పంచారామ క్షేత్రాలు. ఒకటి మినహా మిగిలిన అన్ని పంచారామాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండడం విశేషం
1. అమరారామము:
పంచారామ క్షేత్రాల్లో మొదటిది అమరారామం. గుంటూరు కు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.
2. ద్రాక్షారామము:
తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామ క్షేత్రం ఉంది.ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణువు ఆలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు. భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది.
3. సోమారామము:
పశ్చిమ గోదావరి భీమవరం సమీపంలోని గునుపూడి లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు. అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.
4. కుమార భీమారామము:
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపం లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం చుట్టూ పచ్చని పంటచేలతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిర నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.
5. క్షీరారామము:
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామ క్షేత్రం ఉంది. ఇక్కడి స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి పాలకొలను అని పేరు వచ్చింది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపైన పడతాయి. ఈ ప్రాంతం వారు ఈ ఆలయంలో వివాహం చేసుకుంటే వారి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని విశ్వాసం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి