వాస్తు అంటే...... వసతి, నివాస గృహం, నివాస ప్రదేశం అనీ, శాస్త్రం అంటే...... శాసించేది, రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. పూర్వ కాలములో వాస్తుని విధిగా పాటించి గృహ నిర్మాణము చేసేవారు. ఆ మధ్య కాలములో, వాస్తు శాస్త్రమునకు కొంత ఆదరణ తగ్గిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు చాలా వరకు వాస్తు శాస్త్రజ్ఞులకు చూపించి ఇంటి నిర్మాణము చేస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే...... మానవ శరీరములో ఏ అవయాలు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి, ఎంత పరిమాణములో ఉండాలో అంత పరిమాణములో ఉంటే ఆ మానవుడిని ఎంత అందముగా ఉన్నాడో చూడు అంటారు. అలా కాకుండా ఏదో ఒక అవయవము లోపించినా లేక ఒక అవయవము ఎక్కువగా ఉన్నా, ఉండవలిసిన పరిమాణము కన్నా చిన్నదిగా లేదా పెద్దదిగా ఉన్నా(ఉదా: ఒక కాలు చిన్నది లేక పెద్దది )ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అలాగే మనము నిర్మాణము చేయదలచిన ఇంటికి కూడా ఏ గది ఎక్కడ ఉండాలో, ఎంత కొలతలతో ఉండాలో అలా నిర్మించుకుంటే ఇల్లు పొందికగా, అందముగా నివాసయోగ్యమవుతుంది.