యోగా
యోగా హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.
యోగము అంటే ఏమిటి?
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు.
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి.
భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి