ఈశ్వర తత్వానికి దగ్గర దారి-శివరాత్రి
కాలగమనంలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఎలా ఉన్నాయో, పూర్తి చీకటి– అమావాస్య వైపుకు తిరిగిన కాలంలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మ సంయమనం అనే మార్గాల ద్వారా ఈశ్వర తత్వానికి దగ్గరగా వెళ్లగలిగే సోపానాలే, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇవి మాసానికి ఒకమారు, సంవత్సరానికి ఒకమారు మనకు లభిస్తాయి. ఇది ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం. మహాశివరాత్రి రోజున జరిగే రుద్రాధ్యాయ పారాయణ నమక చమకంతో జరిపే అభిషేకాలు ఎంతో లాభదాయకాలు. సమస్త పాపక్షయానికి, అనావృష్టి నివారణకు, గోరక్షకు, అకాల మృత్యువు దోష నివారణకు, అభయానికి, నాయకత్వం పొందటానికి, వ్యాధి నివారణకు, సంతాన ప్రాప్తికి, కుటుంబ సంక్షేమం, తదితరాలకు మొదటి అనువాకం, ధనప్రాప్తికి, శత్రుక్షయానికి, విజ్ఞతప్రాప్తికి రెండవ అనువాకం, ఆరోగ్యానికి మూడవ అనువాకం, క్షయవ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యానికి నాల్గవ అనువాకం, మోక్షప్రాప్తికి అయిదవ అనువాకం, శివునితో సమానమైన పుత్రప్రాప్తికి అయిదు, ఆరు అనువాకాలు, ఆయువుకు ఏడవ అనువాకం, రాజ్యప్రాప్తికి ఎనిమిదవ అనువాకం, ధనకనక వస్తువాహనాలు, వివాహం జరగడానికి తొమ్మిదవ అనువాకం, సమస్త భయ నాశనానికి పదవ అనువాకం, తీర్థయాత్రలకు, జ్ఞానార్జనకు పదకొండవ అనువాకం, ఇలా సకల కార్యసిద్ధికోసం మహాశివరాత్రి అనువాకాలను ఉచ్చరిస్తూ అభిషేకం చేయడం ఆచారం. దీని తర్వాత శివునితో మమేకమవుతూ చమకంతో అభిషేకం జరుపుతారు.
శివరాత్రి మహత్యం!
మాఘ బహుళ చతుర్దశి… మహాశివరాత్రి. ఆత్మలింగోద్భవం జరిగిన రోజు ఇది. ఓసారి బ్రహ్మవిష్ణువులు నేను గొప్పంటే, నేనుగొప్పంటూ గొడవపడ్డారు. ఇద్దరు మూర్తుల అహాన్నీ కరిగించడానికి… పరమేశ్వరుడు తన విరాట్ రూపాన్ని చూపిన రోజే శివరాత్రి అని ఓ కథనం. వందే పార్వతీపరమేశ్వరౌ…అతడు సగం, ఆమె సగం. ఆమెతో కూడినప్పుడే శివుడు పరిపూర్ణుడు. అందుకే, పరమశివుడి జన్మదినంగా భావించే శివరాత్రి నాడే పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరుపుతారు. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, నోరారా నామస్మరణం…అంతకు మించిన శివానందం ఏం ఉంటుందీ! ఈరోజే శైవులు నిత్యధారణ కోసం విభూతి తయారు చేసుకుంటారని పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర చెబుతోంది. శివరాత్రి మహత్యాన్ని చాటే ఉదంతాలు ప్రాచీన తెలుగు సాహిత్యంలో అనేకం. చోరులూ జారులూ కూడా… తెలిసో తెలియకో ఉపవాసం చేసో, ఏ దురుద్దేశంతోనో శివాలయంలో దీపం వెలిగించో ముక్తిని పొందిన ఉదంతాలు కోకొల్లలు.
శివ అనే పదానికి
- శుభం,
- మంగళకరం,
- కల్యాణం,
- భద్రం,
- విశ్వశ్రేయస్సు,
- సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి.
విభూది
మానవులకు చావుపుట్టుకలు అనివార్యం. మరణించిన వ్యక్తి చివరకు పిడికెడు బూడిదగా మారి పంచభూతాలలో కలసిపోతాడు. ఈ సత్యాన్ని చాటేందుకే శివుడు శరీరం మీద బూడిద పూసుకుంటాడు. అలాగే ఎంత వైభవంగా బతికినా, ఎంత దీనంగా జీవించినా చివరకు చేరేది శ్మశానానికే. అందుకే ఆయన శ్మశానంలో నివసిస్తాడు.
మెడలో సర్పాలెందుకు?
కోరికలను సర్పాలతో పోల్చారు. కోరికలను నియంత్రించుకోవడమంటే ఇంద్రియాలమీద పట్టు సాధించడమే. పాములనే మెడలో ధరిస్తున్నాడంటే, కోరికల మీద, ప్రకృతి, మాయల మీద నియంత్రణ ఉన్నదని చాటడం కోసమే.
శిరస్సుపై చంద్రవంక
చంద్రుడు వృద్ధిక్షయలకు ప్రతీక. శుక్లపక్షంలో పెరుగుతూ, బహుళపక్షంలో తరుగుతూ ఉంటాడాయన. అటువంటి చంద్రుడిని శిరస్సుమీద ధరించడం ద్వారా తాను కాలాతీతుడు అనే విషయాన్ని తెలియచెబుతున్నాడు. మరోవిధంగా చెప్పాలంటే శివుడు గరళాన్ని మింగడం వల్ల ఆ వేడికి ఆయన కంఠం నల్లగా మారింది. ఆ వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇవ్వడం కోసమే ఆయన తన శిరస్సున నెలవంకను, గంగమ్మను ధరించాడని చెబుతారు.
త్రిశూలం, పులిచర్మం ఎందుకు?
త్రిశూలం సత్త్వ రజస్తమోగుణాలకు ప్రతీక. ఆ మూడుగుణాలమీద నియంత్రణ ఉన్నవాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలాన్ని ధరిస్తాడు. అదేవిధంగా çపులిచర్మాన్ని ధరించడం ద్వారా తాను ఇతరులచే ఛేదించలేనంతటి శక్తి కలిగిన వాడినని చాటుతున్నాడన్నమాట.
శివపూజా ఫలం
జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు, ఆయుః ప్రమాణం తక్కువగా వున్నవారు శివుని పూజించటంవల్ల మంచి ఫలితముంటుంది.
శివుడు బోళాశంకరుడు గనుక తెలిసి చేసినా, తెలియక చేసినా శివపూజ వల్ల, నామస్మరణం వల్ల సర్వపాపాలు పటాపంచలవుతాయి. గ్రహదోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.
దీర్ఘరోగులు, ఆయుష్షులో గండాలున్నవారు శివరాత్రినాడు మృత్యుంజయ మంత్రంతో లింగాభిషేకం చేస్తే చాలు– ఆయన అనుగ్రహంతో ఆయుష్షు మరికొంతకాలం పాటు పొడిగింపబడుతుంది.ఓంనమః శివాయ అనే మంత్రం అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సంసారమనే సముద్రాన్ని సులభంగా దాటించి మోక్షం ప్రసాదిస్తుంది.
బ్రహ్మహత్యాపాతకాన్ని సైతం పటాపంచలు చేయగలంత సర్వశక్తిమంతమైనది.
సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సంతాన సౌఖ్యం, సౌభాగ్యం శివసాయుజ్యం పొందాలంటే శివరాత్రినాడు రుద్రాభిషేకం శుభదాయకం.మహాశివరాత్రినాడు శివపురాణాన్ని పఠించినా, దానం చేసినా ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణోక్తి.
త్రిలింగేశ్వర:
మూడు మహాలింగాల మధ్య విలసిల్లుతోంది… తెలుగుజాతి! చుట్టూ మూడు శైవక్షేత్రాలు… మధ్యలో, నిద్రలోనూ ‘శివ…శివా’ అని కలవరించే భక్తజనం. ఆ దృశ్యాన్ని మనో మంటపం మీద ప్రతిష్ఠించుకుంటే – త్రిలింగదేశం ఆత్మలింగంలా ఆవిష్కృతం అవుతుంది.
1. ద్రాక్షారామం
ఇక్కడ నెలకొన్న శివుడు భీమేశ్వరుడు. దక్షుడు యజ్ఞం చేసిన చోటు ఇదేనంటారు. తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక, సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషాదంలో, సతీదేవి పార్థివదేహాన్ని భుజానికెత్తుకుని అడవులు పట్టుకు తిరుగుతాడు శివుడు. వెనకాలే మహావిష్ణువు పరుగులు తీస్తూ… ఆ నిర్జీవదేహాన్ని ఖండిస్తూ వెళ్తాడు. అమ్మవారి కణత భాగం నేలపాలైన చోటు ద్రాక్షారామమని ఐతిహ్యం. అగస్త్యమహామునీ, వ్యాసభగవానుడూ ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని భీమేశ్వరుడిని సేవించినట్టు పురాణ కథనం. తూర్పుగోదావరి జిల్లాలో ఉందీ క్షేత్రం.
2. శ్రీశైలం
‘సంధ్యారంభ విజృంభిత శ్రుతి శిరః స్థానాంతరాధిష్ఠితమ్…’ అంటూ శ్రీశైల క్షేత్ర సౌందర్యాన్ని వర్ణించారు ఆదిశంకరులు. మల్లికా పుష్పాలతో కొలిచిన ఓ రాకుమారిని అనుగ్రహించి పరమేశ్వరుడు ఇక్కడ మల్లికార్జునుడిగా కొలువుదీరాడు. అరుణుడనే రాక్షసుడు ఏ ఆయుధాలతోనూ తనకు మరణం లేకుండా వరం పొందాడు. ఆ ధైర్యంతో తాపసులను తీవ్రంగా హింసించేవాడు. ఆ ఘోరాన్ని చూడలేక అమ్మవారు…భ్రమరాంబగా అవతరించి, కోట్లాది భ్రమరాల్ని సృష్టించి అరుణుడి మీదికి ఉసిగొల్పారు. ఆ గాయాల దెబ్బకు అరుణాసురుడు నేలకూలాడు. భ్రమరాంబికా మల్లికార్జునులు కొలువైన ఈ క్షేత్రం… కర్నూలు జిల్లాలో ఉంది.
3. కాళేశ్వరం
గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానం కాళేశ్వరం. కాలుడంటే యముడు. ఈశ్వరుడంటే పరమేశ్వరుడే! ఇద్దరూ ఓ చోట వెలిశారు కాబట్టి…కాళేశ్వరమైంది. దీనికి సంబంధించి ఓ ఐతిహాసిక గాథ ఉంది. ధర్మం నాలుగుపాదాలా నడుస్తున్న రోజుల్లో… స్వర్గం కిటకిటలాడిపోయేదట. నరకంలో మాత్రం నరమానవుడు కూడా కనిపించేవాడు కాదట. దీంతో, యమరాజు వెళ్లి శివుడికి మొరపెట్టుకున్నాడు. ‘అంతా యుగమహిమ! త్వరలోనే నీకు రెండు చేతులా పని ఉండబోతోంది. అప్పటిదాకా నా పక్కన వెలసి పూజలు అందుకో…’ అని ఆదేశించాడట పరమశివుడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉందీ ఆలయం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి