నోము లేక వ్రతము ... అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.
ఆంధ్ర దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.
మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.
ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట..
సన్మార్గం వీడి చరియించువారల పట్టి కాపాడుటే వ్రతము . నియమ-నిబంధనలతో ఉపవాసము తో చేసే పూజ లేక అరాధన . వ్రతము లో సంకల్పము , దీక్ష , కథాపఠనము తప్పనిసరి . వ్రతము చేయుటవలన సమస్త పాపములు పోయి ... పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి , సర్వ సౌభాగ్యములు కలుగును . వ్రతాలను నోములని కూడా అంటారు .
కొన్ని రకాల నోములు:
- ఉదయ కుంకుమ నోము.
- పదారు ఫలముల నోము.
- పూర్ణాది వారముల నోము.
- సంపద శుక్రవారం నోము.
- వరలక్ష్మీ వ్రతం.
- దైర్యలక్ష్మీ నోము.
- నందికేశ్వర వ్రతం.
- మూగ నోము.
- వావిలి లక్ష్మీవారము నోము.
- పెండ్లి గుమ్మడి నోము.
- సూర్యచంద్రుల నోము.
- పోలి స్వర్గమునకు వెళ్ళు నోము.
- సావిత్రీ వ్రతం.
- గౌరీ వ్రతం.
- బొమ్మల నోము.
- పువ్వు తాంబూలము నోము.
- దంపతుల తాంబూలము నోము.
- శ్రావణ మంగళవారము నోము.
- రేగుల గౌరీ నోము.
- కేదారేశ్వర వ్రతం.
- సోమవార వ్రతం.
- చంద్రోదయ ఉమావ్రతము ,
- క్షీరాబ్ధిశయన వ్రతం.
- కోజగారీ వ్రతము ,
- పోలేరమ్మ వ్రతము.
- కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం.
- కేదారేశ్వర వ్రతం.
- చాతుర్మాస్య వ్రతం
- దూర్వాగణపతి వ్రతం.
- వట సావిత్రీ వ్రతము.
- రంభా వ్రతము ,
- వరలక్ష్మీ వ్రతం.
- కోజగారీ వ్రతము ,
- చంద్రోదయ ఉమావ్రతము,
- పాశుపత వ్రతము ,
- పోలేరమ్మ వ్రతము,
- మంగళ గౌరీవ్రతము ,
- శ్రావణ గౌరీవ్రతము ,
- శ్రీ సత్యనారాయణ వ్రతము
- ఋషిపంచమి వ్రతము - Rushipanchami ,
- అరుంధతి వ్రతం -Arundhati vratam
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి