరూప సారాంశ మిదియే నని గ్రహించుము
నిముసమైనను మది నిల్పి నిర్మలముగ
లింగ జీవా వేశు లను గాంచి భంగ పడక
పూజ మదియందు జేయుట పూర్ణపదవి
పరము గోరిన నిది చేయ బాగు వేమా
అర్థము: పనులెన్ని యున్నా వేరు విషయముల గురించి ఆలోచింపక క్షణ కాలమైనను తీరిక చేసుకొని నిర్మల మైన మనస్సుతో,నిశ్చల మైన బుద్ధితో పరమాత్మను పూజిస్తే ముక్తి కలుగుతుందని వేమన చెప్తున్నాడు.
శౌచంతు ద్వివిధం ప్రోక్తం బాహ్య మాభ్యంతరం
మజ్జలాభ్యాం న్మృతం బాహ్యం భావ శుద్ది స్తదన్తరమ్
అర్థము: శుచి యనునది పై శుద్ది,లోపలి శుద్ది యని రెండు విధములు. శుభ్రమైన మట్టి చేత,జలము చేత (పూర్వము నదిలో స్నానము చేసి నదిలోని మట్టి నే రుద్దుకొని స్నానము చేసే వారు.అప్పుడు సబ్బులు లేవు కదా ) శరీరమును శుభ్ర పరుచుకోనుట,శుభ్ర
వస్త్ర ధారణ చేయుట బాహ్య శుచి అగును. అలాగే వైరాగ్యమను మట్టి చేతను కరుణ యను జలము చేతను హృదయమును శుభ్ర పరిచి దైవ భావము కలిగియుండుట యే అంతర శౌచ (శుద్ది) మనబడును.
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి