పల్లెల్లో న్యాయవ్యవస్థ
న్యాయము .. చట్టము.... ఆ రోజుల్లో న్యాయ పరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి తగు నిర్ణయం తీసుకునేవారు. కులపెద్దలే న్యామ మూర్తులు, వారి తీర్పే అంతిమం. కోర్టులు, పోలీసుల ప్రసక్తే వుండేది కాదు. కుల పెద్దలే పెద్దమనుషులు. ఒక వేళ ఎవరైనా పెద్ద మనుషుల మాటను కాదంటే వారికి విదించే శిక్ష ఏమంటే..... వారింటికి చాకలిని మంగలిని నిలిపి వేయడం. అటు వంటి సందర్భంలో చాకలిని,మంగలిని పిలిపించి వారితో పలాన వారికి శిక్ష వేశాము... వారి ఇంటికి 'పనికి' వెళ్ల కూడదు. అని తమ నిర్ణయం చెప్పేవారు. చాకలి, మంగలి పెద్ద మనుషుల మాటలను తప్పకుండా పాటించే వారు. అది నిందితులకు పెద్ద అవమానం. వ్వవహారాన్ని అంత దూరం రానిచ్చే వారు కాదు. మిగతా వూరి పెద్దలు నిందితులను ఒప్పించి రాజీ కుదిర్చే వారు. అంతటితో ఆ వ్యవహారం ముగిసేది. ఇంతకన్నా పెద్ద శిక్ష మరొకటి వుండేది.
అది నిందితుడు మాట వినక పోతే సాంఘిక బహిష్కరణ చేసె వారు. అంటే నిందితుని తో గాని, వారి ఇంటి వారితో గాని ఆ ఊరు వారెవ్వరు మాట్లాడ కూడదు. వ్యవసాయ పనుల్లో వారికెవ్వరికి సహాయం చేయ కూడదు. పండగ సందర్భాలలో దేవుని ముందు పొంగలి పెట్టెటప్పుడు అందరితో బాటు వారిని పొంగలి పెట్టనిచ్చేవారు కారు. ఇలా వుండేవి ఆనాటి శిక్షలు.
ఆ పెద్దమనుషుల తీర్పులు కూడా నిష్పత్తి పాతంగా వుండేవి.సర్వ జనాదరణ పొందేవి. రాను రాను ఈ వ్వవస్తలో చాల తొందరగా మార్పు జరిగింది. స్వార్థపరులైన కొందరు కుల పెద్దలు, లేదా వూరి పెద్ద మనుషులు తమ స్వార్థానికి అనుకూలంగా తీర్పు చెప్పి ఆదాయం గడించేవారు వచ్చారు. వారి ఆగడాలు మించి పోవడంతో ప్రజలలో వారి పై ఏహ్యభావం కలిగి వారివద్దకు పోవడం గాని, తీర్పు చెప్పమని కాని అడిగేవారు లేకుండా పోయారు. అలాంటి వారు మెల మెల్లగా రాజకీయాల వైపు మొగ్గు చూపి అలా స్థిర పడి పోయారు.
ఆ విధంగా రాజకీయాలు కలుషితం ఐపోయాయి. ఈనాడు సరైన కుల పెద్దలులేరు, అరా కొరా అక్కడక్కడా వున్న వారి మాట వినే పరిస్థితి లేదు. ఆపడానికి చాకలి గాని మంగలి గాని లేరు. బహిష్కరించడానికి ఎవ్వరు పొంగళ్లు పెట్టడమే లేదు. అంచేత. .. ఏదైనా వ్యవహారం ముదిరితే పోలీసులు, కేసులు, కోర్టులల్లో తేలాల్సిందె. ‘గ్రామ పాలన’ నాడు మునసబు, కరణాల ద్వారా నిర్వహించబడేది. వీరికి ‘తలారులు’ (కట్టుబడులు) సహాయకులుగా ఉండేవారు.
గ్రామంలో అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకోకుండా, అక్రమాలు జరుగకుండా, భూమివాదాలు రాకుండా వీరు శాంతిభద్రతలు కాపాడే వారు. జననమరణ రిజిష్టర్లు, రెవెన్యూ సంబంధిత విషయాలు పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి తమ సేవలందించే వారు. జ్ఞాన, వయోవృద్ధులు కూడా ప్రజల మధ్య తలెత్తే చిన్న చిన్న తగాదాలను పంచాయితీ రూపంగా తీర్చి ఇరువర్గాల వారిని సమ్మతింపజేసేవారు. భూమి పన్ను కట్టే వారికి ఓటు హక్కు ఉన్న రోజుల్లో గ్రామ ప్రజలు ఒక చోటచేరి చేతులెత్తి నాయకుని ఎన్నుకొనే వారు. ‘జిల్లా బోర్డులు’ అమల్లో ఉండే రోజుల్లో కూడా ఎన్నికలు నామమాత్రమై నాయకుని సాధ్యమైనంతవరకు ఏకగ్రీవంగానే ఎన్నుకొనే వారు. మొన్నమొన్నటి వరకు ‘పంచాయితీ’ ఎన్నికలు సక్రమంగా, శాంతియుతంగా జరిగి చక్కని పరిపాలన జరుగుతూ ఉండేది. గ్రామానికి కావలసిన వాడు, నైతిక విలువలకు కట్టుబడి ఉండేవారు. ఏ వర్గం వాడైనా ఒకటే అనుకొనేవారు. ప్రజాపాలన సక్రమంగా జరుగుతుండేది ఆ గ్రామాల్లో.
కుల గురువులు:
ఇది ఒక అతి పురాతన మైన సాంప్రదాయం. ప్రతి కులానికి కుల గురువుల వ్వవస్థ వుండేది. వారు ఒక పద్ధతి ప్రకారం అనేక పల్లెలను సందర్సిస్తారు ఆయావారి కులాచారాలను, గోత్ర నామాలను, ఇతరమైన కుల సంప్రదాయాలను చెప్పుతారు.
కులగురువులు కూడా ఆ కులానికి చెందినవారె. కాని వారి వ్వవహార మంతా బ్రాంహణుల లాగే వుండేది. వారి కులం వారైనా ఇతరులు వండిన పదార్తాలను తినరు. వారి రాకను ముందు గానె వర్థమానం వస్తుంది. వారు ఒక పల్లెకు వస్తే వారికొరకు ఒక ఇల్లు శుభ్రం చేసి వారికి అప్పగిస్తారు. వారు ఆఇంటిలో కొన్ని రోజులు ఉంటారు. ఆ కులానికి చెందిన గృహస్తులు ఆ చుట్టు పక్కల నున్న చిన్న పల్లెలలోనుండి వారికి కేటాయించిన రోజున ఆ గురువుల కుటుంబానికి వంటకు కావలసిన సకల వస్తువులు ముందు రోజే సమకూరుస్తారు. దాంతో ఆ గురు పత్ని వంట చేసి ఆతర్వాత పూజ చేసి ఆ గృహస్తుని పిలిచి అతని ఇంటి పేరు, గోత్రము కొత్తగా పుట్టిన వారి పేర్లు ఇలాంటి వివరాలు అదివరకే వారి వద్దనున్న వివరాలతో సరి పోల్చు కుని అవసరమైన వాటిని నామోదు చేసుకొంటారు. అలా ఆ కులానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల పల్లెలో వున్న ఆ కులపు వారందరు వారికి కేటాయించిన రోజున వచ్చి గురువులకు కొంత సంబావన సమర్పించి వారి నుండి ఆశీర్వాదాన్ని, ప్రసాదాన్ని స్వీకరించి వెళతారు. ఆ కులానికి సంబంధినిన వారందరు గురువులను సందర్సించు కోవలసిందే.
చివరి రోజున గురువుల కుటుంబాన్ని గౌరవ మర్యాదలతో సవారి బండిలో వారు నిర్ణయించు కున్న మరో గ్రామానికి సాగ నంపాలి. ఇలా ఆ కులగురువులు దేశాంతరాలు తిరుగుతూనే వుంటారు. ఆ కులానికి సంబంధించి జనాభా లెక్కలు అన్ని వారి వద్ద వుంటాయి. సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఒక సారి కులగురువులు కనిపించారు. ఆతర్వాత కనబడ లేదు. వీరు ఆ కులానికి సంబంధించిన పూర్తి స్థాయి జనాభాలెక్కలు సేకరించి పెట్టుకునే వారు. వివాహ సంబంధాలకు మొదలగు వాటికొరకు దాన్ని ఉపయోగించుకునే వారు. కొన్ని కులాలలో ఈ వ్వవస్త ఈ నాటికి వున్నది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి