సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
ఆలయాల ప్రాముఖ్యత
శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.
ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.
తిరుచందూర్:
సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.
కుంభకోణం:
స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.
పళని:
ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
తిరుత్తణి:
తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పరిముదిర్ చోళై:
దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.
తిరువరన్ కున్రమ్
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.
గురుస్వరూపుడు:
నాగులచవితి అనగానే మనకు దీపావళి పండుగ తర్వాత జరుపుకునే పండుగ గుర్తుకువస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలోని నాల్గవరోజును నాగులచవితిగా జరుపుకుంటారు. ఆ తర్వాత రోజును నాగపంచమిగా పాటిస్తారు.
దీపావళి తర్వాత నాగుల చవితిని ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా శ్రావణమాసంలో జరుపుకునే నాగుల చవితిని, నాగ పంచమిని జరుపుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వెళ్ళి, పుట్టలో పాలు పోసి, స్వామిని ఆరాధిస్తారు.
కొందరు బంగారంతోకానీ, వెండితోకానీ, మట్టితోకానీ చేసిన నాగపడగలను దానం చేస్తారు. ఇలా చేయడం వల్ల సర్పదోషాలు పోతాయని భావిస్తారు. రైతులు ఈ నాగపంచమి, నాగుల చవితి రోజున భూమిని తవ్వడం, చదును చేయడం వంటి పనులు చేయరు.
సుబ్రహ్మణ్యస్వామి గురించిన ప్రత్యేక వ్యాసం...
గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు
పరమపురుషుడు – శివుడు (లేదా విష్ణువు), అవ్యక్త శక్తి – ఉమాదేవి (లేదా లక్ష్మి) వీరిరువురి సంయోగమైన సమన్యాయమూర్తి కుమారస్వామి. ఈయననే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నుతించాయి.
కుమారస్వామిని అర్చించడం అంటే, పార్వతీ పరమేశ్వరులను (లక్ష్మీ నారాయణులను) ఆరాధించడమే. బ్రహ్మచేత నిర్మితమైన అగ్నిమయ దివ్య శరణం (రెల్లుతప్ప) లో శివతేజం షణ్ముఖాకృతి ధరించిందని గాథ. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథలో ఇది ఒకటి.
కాలకాలుడు శంకరుడు ‘కాలాగ్ని’ అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే ‘సంవర్సరాగ్ని’, ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకొనే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే – పన్నెండు చేతులు ఆరు ముఖాలు. ద్వాదశ హస్తాలూ పన్నెండు మాసాలకు, ఆరు ముఖాలూ ఆరు ఋతువులకూ సంకేతాలు.
ఇక స్వామి కూర్చున్న మయూరం ‘చిత్రాగ్ని’ అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది. అగ్ని, అమృతాల సమైక్యమూర్తి (అగ్నీ సోమాత్మకం) సుబ్రహ్మణ్యుడు. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం, అమ్మవారు ఇచ్చినదే. ‘శివజ్ఞాన ప్రదాయిని’ అయిన శ్రీమాత ఇచ్చిన ఆ శక్తి బలం – జ్ఞానం. ‘అహంకారం స్కందం’ అని చెప్పబడ్డ ప్రకారం.... సృష్టిలోనూ, ప్రతి జీవులలోనూ ‘నేను’ అనే భావనే స్కంధుడు. మనస్సుతో కలిపి అయిదు జ్ఞానేంద్రియాలూ ఉన్న ‘అహంకారమే’ కుమారస్వామి. ఇచ్చ, జ్ఞాన, క్రియ – ఈ మూడు ఈ ఆరు ముఖాలతో సాగుతున్నాయి.
ఇచ్ఛా, జ్ఞాన, క్రియా రూప మహిశక్తిధరం భజే!కవిత్వ సంగీతాది విద్యల్లో కూడా అగ్రగణ్యుడు స్కందుడు. సుబ్రహ్మణ్యుని కవిరూపంగా వర్ణించాయి పురాణాలు.
శివశక్తి జ్ఞానశక్తి స్వరూకమ్!! (శివపురాణం)
‘పుట్టన్ బుట్ట శరంబునన్ మొలవ... ‘అనే పద్యంలో స్వామిని కవిగా పేర్కొన్నాడు పోతన. మహామహిమాన్వితమైన షట్కోణం షణ్ముఖునికి ప్రతీక, అన్ని కోణాలనుండి సమగ్రంగా విషయ జ్ఞానం సాధించగలిగే నిశితమైన బహుముఖప్రజ్ఞే ‘షణ్ముఖీ ప్రతిభ.’ బ్రహ్మ విష్ణు, శివాత్మక పరబ్రహ్మ శక్తిగా సుబ్రహ్మణ్యుని ‘మురుక’ అన్నారు. ‘ము’ కారస్తు ముకుంద: స్యాత్ ‘రు’ కారో రుద్రవాచక:! ‘క కారో బ్రహ్మనాదీ ఛ మురుకో గుహవాచకం!! (స్కందపురాణం) రహస్యమైన బ్రహ్మజ్ఞానమే ‘గుహ’ రూపం. అదే గురురూపం.
గురుస్వరూపుడైన – శివశక్తుల సమన్వయమూర్తి సుబ్రహ్మణ్యుని ఆరాధించి సకల శుభాలను పొందవచ్చు. కుమార స్వామి జననం స్కందపురాణంలో కుమారస్వామి జననం గురించి ఇలా వివరించబడింది. శివుడు ధ్యాననిష్టలో వున్న సమయంలో ఆయన తపస్సును భంగపరచడానికి మన్మధుడు వచ్చాడు.
మన్మధుడు ఉపయోగించిన కామశరాలు శివునిపై పడగా కోపించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరిచాడు. దాంతో మన్మదుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుని జ్ఞాననేత్రం నుంచి కదలిన జ్ఞానాగ్ని మన్మదుని భస్మం చేసి, ఆకాశాన పయనిస్తుండగా దాన్ని వాయువు సంగ్రహించి తాళలేక, మోయలేక అగ్నిదేవునికిచ్చాడు. అగ్నిదేవుడు కూడా శివుని తేజాన్ని తనలో నిలుపుకోలేక గంగాజలంలో పడేశాడు. ఆ దివ్యతేజాన్ని గంగ కూడా తనలో నిలుపుకోలేక శరవణంలో పడేసింది. ఆ రెల్లుపొదలో కుమారస్వామి ఆవిర్భవించాడు. అందువల్ల కుమారస్వామి శరవణుడు, శరవనోద్భవుడు అని కూడా అంటారు.
మంగళకరమైన శివుని మూడవ కంటినుంచి ఉద్భవించిన జ్ఞానకిరణమే కుమారస్వామి జన్మకు కారణమైంది. రూప విశిష్టం..... కుమారస్వామికి ఆరు తలలు వుండడం చేత షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి జ్ఞానస్వరూపం. అందుచేతనే అజ్ఞాన స్వరూపులైన రాక్షసులను హతమార్చాడు. అ జ్ఞానానికి ఆరు తాళాలుంటాయి. అవే – కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే అరిషడ్వర్గాలు. ఆ ఆరు దుర్గుణాలున్న అజ్ఞాన రాక్షసిని ఆరుతలలు ఉంటే తప్ప చంపలేరు.
దైవ సంపదయైన ఆరు తలలు కలిగి అసుర సంపదకు సంభవించిన అరిష్టద్వార్గాలనే ఆరు తలలను తుంచివేయాలి. ఇదే షణ్ముఖుని రూపవిశిష్టం. మార్గశిర మాసంలో శుద్ధ షష్టి రోజున వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం. భక్తులందరికీ ఎంతో పవిత్రమైనది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి