దీపం జ్యోతి పరం బ్రహ్మం
దీపం జ్ఞాన చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయం సంధ్య వేళల్లో రెండుసార్లూ దీపారాధన చేయడం మన హైందవ ఆచారం. కొన్ని ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని అఖండ దీపం అని అంటాము. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది.దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలి స్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతిని వెలిగిస్తాము. విద్యుత్ దీపాల సంగతిని పక్కనుంచితే సంప్రదాయబద్దంగా వెలిగించే నూనె దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది.
దీపపు కుందిలో పోసే నెయ్యి లేదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతము. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి