పాన్పు వేయుట:
పెండ్లి అయినాక పెండ్లికూతురు, పెండ్లికూమారుడు, భోజనము చేసినాక నేలమీద దుప్పటి పరచి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చొనపెట్టాలి. పెండ్లి కుమారుడు తూర్పు ముఖం పెట్టి కూర్చోవాలి. ముందుగా పూలమాల వుండ చుట్టినట్లుగా చుట్టి చేండ్లాట ఆడించవలెను. అలాగే తాంబూలము చేతికి ఇచ్చి, బంగారు గొలుసుతో ఆడించవలెను. తరువాత సరిబేసి ఆడించవలెను. 2, 4, 6, 8, 10, 12 ఇవి సరి. 1, 3, 5, 7, 9, 11 ఇవి బేసి. రూపాయి బిళ్ళలు కాని, వక్కలు కాని ఒక్కొక్కరికి 100 ఇవ్వవచ్చును. అబ్బాయి గుప్పిడులో పట్టుకుని సరియా, బేసా అని అడిగినప్పుడు అమ్మాయి రైటు చెప్పిన అవివచ్చును. లేనిచో ఎన్ని బిళ్ళలు ఉన్న అన్ని అమ్మాయి ఇచ్చుకొనవలెను. ఖాళిచెయ్యి పెట్టినచో పుట్టి అందురు, దానికి 30 బిళ్ళలు ఇచ్చుకోవాలి.
- అబ్బాయి అమ్మాయికి ఎడమచేతితో బొట్టు పెట్టవలెను.
- అమ్మాయి చేత అబ్బాయికి కుడిచేతితో బొట్టు పెట్టించెదరు.
- అబ్బాయి చేత అమ్మాయికి గంధము పూయించెదరు. అమ్మాయి చేత అబ్బాయి చేతులకి గంధము పూయించెదరు.
- పన్నీరుకాని స్ప్రేకాని ఒకరిపై ఒకరు చల్లుకొందురు.
- ఒక అరటిపండు వలిచి అబ్బాయి తినిన తరువాత అమ్మాయిని తినమందురు.
బొమ్మను అందుకొనుట:
పెండ్లికొడుకు సోదరికి, బొట్టుపెట్టి పసుపు, కుంకుమ ఇవ్వవలెను. ఆ అమ్మాయి భర్తకు బట్టలు పెట్టవలెను. ఇద్దరు కొత్తబట్టలు కట్టుకొనవలెను. 1/4 మీటరు మల్లు గుడ్డలో చెక్కబొమ్మను వుంచి అటుచివర ఇటుచివర ఇద్దరు పట్టుకుని పెండ్లి కుమారునకు పెండ్లికుమార్తెకు మధ్యలో ఊయల ఊపుచూ ఆ బొమ్మమీద వసంతము కొద్దిగ పోయుదురు (వసంతము అనిన నీళ్ళలో సున్నము, పసుపు కలిపిన ఎరుపునీళ్ళుగా మారును). ఆ నీళ్ళు పెండ్లికుమార్తె ప్రక్కన వున్న సోదరుని తొడమీద పడవలెను. ఆ సోదరునికి, పెండ్లికుమారుని తండ్రి బట్టలు పెట్టవలెను. ఇచ్చునప్పుడు ఆడపడుచు అడగాలి పట్టెనిస్తావా - పాడి ఆవును ఇస్తావా అని. కొత్త దంపతులు పట్టెని ఇస్తాను, పాడి ఆవును ఇస్తాను అని చెప్పి చెక్కబొమ్మను దీనితో పాటు వెండిబొమ్మను ఇచ్చెదరు, దంపతుల చేత పేర్లు చెప్పించెదరు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి