నిర్మల చిత్తుడు, పరంథాముడు, మాధవుడు, సర్వం తానే అయిన పరమాత్మపై నిశ్చలభక్తిని పొందాలంటే దశకర్మలను ఆచరించాలి.
1. ఎవరు ఏ స్థానంలో ఉన్నారో, వారికి విధింపబడిన కర్మలు, ధర్మాలు ఏమిటో వాటిని నిక్కచ్చిగా ఎలాంటి ప్రలోభాలకు లోనుగాకుండా ఆచరించాలి.
2. వారివారికి విధింపబడిన సదాచారాన్ని క్రమం తప్పక పాటించాలి
3. భగవత్కథలు, సత్సంగాలు ఆలకించాలి. వాటిలోని సారాన్ని గ్రహించగలగాలి.
4. భగవన్మామ జపం, స్మరణం గావించాలి
5. భగవత్పూజ నిర్మలంగా చేయాలి
6. భగవద్భక్తులను గౌరవించి ఆతిథ్యమివ్వాలి.
7. వీలైనప్పుడల్లా పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సందర్శించాలి.
8. అనాథలందు, మూగజీవాలందు దయ, సేవ చూపాలి
9. చేసే ప్రతి సత్కర్మను భగవదార్పణం గావించాలి.
10. సాటివారియందు, సర్వులందు పరమాత్మను గాంచాలి.
భగవన్నామాలలో ఎంతో శక్తి దాగి ఉంది. అందుకే నామస్మరణకు ప్రాధాన్యం.
నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే
మోక్షానికి నామస్మరణ కన్నా గొప్ప ఉపాయం లేదు.
నామంలో భగవంతుని గుణ,మహిమ,తత్త్వాలు దాగి ఉంటాయి.అందువల్ల స్మరించిన వెంటన్నే స్వామి భావన మనస్సులో స్పురించి ఆనందమయం అవుతుంది.
ఇది "అర్ధ" పరమైన శక్తి. ఇదే కాక "శబ్ద పరమైన శక్తి " కూడా మంత్రములో దాగి ఉంటుంది .ఒకొక్క పేరులోనున్న అక్షరాల కూర్పులో ఉత్పన్నమయ్యేశబ్దం అద్భుతమైన దేవతా చైతన్యాన్ని జాహృతం చేస్తుంది. ఆ కారణంగానే నామోచ్చారణ మనలో దివ్యశక్తులను మేల్కోలిపి పాపాలను పోగొట్టి , చిత్త శుద్ధం చేసి భక్తిని,ఙ్ఞానన్ని పెంపొందింప జేస్తుంది.
నామ్నామకరి బహుదా నిజ సర్వశక్తిః"కృష్ణా ! అనేక నామాలను ఏర్పరిచి ,అందులో నీ సర్వశక్తులు ఉంచావు. వాటిని స్మరించడన్నికి నియమాలు ఏవి అవసరం లేదు...అటువంటిది నీ కృప ! '' అని చైతన్య మహా ప్రభు స్వామిని కీర్తించారు.
తత్రార్వితానియమితా స్మరణేన కాలః
ఒకొక్క నామంలో శక్తినీ,మాధుర్యాన్ని భక్తుడు ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాడు. అందుకే "శ్రీ రామ ! నీ నామమేమి రుచిరా! " అని తన్మయుడయ్యాడు భక్త రామదాసు!
రామనామ మహిమ:
రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఓ రోజున ఆమె వేళతప్పి వచ్చింది. 'నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటీ?' అని అడిగాడతడు. 'ఏరు దాటి రావాలికదా బాబూగారూ! పడవవాడు ఆలస్యంగా వచ్చాడు. అందుకే ఇంత జాగు' అంది ఆమె. అప్పుడా పూజారి 'ఓహో! పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటీ? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా?' అన్నాడు పరిహాసంగా. మరునాటి నుంచీ ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్లసాగింది. 'ఫరవాలేదే! ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే!' అంటూ మెచ్చుకున్నాడు పూజారి. 'మీరు చేసిన ఉపకారమే కదా బాబూ! డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు' అంది గొల్లత, కృతజ్ఞతాపూర్వకంగా.
'ఉపాయమా? నేను చెప్పానా!' అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. 'రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు? రామారామా అనుకుంటూ ఏటిమీద నడిచి వచ్చేస్తున్నాను' అంది ఆమె. ఇలా అంటున్నదేమిటీ అనుకున్నాడతను. 'ఏదీ చూద్దాం పద!' అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. 'రామరామరామరామ...' అంటూ గొల్లత ఏట్లో దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్లి తిరిగి చూసింది. పూజారి పంచెపైకెత్తి పట్టుకుని, 'రామరామరామ..' అంటూ మోకాటిలోతు నీళ్లలో తూలుతూ నడుస్తున్నాడు. 'మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటండీ బాబూ? పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటీ!' అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత. పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి