టీవీల్లో చెప్పిన మంత్రం నేను సాధన చెయ్యవచ్చా ?
తెల్లవారుఝామునే బాగా అత్తరు, పాండ్స్ పౌడరు పూసుకుని తయారయిన కొందరు గుమ్మడికాయలు మంత్రబలం, తంత్రజులుం అంటూ రకరకాల ప్రాయోజిత కార్యక్రమాల్లో ఒంటినిండా బంగారాలు దిగేసుకుని ఏవేవో మంత్రాలు చెప్పేస్తూ వాటిని రోజుకు ఒక పది సార్లు చదివేస్తే మీకున్న పది జన్మల క్రితం పాపాలు పది నిముషాల్లో పది ఆమడలదూరంలో పడిపోతాయని కిందా మీదా పడి పద్దతిగా పదబోధ చేసేస్తున్నారు. ఇటువంటి వాటికి నిజంగా అంత బలం ఉంటుందా? అటువంటి మంత్రాలు అలా ఉపదేశించవచ్చా? అవి సిద్ధిని కలిగిస్తాయా? ఎవరు పడితే వారు అలా చెప్పేసి రాసేసుకోమంటే మనకు రాసిపెట్టున్న తలరాతలు మారిపోతాయా? అంటే ముమ్మాటికీ కావు అన్న సమాధానం వస్తుంది కొంచెం తర్కం తెలిసున్నవాళ్ళ దగ్గరనుండి, సాంప్రదాయం పాటించే గురువుల నుండి.
మంత్రం ఉపదేశించాలంటే ఆ ఉపదేశం ఇచ్చే గురువులకు అంత సాధనా సంపత్తి ఉండాలి. వారు ఆ మంత్రాన్ని అనుభవించి, సిద్ధిని పొందిన తరువాత తమను ఆశ్రయించిన వారికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఒకొక్క మంత్రానికి ఒకొక్క నిర్దుష్టమైన ప్రయోగం, ఉపయోగం ఉంటాయి. మనకున్న శక్తి పరిధిని అనుసరించి ఆయా మంత్రాలను మనకు ఉపదేశిస్తారు. ఆ మంత్రాలలో ఉన్న బీజాక్షరాల సహితంగా ఆ శక్తిని నిక్షిప్తం చేసి తమ మంత్రశక్తిని కొంత రంగరించి మనకు ఉపదేశం చేస్తారు. గురువుల పాదాలను ఆశ్రయిస్తే నీకున్న శక్తిని గమనించి నీకున్న అర్హత, సామర్ధ్యాన్ని అనుసరించి కావలసినంత మంత్రం, ఎన్ని సార్లు సాధన చెయ్యాలో నిర్ణయించి నీకు అది నిర్దేశిస్తారు. అలాగే ఆ మంత్రానికున్న అంగన్యాస కరన్యాస పూర్వక ప్రయోగాన్ని ఉపదేశం చేస్తారు. గురువుల భౌతిక ఉనికి నీకు కావలసినంత శక్తిని ఇస్తుంది, నీకున్న ప్రతిబంధకాల్ని తొలగిస్తుంది. నిన్ను పరిశుద్ధుని కావించి ఆ మంత్రబలం నీకు సరిగ్గా అందేట్టు నీ సూక్ష్మశరీరాన్ని సిద్ధం చేస్తారు, కావున వారి పాదాలనాశ్రయించి వారివద్దనుండి వ్యక్తిగతంగా మంత్రాలను గ్రహించాలని శాస్త్రం చెబుతుంది.
నీకు ఒంట్లో కొంత నలత వలన జ్వరం చేస్తే దానికొక నిర్దుష్టమైన కారణం వుంటుంది. ఏదో టీవీ ఛానల్ లో డోలో 650 మృతసంజీవని లాంటిది, నేను చెబుతున్నాను రాసుకుని వాడండి అని ప్రకటన ఇచ్చాదనుకోండి, అది కొని రోజుకు నాలుగైదు సార్లు వాడితే కొంతసేపు నీకున్న జ్వరం తగ్గవచ్చు, లేదా నీకు అది పడకపోవచ్చు, లేదా దానివలన గ్యాస్ ట్రబుల్ రావచ్చు లేదా నీకు మరొక కారణం వలన ఆ జ్వరం వచ్చి ఉండవచ్చు, ఒక భిషగ్వరుడు/ వైద్యుడు నీ నాడి పట్టుకుని మొత్తం నీకున్న శరీర అర్హతను గమనించి సరైన మందు చెబుతాడు, దాని వలన మరొక రోగం రాకుండా ఉండడానికి pantop ఇవ్వవచ్చు, సరైన antibiotic ఇవ్వవచ్చు, రోగం తగ్గడానికి కావలసిన పధ్యం చెప్పవచ్చు లేదా మరికొన్ని నియమాలు చెప్పవచ్చు. కేవలం టీవీలో చూసుకుని నీ ఇష్టం వచ్చినట్టు మందులు వాడేస్తే కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు మొత్తానికి మరొక రోగంలో దింపనూవచ్చు. కాబట్టి సరైన ఫలితాలకోసం పూర్తిగా తెలిసున్న వైద్యుని వద్దకు పోతే నిన్ను పరీక్షించి నీకు తగ్గ మందులు, నీకు, నీ శరీర తత్త్వానికి సరిపడ్డా మందులు ఇచ్చి నిన్ను ఒక కంట కనిపెట్టి నిన్ను బాగు చేస్తాడు.
ఇదేవిధంగా నీ గురువు నీ అర్హత గుర్తించి నీ పరిధిని గమనించి నీకు ఆ మంత్రాన్ని తట్టుకునే శక్తి ఉందని నిర్ధారించుకుని ఎన్నిసార్లు జపం చెయ్యాలో, ఏ పద్ధతులను అనుసరించాలో, ఎటువంటి శౌచం ఉండాలో చెప్పి నీకు సంపూర్ణంగా ఆ మంత్రశక్తి అందేలా తగుజాగ్రత్తలు తీసుకుని నిన్ను ఉద్దరిస్తారు. వీరు గురు పరంపరగా ఆయా మంత్రాలను సాధన చేసి ఆ మంత్రాలను పునశ్చరణ చేసి ఆ మంత్రశక్తిని తమలో జీర్ణించుకుని నీకు ఆ మంత్రాన్ని ఇస్తారు. ఎలాగైతే నీ శరీరతత్త్వానికి తగ్గ మందు వైద్యుడు ఇస్తాడో నీ కోశాలకు తగ్గ మంత్రాన్ని గురువులు ఉపదేశిస్తారు. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే సరైన పద్ధతి ద్వారా గురువులను ఆశ్రయించి శరణాగతి చేసి మంత్రోపదేశం తీసుకోవాలి. ప్రతీదానికి ఒక పద్ధతి, నిర్దుష్ట ఉచ్చారణ, ప్రయోగ పద్ధతులు ఉంటాయి. వాటిని సరైన పద్ధతిలో గ్రహించి బాగు పడదాం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి