విష్ణు సహస్రనామ స్తోత్రం మహామ:
విష్ణు సహస్రనామ స్తోత్రం మహామహిమాన్వితమైనది. మనము భగవంతుని స్తోత్రమందు నిత్యము పారాయణమందు వినియోగించచుకునేది, పూజాదులయందు ప్రతి నామము నమోంతంగా విడి విడిగా చెప్పుతూ వినియోగించుకునేది. మహాభారత కాలమందు చెప్పబడినటువంటి సమస్త స్తోత్రములకు కూడా మణిపూసాంటిది ఈ స్తోత్రం.' సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాట్
సహస్రము అంటే అనేకంగా ఉండే సంఖ్యకు సూచన.
సర్వసృష్టిలో విద్య - అవిద్య,
ఙ్ఞానము - అ ఙ్ఞానము,
ముక్తి - బంధనము,
సుఖము - దుఖము ...
ఈ ద్వంద్వాలు ఈశ్వర నిర్మాణమే, కాబట్టి అటువంటి ఈశ్వరుడిని ఏ ప్రకారముగా మనము తెలుసుకోవాలో అనే ప్రశ్న ఉత్పన్నమయినప్పుడు సమగ్రస్వరూపుడుగ సంపూర్ణముగా తెలుసుకోవాలి. సర్వానికి కారణ హేతివు అతడే అని తెలుసుకోవాలి. అవిద్య కూడా అతడే...అవేద్య కూడా అతడే! అందుకనే నామవళి లో " వేద్యాయ నమః" , " అవేద్యాయ్ నమః " అని ఉంది!
సృష్టికి కారణము సృష్టిలో మనకేదైనా వస్తువు పనికిరాదమే అభిప్రాయం గనక కలిగితే దానిని ఒలగించుకోవాలి. ఉదాహరణకు, ఒక తేలు ఉంది. తేలు చాల అపకారం చేసేది. అదినెక్కడ కనబడితే అక్కడే దానిని చంపేయాలి అనుకుంటే ఐ మీకు మాత్రమే...మీ స్వధర్మానికి అనుగుణముగా మాత్రమే ఉంటుంది. అంటే మీయొక్క ఆత్మరక్షణకు, మీ ఇంట్లో మీ పిల్లలకు అపకారం చేయకుండా వాళ్ళను కాపడుకోవటం కోసం మీరు ఆ పని హేస్తున్నారు అంటే అంత వరకే అది అన్వయము అవుతుంది. అసలు తేలు పుట్టడమే అధర్మం అనుకుంటే సృష్టిని అర్ధం చేసుకోక పోవటమే! అది ఎందుకు కుడుతంది? కుట్టడం దాని సహజ లక్షణం. కుట్టి ఎవరికో అపకారం చెయ్యాలని దానికి ఉండదు. ఆది కూడా పిల్లని కంటుంది, తన సంతానోత్పత్తికి అది హేతువు అవుతుంది...అదే ప్రకృతి!
మన క్షేమము కోసం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వస్తువును విసర్జిస్తూ ఉంటాము. పరిహైస్తాము. మనకు రుచికరమైనటువంటిది, మనకు సాధుస్వభావముగా ఉండేది. ఒకే పదార్ధం అది మన దృక్పధమే! కనుక సంపూర్ణమైన సృష్టిని సంపూర్ణమైన యధార్హ దృష్టితో ఎవరైతే తెలుసుకుంటారో వారు ముక్తులు అనబడతారు. ప్రత్యేకముగా ఒకానొక శాస్త్రమునగాని ఒకానొక ధర్మానికి గాని లోనై ఉండి మిగతా వాటిని తిరస్కరించే దృష్టి కలిగి ఉన్నవాడు అసమర్ధుడు!
విష్ణు సహస్రనామ స్తోత్రము
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
స్తోత్ర ఆవిర్భావము
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.అంపశయ్యపైనున్న భీష్ముడు
అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.విశ్వం అనే నామంతో మొదలైన సహస్ర నామ జపం సర్వ ప్రహరణాయుధ అనే వెయ్యవ నామంతో ముగుస్తుంది. ఈ ప్రధాన స్తోత్ర భాగంలో 108 శ్లోకాలలో వేయి నామములు పొందుపరచబడి ఉన్నాయి. పరమాత్ముని వివిధ లక్షణ గుణ స్వభావ రూపములు వివిధనామములలో కీర్తించబడ్డాయి. అనంత గుణ సంపన్నుడైన భగవానుని వేయి ముఖ్యగుణములను కీర్తించే పుణ్యశబ్దాలుగా ఈ వేయి నామాలను సాంప్రదాయికులు విశ్వసిస్తారు.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు రచించిన భాష్యము వీటిలో ప్రథమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.
వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఉదాహరణకు శంకరాచార్యులు "స్థవిరోధ్రువః" అని ఒకే నామమును పరిగణించగా, పరాశరభట్టు "స్థవిరః", "ధ్రువః" అనే రెండు నామములుగా పరిగణించెను. పరాశరభట్టు "విధేయాత్మా" అని తీసుకొనగా శంకరాచార్యులు "అవిధేయాత్మా" అని తీసుకొనెను. కాని ఇటువంటి భేదాలు చాలా కొద్ది.
ఇంకా కొన్ని నామములు పునరావృతమైనట్లుగా ఉంటాయి. ఉదాహరణకు విష్ణుః (మూడు సార్లు); శ్రీమాన్, ప్రాణదః (ఒక్కొక్కటి నాలుగు సార్లు); కేశవః, పద్మనాభః, వసుః, సత్యః, వాసుదేవః, వీరః, ప్రాణః, వీరహా, అజః, మాధవః (ఒక్కొక్కటి మూడు సార్లు); పురుషః, ఈశ్వరః, అచ్యుతః, అనిరుద్ధః, అనిలః, శ్రీనివాసః, యజ్ఞః, మహీధరః, కృష్ణః, అనంతః, అక్షోభ్యః, వసుప్రదః, చక్రీ (ఒక్కొక్కటి రెండేసి సార్లు) - ఇలా చెప్పబడ్డాయి. మొత్తం 90 నామాలు ఒకటికంటె ఎక్కువసార్లు వస్తాయి. కాని భాష్యకారులు ఒకే నామానికి వివిధ సందర్భాలలో వివిధ అర్ధాలు వివరించి, పునరుక్తి దోషం లేదని నిరూపించారు.
ఇంకా భగవద్గీతకు, విష్ణు సహస్రనామ స్తోత్రానికి అవినాభావ సంబంధము ఉన్నది. (రెండూ మహాభారతం లోనివే). ప్రత్యేకించి గీతలోని 10వ అధ్యాయము (విభూతి యోగము)లో భగవంతుని వర్ణించే విభూతులు అన్నీ విష్ణు సహస్ర నామంలో వస్తాయి. (ఉదాహరణ - ఆదిత్యః, విష్ణుః, రవిః, మరీచిః, వేదః, సిద్ధః, కపిలః, యమః, కాలః, అనంతః, రామః, ఋతుః, స్మృతిః, మేధా, క్షమః, వ్యవసాయః, వాసుదేవః, వ్యాసః). 11 వ అధ్యాయము (విశ్వరూప సందర్శన యోగము)లలో భగవంతుని వర్ణించే పదాలు అన్నీ విష్ణు సహస్ర నామంలో దాదాపుగా వస్తాయి. (ఉదాహరణ: తత్పరః, అవ్యయః, పురుషః, ధర్మః, సనాతనః, హృషీకేశః, కృష్ణః, చతుర్భుజః, విశ్వమూర్తిః, అప్రమేయః, ఆదిదేవః). ఇంకా గీత 2వ అధ్యాయములోని స్థితప్రజ్ఞ లక్షణాలు, 12వ అధ్యాయములోని భక్త లక్షణాలు, 13వ అధ్యాయములోని భగవద్గుణములు, 14వ అధ్యాయములోని త్రిగుణాతీతుని లక్షణాలు, 16వ అధ్యాయములోని దేవతాగణగుణాలు అన్నీ వేర్వేరు నామాలుగా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడ్డాయి.
శంకరాచార్యులు "గేయం - గీతా - నామ సహస్రం" అని రెండు పవిత్ర గ్రంధాలకూ ఎంతో ప్రాముఖ్యతను తెలియజెప్పారు
ఉత్తర పీఠిక
ఫలశ్రుతి
ఈ స్తోత్రం వలన కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్పబడ్డాయి. క్లుప్తంగా ఇదీ ఫలశ్రుతి:
ఈ దివ్య కేశవ కీర్తనను వినేవారికి, చదివే వారికి ఏవిధమైన అశుభములు కలుగవు. బ్రాహ్మణులకు వేదవిద్య, గోవులు లభించును. క్షత్రియులకు విజయము, వైశ్యులకు ధనము, శూద్రులకు సుఖము లభించును. ధర్మము కోరువారికి ధర్మము, ధనము కోరువారికి ధనము అబ్బును. కోరికలీడేరును. రాజ్యము లభించును. భక్తితో వాసుదేవుని నామములను శుచిగా కీర్తించేవారికి కీర్తి, శ్రేయస్సు, ప్రాధాన్యత లభించును. వారి రోగములు హరించును. వారికి బలము, తేజము వర్ధిల్లును.
పురుషోత్తముని స్తుతి చేసేవారిలో వ్యాధిగ్రస్తులు ఆరోగ్యవంతులవుతారు. బంధితులకు స్వేచ్ఛ లభించును. భయమునుండి విముక్తి కలుగును. ఆపదలు తొలగిపోవును. అట్టి భక్తుల కష్టములు కడతేరును. వాసుదేవుని భక్తులకు పాపములు తొలగును. వారికి అశుభములు, జన్మ మృత్యు జరా వ్యాధి భయములు ఉండవు. సుఖము, శాంతి, సిరి, ధైర్యము, కీర్తి, సస్మృతి లభించును. పుణ్యాత్ములగుదురు.
సకల చరాచర జీవములు, గ్రహ నక్షత్రాదులు, దేవతలు వాసుదేవుని ఆజ్ఞానుబద్ధులు. జనార్దనుడే సకల వేద జ్ఞాన విద్యా స్వరూపుడు. ముల్లోకాలలో వ్యాపించిన విష్ణువు ఒకడే. వ్యాసునిచే కీర్తింపబడిన ఈ స్తవమును పఠించిన, విన్న యెడల శ్రేయస్సు, సుఖము లభించును. అవ్యయుడైన విశ్వేశ్వరుని భజించినవారికి పరాభవమెన్నడును జరుగదు.
ఈ స్తోత్రంతో కలిపి చదివే ఈ స్పష్టమైన ఫలశ్రుతి మహాభారత పాఠంలో అంతర్గత విభాగం. దీనికి జనాదరణ కలిగించడానికి ఎవరో తరువాత అతికించినది కాదు. భాష్యకారులు తమ వ్యాఖ్యలలో ఫలశ్రుతిని కూడా వివరించారు.
ఉపదేశాలు
అర్జునుడు "పద్మనాభా! జనార్ధనా! అనురక్తులైన భక్తులను కాపాడు" అని కోరగా కృష్ణుని సమాధానం - "నా వేయి నామములు స్తుతించగోరే వారు ఒకే ఒక శ్లోకమును స్తుతించినా గాని నన్ను పొందగలరు"వ్యాసుడు చెప్పినది - "ముల్లోకములు వాసుదేవుని వలన నిలచియున్నాయి. అన్ని భూతములలోను వాసుదేవుడు అంతర్యామి. వాసుదేవునకు నమోస్తుతులు"
పార్వతి "ప్రభో! ఈశ్వరా! విష్ణు సహస్ర నామమును పండితులు నిత్యం క్లుప్తంగా ఎలా పఠిస్తారు? సెలవీయండి" అని విన్నవించగా ఈశ్వరుడు ఇలా చెప్పాడు - "శ్రీరామ రామ రామ యని రామనామమును ధ్యానించనగును. రామనామము వేయి నామములకు సమానము"
శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
బ్రహ్మ చెప్పినది - "అనంతుడు, వేలాది రూపములు, పాదములు, కనులు, శిరస్సులు, భుజములు, నామములు గల పురుషునకు నమోస్తు. సహస్రకోటి యుగాలు ధరించిన వానికి నమస్కారములు"
సంజయుడు చెప్పినది - "యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఉన్నచోట ఐశ్వర్యము, విజయము నిశ్చయంగా ఉంటాయి."
శ్రీ భగవానుడు చెప్పినది - "ఇతర చింతనలు లేక నన్నే నమ్మి ఉపాసన చేసేవారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. ప్రతియుగం లోను దుష్ట శిక్షణకు, సాధురక్షణకు నేను అవతరిస్తాను"
నారాయణ నామ స్మరణ ప్రభావము - "దుఃఖితులైనవారు, భయగ్రస్తులు, వ్యాధిపీడితులు కేవలము నారాయణ శబ్దమును సంకీర్తించినయెడల దుఃఖమునుండి విముక్తులై సుఖమును పొందుతారు." సమర్పణ శరీరముచేత గాని, వాక్కుచేత గాని, ఇంద్రియాలచేత గాని, బుద్ధిచేత గాని, స్వభావంచేత గాని చేసే కర్మలనన్నింటినీ శ్రీమన్నారాయణునకే సమర్పిస్తున్నాను. భగవంతుడా! నా స్తోత్రంలోని అక్షర, పద, మాత్రా లోపములను క్షమించు. నారాయణా! నీకు నమస్కారము.
అన్న ప్రణతులతో ఈ పుణ్యశ్లోకము ముగుస్తుంది
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
Good explanation,may all these knowledge has to be spread to the world
రిప్లయితొలగించండిThank you sir, very detail explanation. Now readers know where it was told, what it is and what are different uses to devotees who hear or read Vishnu Sahasra Nama. Hare Krishna.
రిప్లయితొలగించండి