రాఖీ |
పూర్వం దేవతలకు, రాక్షసులకు జరిగిన ఒక యుద్దంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేకపోయారు. అప్పుడు తన భర్త అయిన దేవేంద్రుడు గెలవాలన్న గట్టి కోరికతో ఇంద్రుని భార్య అయిన శచీదేవి, ఇంద్రునికి రక్ష కట్టింది. ఆమె కట్టిన 'రక్ష' మహిమ చేత ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించాడు. అందువల్ల శ్రావణ పౌర్ణిమ 'రక్షా పూర్ణిమ'గా ప్రసిద్ధి గాంచిందని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తుంది.
భారతీయ సైనికులకు రాఖీ కడుతున్న సోదరీమణులు |
రాఖీపౌర్ణమి చరిత్ర:
1. ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం
ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.2. హయగ్రీవావతారం
శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు.
అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
రాఖీ వేడుకలో చిన్నారులు ! |
3. బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి
రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్య రక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||
పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారికి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి.
ఉపనయనం చేసుకున్న వారు శ్రావణ పూర్ణిమ రోజున, పాత యజ్ఞోపవీతాన్ని(జంద్యాన్ని) విసర్జించి, కొత్తది ధరిస్తారు. అందువల్ల ఇది జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఇదే రోజున కొత్తగా ఉపనయనం అయినవారికి ఉపాకర్మ నిర్వహిస్తారు. దీనితో పిల్లవానికి వేదం చదివే అర్హత వస్తుంది.
ఈ రోజే హయగ్రీవజయంతి. శ్రీ మహావిష్ణువు విద్యాప్రదాత అయిన శ్రీ హయగ్రీవస్వామిగా దర్శనమిచ్చేది ఈ రోజునే. హయగ్రీవ ధ్యానంతో సర్వ విద్యలు లభిస్తాయి. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజూ జపించడం వలన విద్య యందు ఆసక్తి కలిగి, విద్యల్లో రాణిస్తారు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి