పెండ్లి కుమార్తెను / కుమారుడిని చేయటం:
మేళము వాయించి మామిడితోరణము గుమ్మానికి కట్టి, పెండ్లికొడుకు / పెండ్లికూతురును చేయుట మొదలు పెట్టెదరు. తూర్పు వైపు ముఖము చూచునట్లుగా ముగ్గువేయాలి. ముగ్గుమీద 2 పీటలు వేయాలి. పీటలమీద తుండుగుడ్డ వేయాలి. అక్షింతలు చల్లాలి. కాళ్ళకు పారాణి, బుగ్గన చుక్క పెట్టి, పెండ్లికూతురు, తోడు పెండ్లికూతురునకు తాంబూలము ఇచ్చి కూర్చొనపెట్టవలెను, స్నానము చేయనవసరము లేదు. పెండ్లుకూతురునకు ఎడమవైపు తోడు పెండ్లికూతురును కూర్చొన పెట్టవలెను.
- హారతి పట్టినాక అక్షింతలు వేసి ఇద్దరికి బట్టలు పెట్టవలెను.
- మాడుకు చేతులకు నెయ్యిరాయవలెను.
- శనగపిండిలో నీళ్ళు కలిపి అది కూడా చేతులకు, ముఖము మీద రాస్తారు.
- సరదా సరదాగా రోలుకు, రోకలికి 5పోగుల దారమునకు పసుపురాసి, తమలపాకు లేక పసుపు కొమ్ము ముడివేసి 2తోరణములు కట్టెదరు.
- రోలులో 5పసుపు కొమ్ములు వేసి 5 లేక 9 మంది ముత్తైదువులు పసుపు కొట్టవలెను.
- ఈ పసుపు మెత్తగా కొట్టి తలంబ్రాల బియ్యములో కలుపుదురు.
ఒక పీటమీద తడి టవలు వేసి పసుపుతో గౌరమ్మను చేసి తమలపాకు మీద పెట్టి గొలుసు వేసి గౌరిపూజ చేయాలి. పూజ సామాను ముందుగా సర్దుకొనవలెను. ఈ పీట మీద మినపపిండితో కాని, శనగపిండితో కాని 5 లేక 8 మంది ముత్తైదువులు వడియాలు పెట్టుదురు. 9 లేక 11 ముత్తైదువులకు అమ్మాయి చేత గాజులు ఇప్పించెదరు. అమ్మాయికి కుడిచేతికి 11 గాజులు, ఎడమ చేతికి 10 గాజులు తొడుగుతారు. మొత్తం 21 గాజులు. పీటలమీద కూర్చొను ముందుగా కాళ్ళకు పారాణి, బుగ్గన చుక్క, తలలోపూలు పెట్టవలెను. పెండ్లికి ముందు అమ్మాయిని, తల్లిని, తండ్రిని కూర్చొన పెట్టి హారతి ఇచ్చి మంగళస్నానము చేయవలెను.
ముందుగా అబ్బాయిని పెండ్లికొడుకుగా చేసిన తరువాత ఆడపిల్లను పెండ్లికూతురుగా పీటలమీద కూర్చొనపెట్టవలెను. కనీసము 10నిమిషాలు తేడాగా జరుపవలెను.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి