రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడితో పని ఉండదు అన్నది ఒక నానుడి. దీనిని బట్టి ఆపిల్
ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. మన శరీరంలో గ్లూటా మిక్ ఆసిడ్ అనే రసాయనం ఉంటుంది. మన శరీరంలోని నాడీ కణాలు పాడై పోకుండా ఎప్ప టికప్పుడు వాటి సామర్ధ్యాన్ని ఈ గ్లూటా మిక్ ఆసిడ్ కాపాడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం నాడీ మండ లానికి మూలాధారం ఈ గ్లూటామిక్ ఆసిడ్. ఏదైనా కారణం వలన నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిస్త్రాణ, మతిమరుపు, అనాశక్తి, చికాకు, క్షణకోద్రేకం తదితర రుగ్మతలు వస్తాయి. వీటికి విరుగుడు ఆపిల్. అంటే నాడీ మండలాన్ని చైతన్యపరుస్తుంది ఆపిల్. దీనికి కారణం ఆపిల్‌లో అధికంగా ఉండే మిటమిన్ ఎ (300 ఐయు), ఫాస్పరస్, పొటాషియం తదితర లవణాలే. మరొక విధంగా చెప్పాలంటే ఆపిల్‌తో చలాకీతనం వస్తుంది. పై నానుడికి అర్ధం ఇదే. ఆపిల్ పుట్టిల్లు రష్యాలోని కాకసన్ పర్వత ప్రాంతం. అక్కడ నుండి దాదాపు అన్ని ఖండాలకు ప్రాకింది. ఆపిల్‌లో దాదాపు 200 వందల రకాలు ఉన్నాయి. కొన్ని నెలల పాటు నిలువ ఉండటం ఆపిల్ విశిష్టత. ఎ, సి విటమిన్లు, లవణాలు పుష్కలం, మాంసకృత్తులు, క్రొవ్వులు అత్యల్పం. పిండి పదార్థాలు కొద్ది మోతాదులో ఉంటాయి. అందువలన సులభంగా అరుగుతాయి.
100 గ్రాముల ఆపిల్‌లో పోషక విలువలు ఈ విదంగా ఉన్నాయి:
- పిండి పదార్థాలు 13.4 గ్రాములు,
- క్రొవ్వు పదార్థాలు 0.1 గ్రాములు,
- మాంసకృత్తులు 0.3 గ్రాములు,
- కాల్షియం 10 మిల్లీగ్రాములు,
- భాస్వరం 20 మిల్లీగ్రాములు,
- మెగ్నీషియం 7 మిల్లీగ్రాములు,
- ఇనుము 1.7 మిల్లీగ్రాములు,
- సోడియం 3 మిల్లీగ్రాములు,
- పొటాషియం 94 మిల్లీగ్రాములు,
- పీచు పదార్థం 1.0 మిల్లీగ్రాములు,
- శక్తి 56 కేలరీలు.
దంతాలకు, దంతాలపై ఉండే ఎనామిల్‌కు ఆపిల్ మేలు చేస్తుంది. అందువలన ఆపిల్‌ను
ముక్కలుగా కోసి తినే కన్నా, యధాతధంగా తినటం శ్రేయస్కరం. దంత సంరక్షణకు తోడ్పడుతుంది. అందుకే ఆపిల్‌ను ప్రకృతి ప్రసాదిత టూత్‌బ్రష్ అంటారు. రోజుకొక ఆపిల్ తినువారికి నోటి దుర్వాసన తగ్గుతుందట. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హృద్రోగాలు, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరగటానికి దోహదం చేస్తుంది. రక్తక్షీణత నుండి, శ్వాసకోశ రుగ్మతల నుండి, కాలేయ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆపిల్ పండునందుగల మూలికామ్లము క్షార పరావర్తనం చెంది రక్తంలోని ఆమ్లములను ఆకర్షించి, బహిష్కరించును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి