మానస సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు.
ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పెన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గరదాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నదిదాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒకసరస్సు సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరతవర్షే, భరతఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.
ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూవుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.
మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.
ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్నిభుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.
ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.
చాలామంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు.
ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.
ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.
రచన - సేకరణ : కళ్యాణ్ & కోటి మాధవ్ బాలు చౌదరి