కోలాటం
భజనలు, కోలాటం కొన్ని వూర్లలో రామ భజను ప్రతి రోజు జరుగు తుంటాయి. సుమారు రెండు మూడు గంటలు జరిగే ఈ భజన కార్యక్రమంలో చాల మందే పాల్గొంటారు. చూసే వాళ్ళు వస్తుంటారు. అప్పుడప్పుడు కోలాటం కూడ ఆడుతారు. కోలాటం లో పాడె పాటలు కూడ భజన పాటలే. కోలాటం ఆడడము ప్రస్తుతమము అంత విస్తారముగా లేదు. రామ భజనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ విధంగా పల్లె వాసులు తాము ఏర్పాటు చేసుకున్న వినోధ కార్యక్రమాలు కాకుండా పండగల రూపంలో నిర్ణీత సమయానికొచ్చే వినోధం వుండనే వున్నది.
ఒక రకమైన సాంప్రదాయక నృత్యము. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం అనే పదం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట. సుమారు రెండు జానల పొడవున కర్ర ముక్కలను కోలలు అంటారు.
ఈ కర్రలను ప్రత్యేకమైన చెట్టునుండి సేకరిస్తారు. పెడమల చెట్టు కర్రలు వీటికి శ్రేష్టము. అది ఒక చిన్న ముళ్ల చెట్టు. దాని కర్రలు చాల గట్టిగా వుండి మంచి శబ్దాన్నిస్తాయి. ఇలాంటి వే మరికొన్ని కర్రలుంటాయి. అలాంటి చెట్టు కర్రలతోనె ఈ కోలలు తయారు చేసు కుంటారు. ఈఆటలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కోలలను పట్టుకొని పాట పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి కోలలను వేరొకరి కోలలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. దీనిని బట్టి ఈ కోలాటము అతి ప్రాచీనమైనదిగా తెలుస్తున్నది. కోలాటం గ్రామదేవతలైన ఊరడమ్మ, గడి మైశమ్మ, గంగాదేవి, కట్టమైసమ్మ, పోతలింగమ్మ, పోలేరమ్మ,ధనుకొండ గంగమ్మ బాటగంగమ్మ మొదలగు గ్రామ దేవతల/ కులదేవతల జాతర సందర్భంగా ఆడతారు.
కోలాటం ఆడె విధానం కోలాటం ఆడే వారు అందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు.కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా ప్రార్థన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కాళ్ళకు గజ్జెలతో చూడ ముచ్చటగా ఉంటారు. ఆట ఆడు తున్న వారి మధ్యలో నాయకుడు నిలబడి పాట పాడు తుండగా, ఇద్దరు మద్దెలను వాయిస్తుండగా మరొకరు తాళం వేస్తుంటారు. పంతులు పాడె పాటను మిగతా ఆడె వారు అనుకరించి పాడుతు కోలాటం ఆడుతారు. ఇది చాల ఉత్సాహ భరితమైన ఆట. ఈ కోలాటంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఒకటి ఉంది. దాన్ని జడ కోలాటం అంటారు. దాన్ని చాల నేర్పరులు మాత్రమే ఆడగలరు.
జడ కోలాటం కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచెట్టు క్రింద ఆడతారు. ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని రంగుల తాళ్లు కడతారు. అన్ని సరి సంఖ్యలో మాత్రమే వుండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును తమ నడుంకు కట్టుకొని లేదా ఒక చేతితో పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి ఒకరి తర్వాత మరొకరు వరుస క్రమంలో మారుతూ తిరుగుతూ కోలాటం ఆడుతుండగా ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్ధతిలో అల్లబడిన జడ లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్వతిరేక దిశలో ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్ధతిలో అల్లిన ఆ జడలో తెలిసి పోతుంది ఎవరు తప్పుచేశారనని. తిరిగి విడ దీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టాలి. సాధారణ కోలాటాలు మామూలె చాల నృత్యాల లాగ వుంటాయి. ఈ జడకోపు కోలాటం మాత్రమే అత్యంత క్లిస్టమైనది అసధారణమైనది.
జానపదం కోలాటం వీడియో
జానపదం కోలాటం వీడియో