పంపా సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.
ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.
హంపిలో ఉన్న పంపా సరోవరం ఇదే ! |
"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.
రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.
హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.
రచన: యస్ వరలక్ష్మి