పురిటి స్నానము:
ఒక స్టూలుపై అమ్మాయిని కూర్చొన పెట్టి, చేతికి పండు, తాంబూలము ఇచ్చి, స్టూలుకు నాలుగు వైపులా, చిన్న సైజు పసుపు ముద్దలు పెట్టాలి. ఒక కండువా లేక లుంగి ఎడమ భుజము మీదుగా కుడిచేతికిందకు రానిచ్చి ముడివేయుదురు. దీనిని కొలుగుడ్డ అంటారు. కిళ్ళీ నోటిలో వేసుకొనవలెను. నువ్వులనూనె రాసి నలుగు పెట్టి తలకిపోయవలెను. పసుపు ముద్దలు ఒళ్ళు తోముకోవలెను. ఒక ముద్ద తరువాత ఒకటి, వేడినీళ్ళలో పసుపు, వేపాకు కలపాలి. మామూలు కాన్పు అయితే చిన్న గిన్నెతో నీళ్ళు పొట్టమీదకు విసిరిపోయుదురు. స్నానము అయినాక చాకలి తెచ్చిన తెలుపు ప్రింటు చీర కట్టుకుందురు. కొల్లుగుడ్డ పిండి వుంచవలెను.
- గిద్దబియ్యము, పెసరపప్పు కలిపి అన్నము వండవలెను.
- ఒక పళ్ళెములో ఇస్తరాకు వేసి పులగము అన్నము చిన్న వుల్లిపాయలు, నల్లకారము, బెల్లముముక్క, పండు తాంబూలము పెట్టి ఆ ప్లేటును దొడ్లో పెట్టవలెను.
- బాలింత స్నానము అయినాక కొలుగుడ్డ, చాకుపట్టుకుని మజ్జిగలో వేపాకు మండతో వారుపోస్తూ మజ్జిగ చుక్క తీసుకుని 'పాలచుక్క మాకివ్వు, ఏటా బాలింత ఏటా శూలింత' అంటూ సూర్యభగవానునికి నమస్కారము పెట్టవలెను.
- ఈ అన్నము చాకలికి ఇచ్చెదరు. బాబుకు స్నానము అయినాక వడ్లజల్లెడ కాని, చాటలో కాని కాటను తెలుపుచీర వేసి పరుండపెట్టవలెను.
- పుణ్యవచనము అయినదాక 13, 15, 17, 19 రోజులలో నలుగుపెట్టి వరస స్నానము చేయించాలి. తలస్నానము అవసరము లేదు.
- 21వ రోజున నలుగుపెట్టి తలస్నానము చేసి, పొంగలి వండి, దేవునికి దీపారాధన చేసి పూజచేసి పొంగలి నైవేద్యము పెట్టిన, పూర్తి పురుడుపోయినట్లు. నెలలోపల ఒకసారి బాబును గుడికి తీసుకువెళ్ళాలి.
దొండకాయ, దోసకాయ, టమాటా, బజ్జి, కాకరకాయ, పాత చింతకాయ పచ్చడి, నల్లకారం, పొట్లకాయ, బీరకాయతో చేసినవి పెట్టవచ్చును. అట్టు, అరిశె, జున్ను 6 నెలలు తినకూడదు. వంకాయ, గోంగూర, ఆకుకూరలు 2 నెలలు తినకూడదు. 10 రోజులు రాత్రిపూట అన్నములో పాలు పోయుదురు.
బాబు స్నానము అయినాక, తల్లి స్నానము చేసి సూర్యునకు నైవేద్యము పెట్టి నమస్కరించిన దాక బాబును చూడరాదు.
కాట్రేట్ చీర:
ప్రసవించిన తరువాత 3, 5, 9 రోజులలో ఒకటే చీరను కట్టుకొనవలెను. ఈ చీర మామగారు తీసుకువెళ్ళి కోడలుకు ఇవ్వవలెను. మార్చుకొను సమయములో ఎవరూ వుండరాదు. తరువాత ఈ చీరను బాబుకు పక్కచీరగా వాడుకొనవచ్చును. బాలింత ఇంట వున్నవారు మాత్రమే ఈ చీర ఇచ్చెదరు. మామగారు లేని వాళ్ళు భర్త చేతితో ఇవ్వవలెను.
బ్రహ్మదేవుడు '60 సం|| ఆయుష్షు ఇవ్వగలనుగాని, 6వ రోజు చేతకాదు' అంటాడు. 5వ రోజు సాయంత్రం 5, 6 గంటల నుండి ఇలా అనుకొనవలెను. 'బ్రాహ్మడి కూతురు మాదిగవాని పెళ్ళాం ఏరమ్మ ఏరుదాటి మాఇంటికి రాకమ్మ'. 6వ రోజు ఉదయం వరకు అనుకుంటూ వుండాలి. ఆ రోజున పుట్టిన బాబును ఏ కొంచెము సమయము, ఒంటరిగా వుంచరాదు. ప్రసవించినప్పుడు 3వనెల వచ్చువరకు రెండుకాళ్ళు పక్కపక్కగా వుండునట్లు కూర్చొని లేదా పడుకొని వుండవలెను. గాలిలోపలకు పోకూడదు. బాలింతకు ఆహారములో తెలగపిండి పెట్టిన, బిడ్డకు పాలు సరిపోవును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి