చందనం, విభూతి, కుంకుమ... వీటిలో ఏది ధరించినా మంచిదేనంటోంది హైంధవ ధర్మం.
నుదుటిలో రెండు కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రంమీద వేలితో నొక్కుతూ సిందూరాన్ని దిద్దుకోవడంవల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తీ పెంపొందిస్తాయని యోగశాస్త్రం చెబుతోంది.
పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటనే ఎందుకు బొట్టు ధరించాలన్నదానికి అనేక కారణాలు ఉన్నాయి. నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తికేంద్రంగానూ అభివర్ణిస్తుంటారు.
అయితే అది పీనియల్ గ్రంథి స్థానమనీ దీనికీ మూడోకంటి అవశేషానికీ సంబంధం ఉందంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేస్తుందనీ మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు శాస్త్రనిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి ఎనలేని అందాన్నిస్తుంది కూడా.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి