ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ మరియు వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.
చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకుకు స్వర్ణ యుగం. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితోపాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు మరియు తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు.
కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో మరియు ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది మరియు ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు.
ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం వల్లంకలి అనబడే సర్పాకారపు పడవల పందెము, ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ, అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.
ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది, ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు మరియు కయ్యంకలి మరియు అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో, పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి మరియు తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి మరియు పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి.
పది రోజుల వేడుక - అతం పత్తిను పొన్నోనం:
ఓణం వేడుకలు ఓణానికి పదిరోజుల ముందు అతం (హస్త) దినమున ప్రారంభమవుతాయి. మహాబలి మరియు వామనుడుకి (విష్ణువు యొక్క ఒక అవతారము) ప్రతీకలుగా చతురస్రాకారపు పిరమిడ్ల వంటి మట్టి దిబ్బలను, పేడతో అలికిన ఇంటి ముంగిళ్ళలో ఉంచి పూవులతో అందముగా అలంకరిస్తారు. ‘ఓణపూక్కలం’గా ప్రసిద్ధమైన ఈ ఆకృతి, వివిధ రకముల పూలతో మరియు భిన్న రంగులతో కూడిన రెండు మూడు రకముల ఆకులతో వేయబడుతుంది, ఈ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ రంగవల్లికలో అలంకరిస్తారు. ఇది గొప్ప కళాత్మక భావములను సునిశితమైన దృష్టితో మిళితం చేసి రూపొందించిన ఒక అందమైన కళాకృతి. (ఇదే విధంగా ఉత్తర భారతీయులు రంగురంగుల పొడులతో "రంగోలి"ని రూపొందిస్తారు.) అది వేయటం పూర్తి అవగానే, చిన్న చిన్న తోరణములు వేలాడదీసిన ఒక చిన్న పందిరి నిలబెడతారు.
ఆ పండుగ యొక్క ముఖ్య పర్వం కొన్ని ప్రాంతములలో తిరువోణం నాడు ప్రారంభమవుతుంది మరియు ఇతర ప్రాంతములలో ఉత్రదం అనబడే తరువాతి రోజు ప్రారంభమవుతుంది. తిరుఓణం రోజు, రాజా మహాబలి ప్రతి మలయాళీ ఇంటికీ వెళ్లి తన ప్రజలను కలుసుకుంటాడని నమ్మిక. ఇండ్లు శుభ్రం చేసి పువ్వులతో మరియు సాంప్రదాయక దీపములతో అలంకరిస్తారు. తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతమును ఒక యదార్ధమైన అద్భుతలోకంగా (ఫెయిరీ ల్యాండ్) మార్చివేస్తుంది. ప్రతి ఇంటిలోనూ ఘనమైన విందు భోజనములు తయారుచేస్తారు. ప్రతి ఇంటిపెద్ద ఆ కుటుంబములోని సభ్యులందరికీ కొత్త దుస్తులు అందజేస్తాడు. కటిక దరిద్రుడు కూడా ఏదో రకముగా తనకు చేతనైన రీతిలో ఆ రాష్ట్రీయ పండుగను జరుపుకుంటాడు.
మలయాళం క్యాలెండర్ లో మొదటి మాసమైన చింగంలో ఓణం వస్తుంది. రాజా మహాబలికి స్వాగతం పలకటానికి ప్రజలు వారి ఇంటి ముంగిట్లో పువ్వుల రంగవల్లులు దిద్దుతారు. ఈ పువ్వుల రంగవల్లులు దిద్దటంలో పోటీలు జరుగుతాయి; ప్రపంచములో ఉన్న కేరళీయులు అందరూ ఈ పది రోజుల పండుగను అంగరంగ వైభవముగా మరియు ఉల్లాసముగా జరుపుకుంటారు. వారు కొత్త దుస్తులు ధరించి, వారు సందర్శించగలిగినన్ని దేవాలయములను సందర్శిస్తారు, మరియు తిరువధిరకలి తుంబి తుల్లాల్ వంటి నృత్యములను అభినయిస్తారు. రెండవ ఓణంగా పిలవబడే తిరుఓణం రోజున జరిగే గొప్ప విందు చాలా ముఖ్యమైనది. ఏది జరిగినా వారు ఆ గొప్ప విందును (సద్య ) వదులుకునేవారు కాదు. మలయాళంలో ఒక సామెత ఉంది "కనం విట్టుం ఓణం ఉన్ననం", దీని అర్ధం "మా ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చినా కూడా మేము తిరుఓణం విందును ఆరగించవలసిందే" ఇది తిరుఓణం నాడు జరిగే గొప్ప విందు యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.
వేర్వేరు ప్రాంతములలోని వేర్వేరు ఆచార వ్యవహారములకు అనుగుణంగా ఓణం పండుగ జరుపుకుంటారు. అతచామయం- అనబడే ఒక సాంప్రదాయ ఉత్సవం ఎర్నాకులం-కోచి సమీపంలో ఉన్న తృప్పూణిత్తుర అనే రాచనగరిలో, చింగం యొక్క అతం దినమున జరుగుతుంది, ఇది ఓణ వేడుకలకు ప్రారంభ సూచిక కూడా. త్రిక్కకర లోని వామనమూర్తి దేవాలయము వద్ద జరిగే వార్షిక ఉత్సవము కూడా, ఓణ సమయములోనే జరుగుతుంది. ఇది వామనుడి దేవాలయము మరియు ఓణం యొక్క పౌరాణిక నేపథ్యముతో దీనికి సంబంధం ఉంది.
"ఓణ పూక్కలం" (ఓణపు ముగ్గు) ను లౌకికత్వానికి చిహ్నముగా పరిగణిస్తారు. వివిధ రకముల పువ్వులన్నీ కలిసి అద్భుతముగా అగుపించే పూక్కలమును రూపొందుతాయి. కావున, ఇది మహాబలి సమయములోని పూర్వపు మంచి రోజులను ప్రతిబింబించాలి. అతం నుండి తిరుఓణం వరకు పూక్కలం రూపొందించటం కేరళలోని ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు చాలా ఆనందదాయకం.
మలయాళ నూతన సంవత్సరమునకు పక్షం రోజులలోనే వేడుకలు ప్రారంభమవుతాయి మరియు పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఆఖరి రోజైన తిరుఓణం చాలా ముఖ్యమైనది. కొత్త దుస్తులు, సాంప్రదాయ వంటలు, నృత్యము మరియు సంగీతములతో పాటు రాష్ట్రమంతటా పాటించే ఆచారములు, ఈ వ్యవసాయ పండుగకు చిహ్నములు.
వల్లువనాడ్ (ముఖ్యముగా ఒట్టపలం, షొర్నూర్ ప్రాంతములు) వద్ద, అద్భుతమైన దుస్తులు ధరించిన కథాకళి నర్తకులు పురాణములను అభినయిస్తారు. అలంకరించబడిన ఏనుగుల యొక్క అద్భుతమైన ఊరేగింపు త్రిస్సూర్ వద్ద బయటకు వస్తుంది, ఇక్కడే ముసుగులు ధరించిన నర్తకులు అందమైన కుమ్మట్టికలి నృత్యమును అభినయిస్తూ ఇంటింటికీ వెళతారు. కథాకళి నర్తకులు అభినయిస్తున్న పురాణములు మరియు జానపద కథలలోని సన్నివేశములను చూడటానికి చెరుతురుతి వద్ద, ప్రజలు గుమిగూడుతారు. కడువకలిగా కూడా ప్రసిద్ధమైన పులికలి, ఓణం సమయంలో సాధారణముగా కనిపించే దృశ్యం. ప్రకాశవంతమైన పసుపు, ఎరుపు మరియు నలుపు రంగులు పూసుకున్న నర్తకులు, ఉడుక్కు మరియు తకిల్ వంటి వాయిద్యములకు అనుగుణంగా నృత్యం చేస్తారు.
ఓణ రోజులలో అరంముల వద్ద, ప్రఖ్యాత అరంముల వల్లం కలి నిర్వహించబడుతుంది.
ఊయల, ఓణ వేడుకలలో మరియొక అంతర్భాగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతములలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అందముగా ముస్తాబైన యువతీ యువకులు ఒనప్పాట్ట్, లేదా ఓణం పాటలు పాడుతారు, మరియు ఎత్తైన కొమ్మల నుండి వేలాడగట్టిన ఊయలలో ఒకరిని ఒకరు ఊపుకుంటారు.
ఓణం కార్యక్రమములు:
ఓనక్కోడిగా పిలవబడే ఆ రోజున ధరించే కొత్త దుస్తులు, మరియు ఓణం సద్య, అని పిలవబడే విస్తారమైన విందు ఓణం ప్రత్యేకతలు. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపైన అన్నముతో పాటు కనీసం నాలుగు రకముల పదార్ధములు వడ్డించబడతాయి.
సాంప్రదాయక ఊరగాయలు మరియు అప్పడములు కూడా వడ్డిస్తారు. పాలు మరియు చక్కెరతో చేసిన 'పాయసం' సాధారణంగా వడ్డించబడుతుంది మరియు దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా ఉంటాయి.
ఓణం సమయంలో, ప్రజలు వారి ఇంటి ముంగిట్లో రంగురంగుల పువ్వులతో రంగవల్లులు అలంకరిస్తారు, దీనిని పూక్కలం అంటారు.చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకు పువ్వులను సేకరించి వాటిని పెద్ద పెద్ద ఆకృతులలో అలంకరించే పని అప్పగించబడుతుంది. ఈ పూల ఆకృతులను తయారుచేయటానికి ఓణం రోజు పోటీలు జరుగుతాయి. ఇది సాధారణంగా 1.5 మీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉంటాయి. ఈ ఆకృతిలో భాగంగా సాధారణంగా ఒక దీపం ఉంచుతారు. ఇటీవలి కాలంలో, ఈ పువ్వుల ఆకృతులు సాంప్రదాయక వృత్తాకారముల నుండి కేరళ ప్రజల జీవితాల యొక్క సాంస్కృతిక మరియు సామాజిక విషయములను ప్రతిబింబిస్తూ విలక్షణమైన ఆకృతులుగా పరిణామం చెందాయి.
వల్లంకలి (సర్పాకార పడవ పందెము) |
- వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేశుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా ఓణం సమయంలో, కేరళలోని హిందువులు త్రిక్కకర అప్పన్ (వామనుని రూపంలో ఉన్న విష్ణువు) మూర్తిని తమ ఇళ్ళలో ప్రతిష్ఠిస్తారు.
- కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవటంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది.
- ఈ వేడుక సమయంలో కేరళలోని హిందూ దేవాలయములలో అనేక దీపములు వెలిగించబడతాయి.
- దేవాలయముల ఎదుట ఒక తాటి చెట్టును నిలబెట్టి దాని చుట్టూ కొయ్య దుంగలను నిలబెట్టి ఎండు తాటి ఆకులతో కప్పుతారు.
- త్యాగము చేసి మహాబలి నరకమునకు వెళ్ళిన దానికి గుర్తుగా ఒక కాగడాతో దీనిని వెలిగించి బూడిద చేస్తారు.
ఇక్కడ క్లిక్ చేయండి.. >>
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి