వెంగమాంబ అనే పేరుతో ఎంతమంది స్త్రీమూర్తులు ఉన్నారో తెలియదు గానీ నాకు తెలిసిన వెంగమాంబలు ... తరికొండ వెంగమాంబ , రెడ్డిగుంట వెంగమాంబ , నర్రవాడ వెంగమాంబ ఉన్నారు .
అన్నమయ్యలాగా అపారమైన భక్తితో, సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వరస్వామిని కొలిచిన భక్తురాలిగా తరిగొండ వెంగమాంబ చరిత్రకెక్కారు. స్త్రీలలో కవులుగా ప్రసిద్ధికెక్కినవారు అట్టే లేకపోయినా, లభ్యమయిన వారి కథలు ఎంతో ఆసక్తికరంగా వుంటాయి. సాధారణంగా నాకు నచ్చేవి ఆడవారిలో కానీ మగవారిలో కానీ వారు ప్రదర్శించే వ్యక్తిత్వాలు. కష్షాలు జీవితంలో ఒకభాగం. వాటిని అధిగమించి తమ జీవితాలని మలుచుకోడం మానవనైజం. పూర్వకవులలో భీమనలాగే తరిగొండ వెంగమాంబ కూడా సారస్వతాభిమానుల ఆదరణ చూరగొన్న కవయిత్రి. భక్తకవయిత్రి తరిగొండ వెంగమాంబ 279వ, తాళ్ళపాక అన్నమాచార్యుల 601వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించి పునీతులైన భక్తులెందరో! అలా వేంకటేశ్వరుని నామంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయిన భక్తశిఖామణులలో తరిగొండ వెంగమాంబ ఒకరు. వెంగమాంబ భక్తిత్పరతకు సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడే కరిగిపోయాడట. అమృతధారలాంటి ఆమె గానానికి పరవశించిపోయాడట. అన్నమయ్య సంకీర్తనలకు మురిసి ఆనందంగా తల ఊపిన వేంకటేశ్వరుడు వెంగమాంబ కవితాగానానికి పరవశంతో నర్తించాడట. రమా పరిణయం, రాజయోగామృతసారం, వాశిష్ట రామాయణం వంటి ద్విపద కావ్యాలు, శ్రీకృష్ణమంజరి, నృసింహ శతకం మొదలైన శతకాలు, నృసింహ విలాసం, శివలీలా విలాసం, విష్ణుపారిజాతం, రుక్మిణీనాటకం వంటి యక్షగానాలతో పాటు, నలుగుపాటలు, జోలపాటలు, హారతిపాటలు, ఆరగింపు పాటలు, లాలిపాటలు కూడా రచించి ఆ శ్రీనివాసునికే అర్పించింది వెంగమాంబ.
తరిగొండ గ్రామంలో క్రీ.శ.1730 సంవత్సరంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులకు జన్మించింది వెంగమాంబ. పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది అన్నట్టుగా వెంగమాంబ బాల్యంనుంచే ఆ శ్రీనివాసుని మీద భక్తిప్రపత్తులతో మైమరచిపోయేది. తన ఈడు పిల్లల్లా ఆటపాటలతో కాలం గడపడం ఆమెకు నచ్చేది కాదు. అలాంటివాటికి దూరంగా ఉండేది. ఆ శ్రీనివాసుని అర్చనలు, ఆరాధనలే ఆమె ఆటపాటలయ్యాయి. సహజంగానే వెంగమాంబ ఈ పరిస్థితి ఆమె తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆ వయసులో ఉండవలసిన సహజమైన ప్రవర్తన ఆమెలో కనబడకపోవడంతో తమ కూతురికి ఏమవుతుందో అని తల్లడిల్లిపోయారు. కనీసం వివాహం చేస్తేనయినా ఆమె ధోరణి మారుతుందేమో.. అందరాడపిల్లల్లా ఉంటుందేమో అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవు వెంటనే వివాహం జరిపించారు. ఆ విధమైన జీవితం వెంగమాంబ ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం అవుతుందనీ... ఆమెను ఆమె దారినే నడవనివ్వాలనీ అనుకున్నాడో ఏమో భగవంతుడు ఆమెను బాలవితంతువుగా చేశాడు. భర్త మరణించినా కూడా ఆమె వితంతు జీవనానికి దూరంగానే ఉండిపోయింది. ఎందుకంటే మనసా, వాచా, కర్మణా ఆ వేంకటేశ్వరుడే తన పతి అని నమ్మింది. పుట్టుకతో వచ్చిన శిరోజాలు, చిన్ననాడే వచ్చిన బొట్టు, కాటుక, పూలు వంటి చిహ్నాలను మధ్యలో వచ్చిన భర్త మరణిస్తే ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనాటి సమాజాన్ని ప్రశ్నించింది. కాని ఆమె భావాలను సమాజం అంగీకరిస్తుందా? నిండు ముత్తైదువలా జీవిస్తున్న ఆమెను ఎన్నో విధాల తూలనాడింది అప్పటి సమాజం. ఆనాటి ఛాందసవాదులు ఆమెను ఎన్నో నిందలకు గురిచేసారు. ఎన్నో విధాల తూలనాడారు.. అవమానించారు. ఛాందసవాదం ఆమెలోని లోపాలను వెదకడానికే ప్రయత్నించింది తప్ప ఆమెలోని భక్తురాలిని, యోగినిని అర్థం చేసుకోలేకపోయింది. ఆమెలో పాండిత్యాన్ని గుర్తించి అంగీకరించలేకపోయింది. చివరకు ఆమె అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పరిచారు. ఈ పరిస్థితిలో తరిగొండలో ఉండలేక ఆ శ్రీనివాసుని సన్నిధే తనకు శరణ్యం అనుకొని తిరుమలకు చేరుకుంది వెంగమాంబ. అలా తిరుమల చేరిన వెంగమాంబ తన రచనలతో, కవితాగానంతో శ్రీనివాసుని అర్చిస్తుండేది. అప్పుడే శోభాయమానమైన తిరుమల మహత్మ్యాన్ని వర్ణిస్తూ ‘వేంకటాచల మహత్మ్యం’ రచించింది. ఆ వేంకటాచలవాసుని మీద ఎన్నో రమణీయమైన కీర్తనలు ఆమె నోటినుండి ఆశువుగా వెలువడేవి. సంతతధారగా వెలువడుతున్న ఆ కవితా ప్రవాహానికి అడ్డే లేకపోయింది.
భగవంతుడు తన భక్తులను అనుగ్రహించేముందు వారిని ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడుట. ఆ పరీక్షలలో నెగ్గితే తప్ప వారికి తన కరుణా కటాక్షాలనందించడట. జగత్తునేలే ఆ జగన్నాధుని సన్నిధిలో నివాసం కోసం వెతుకులాటలో పడింది వెంగమాంబ. ఆలయంలో కొన్నాళ్ళు, మండపాల్లో కొన్నాళ్ళు, తిరుమల కొండకోనల్లో ఉన్న గుహల్లో కొన్నాళ్లు కాలం గడుపుతుండేది. తంబురుకోన సమీపగుహలో చాలాకాలం తపస్సు చేసింది. ఇపుడు కూడా ‘తరిగొండ గవి’ అన్న పేరుతో ఉన్న ఆ గుహను మనం చూడవచ్చు. నివాసం కోసం వెతుకులాడే ఈ పరిస్థితి నుంచి తనను కాపాడమని ప్రశాంతంగా స్వామిని సేవించుకునేలా అనుగ్రహించమని శ్రీనివాసుని వేడుకుంది. భక్తురాలు ఆర్తిగా అడిగితే భగవంతుడు కాదండా...? లేదంటాడా? తన భక్తురాలు ఇంతగా పరితపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? అందుకే హథీరాం బాబావారి శిష్యపరంపరలో మహంతు మఠానికి అప్పటి అధిపతి ఆత్మారాందాసుకు కలలో కనబడి వెంగమాబు స్థిర నివాసం ఏర్పరచమని ఆదేశించారట. స్వామివారి ఆలయ సమీపంలో నివాసం ఏర్పరచబడింది. అక్కడే ఒక దిగుడు బావి తవ్వించి, తులసి వనాన్ని పెంచి స్వయంగా తన చేతులతో తులసిమాలలను అల్లి స్వామిని సేవిస్తూ ఉండేదట. ఇపుడు కూడా ఆ దిగుడుబావి అలాగే ఉంది. వెంగమాంబ భక్తిప్రపత్తులు, ఆమె కవితావైభవం గుర్తించిన అన్నమయ్య వంశీకులు స్వయంగా తమ నివాసంలోనే కొంత భాగాన్ని ఆమెకు అర్పించి గౌరవించారు. ఇక్కడ ఉన్నపుడే తిరుమల మాడవీధుల్లో భోగశ్రీనివాసుడు ఊరేగింపు వచ్చినపుడు ప్రతిరోజు తన ఇంటిముందు రాగానే వెండిపళ్ళెంతో హారతి హారతి ఇచ్చేదట. ఆ పరంపరగానే ఆ శ్రీనివాసుని సన్నిధిలో అన్నమయ్య వంశీకులు లాలిపాడితే వెంగమాంబ వంశీకులు హారతి పట్టడం ఆచారంగా కొనసాగుతోంది. ఆ మహాభక్తురాలు.. సాధ్వి.. సాక్షాత్తు శ్రీనివాసుని అంశంగా చెప్పబడిన వెంగమాంబ 1817 సంవత్సరంలో శ్రావణ శుద్ధ నవమినాడు సజీవంగా సమాధిలోకి ప్రవేశించారు. ఆ సమాధి, దానిమీద ఏర్పరచబడిన తులసి బృందావనం నేటికి కూడా శ్రీ వరాహస్వామి ఆలయానికి ఉత్తరంవైపున చూడవచ్చు.
చర్చనీయాంశంగా మారిన తరిగొండ వెంగమాంబ సమాధి వివాదం పాఠకులకు తెలిసింది. అయితే చిత్తూరు సమీపంలో ఉన్నదే సరైదని కొందరు, తిరుమలలో ఉన్న సమాధే నిజమైనదని మరి కొందరు వాదిస్తుండటంతో ఇటీవల టిటిడి ఓ కమిటీని వేసింది. ఈ కమిటీలో టిటిడి పాలక మండలి ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, శ్వేత సంచాలకులు, వెంగమాంబ ప్రాజెక్టు డైరెక్టర్ భూమన్, మైసూర్ ఆర్కియాలజికల్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి డాక్టర్ మునిరత్నంరెడ్డి, వెంగమాంబ గ్రంథ పరిష్కర్త కెజి కృష్ణమూర్తిలను కమిటీగా నియమించింది. సమాధి విషయాన్ని నిగ్గుతేల్చేందుకు వీరు చిత్తూరు సమీపంలోని రెడ్డిగుంటకు వెళ్లారు. ప్రచారం కొనసాగుతున్న వెంగమాంబ సమాధి వద్దకు వెళ్లి పలు కోణాల్లో పరిశీలించారు. అయితే గత చరిత్ర ఆధారంగా క్షుణ్నంగా పరిశీలిస్తే అక్కడున్న సమాధి వెంగమాంబది కాదని, అది వెంగమాంబ పేరుతో ఉన్న వేరే వారిదని గుర్తించింది. తిరుమలలో ఉన్న సమాధే నిజమైన వెంగమాంబ సమాధిగా నిర్ధారించి ఆ కమిటీ నిర్ధారణకు వచ్చి ప్రకటించింది.
నిర్ధారణలో తేల్చిన అంశాలు
1. రెడ్డిగుంటలో ఉన్నది వెంగమాంబ సమాధి కాదు. అక్కడున్నది క్రీస్తుశకం 1922 ఫిబ్రవరి 15వ తేదీ బుధవారం శివైక్యంకు చెందిన రెడ్డిగుంట మఠాధిపతి అయిన వెంగమాంబ సమాధి. ఆమె చనిపోయిన చాలా కాలం తరువాత ఈ సమాధి కట్టారు.
2. రెడ్డిగుంట ముఠాధిపతిగా ఉన్న ఆ వెంగమాంబ తల్లిదండ్రులు తిరుమలలోని తరిగొండ వెంగమాంబకు శిష్యులో లేక భక్తులో అయ్యుంటారు. అందువల్లే క్రీస్తుశకం 1799లో జన్మించిన తమ కూతురుకు తరిగొండ వెంగమాంబ పేరు పెట్టారు.
3. శిష్య సంప్రదాయానికి చెందినదైనందువల్ల ఆ వెంగమాంబ అన్నదానం, సాదు బృందాల కార్యక్రమాలను అనుసరించేవారు.
4. శిలాపలకం మొదట ఉన్న శివలింగం, నంది చిహ్నాలను, శాసనం చివర 'శివ జీవైక్య పదవిని చెందెను' అను వాక్యముంది. ఇది రెడ్డిగుంట మఠాధిపతి వెంగమాంబ శైవ సాంప్రదాయానికి చెందిందిగా భక్తులు నిరూపించారు.
5. తరిగొండ వెంగమాంబ నందవరీక బ్రాహ్మణ వంశంలో జన్మించింది. రెడ్డిగుంట వెంగమాంబ బ్రాహ్మణ వంశంలో జన్మించి ఉంటే ఆమె సమాధిపై శివలింగం, నంది చిహ్నాలుండవు. రెడ్డిగుంట శైవ మఠాధిపతియైన వెంగమాంబ పరమ శైవ సంప్రదాయానికి చెందిన భక్తురాలుగా తెలుస్తోంది.
6. శిలా పలకంలో ఉన్న లిపి, అంకెలు, రెడ్డిగుంట వెంగమాంబ, తరిగొండ వెంగమాంబ వేరు వేరని నిరూపించాయి.
7. ఈ విషయాలను వివరించిన తర్వాత అక్కడి స్థానికులు ఈ సత్యాన్ని పునరాలోచించి అంగీకారం తెలిపారు.
8. కాబట్టి తరిగొండ వెంగమాంబ సమాధి తిరుమల కొండపై ఉన్నదే అసలైన సమాధియని, అది వేరే వారిధి కాదని నిర్ధారించబడింది.
పై అంశాల ఆధారంగా తరిగొండ వెంగమాంబ సమాధిని నిర్ధారించినట్లు ఆ కమిటీ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా వెంగమాంబ సమాధిపై తిరుమలలో ఉన్న సమాధే అసలైన సమాధిగా గుర్తించినట్లు టిటిడి బుధవారం సాయంత్రం ప్రకటించింది.
రచనలు
వెంకమాంబ రచనలన్నీ వేదాంతము మరియు భక్తి ప్రధానమైనవే. ఈమె రచనలలో ముఖ్యమైనవి
పద్య కావ్యాలు
- వేంకటాచల మహాత్మ్యము
- అష్టాంగ యోగసారము
- ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
- రమా పరిణయము
- రాజయోగామృత సారము
- వాశిష్ఠ రామాయణము
- శ్రీకృష్ణ మంజరి.
- తరిగొండ నృసింహ శతకము
- నృసింహ విలాసము
- శివలీలా విలాసము
- బాలకృష్ణ నాటకము
- విష్ణు పారిజాతము
- రుక్మిణీ నాటకము
- గోపీ నాటకము
- చెంచు నాటకము
- ముక్తి కాంతా విలాసము
- జలక్రీడా విలాసము