ఓణం దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ. ఇది మలయాళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) వస్తుంది మరియు మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. శ్రవణా నక్షత్రమును మలయాళమున "తిరువోణము" అందురు. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొందురు.ఈ పండుగ పదిరోజుల పాటు కొనసాగుతుంది.
ఇది కేరళ యొక్క ఆచారములు మరియు సంప్రదాయములు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది. చక్కని పువ్వుల మాలలు, భోజనం, సర్పాకారపు పడవ పందెములు మరియు కైకొట్టికలి నృత్యము మొదలైనవన్నీ ఈ పండుగలో భాగములు.ఈ పండుగ రోజు, ప్రజలు కొత్త దుస్తులు ధరిస్తారు.మగవారు ఒక చొక్కా మరియు ముండు అని పిలవబడే లుంగీ వంటి క్రింది ఆచ్చాదనను, స్త్రీలు ముండు మరియు నరియతు అనబడే ఒక బంగారు పైఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ మరియు రవికె ధరిస్తారు. ఓణం కేరళలోని వ్యవసాయ పండుగ.
ఓణం ఆధునిక కాలంలో కూడా ఇంకా జరుపుకొనే ఒక ప్రాచీన పండుగ. మలయాళ మాసం చింగంలో వచ్చే కేరళ యొక్క వరికోత పండుగ మరియు వర్షపు పువ్వుల పండుగ, పాతాళం నుండి మావెలి రాజు యొక్క వార్షిక ఆగమనాన్ని వేడుకగా చేసుకుంటాయి. చరిత్ర పూర్వం నుండి కేరళ ప్రజలు మవేలి చక్రవర్తిని పూజించటం మూలంగా ఓణం ప్రత్యేకమైంది.
చరిత్ర ప్రకారం, మహాబలి పాలించిన సమయం కేరళకుకు స్వర్ణ యుగం.ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖంగా మరియు సిరిసంపదలతో ఉన్నారు మరియు ఆ దేశ ప్రజలందరూ తమ రాజుని చాలా గౌరవించేవారు. మహాబలికి తన సుగుణములన్నింటితోపాటు ఒక లోపం ఉంది. అతను అహంభావి. అయినప్పటికీ, మహాబలి చేసిన మంచి పనులన్నింటికీ మెచ్చి, తనతో ఎంతో అనుబంధం ఉన్న తన ప్రజలను సంవత్సరానికి ఒకసారి కలుసుకునేటట్లు దేవుడు అతనికి వరమిచ్చాడు.
ఓణం పండుగ ప్రాముఖ్యత:
మహాబలి యొక్క ఈ ఆగమనమునే ప్రతి సంవత్సరము ఓణం పండుగగా జరుపుకుంటారు. ప్రజలు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు మరియు తమ ప్రియమైన రాజుకి తాము సంతోషంగా ఉన్నామని చెప్పుకుని అతనికి శుభాభినందనలు తెలియజేస్తారు.
- కేరళ యొక్క ఘనమైన సంస్కృతీ వారసత్వం ఈ పదిరోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో మరియు ఆత్మతో బయటకు వస్తుంది. తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు) అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం. ఇది 11 నుండి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకముల భోజనం. ఓణసద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది మరియు ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చుని భోజనం చేస్తారు.
- ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం వల్లంకలి అనబడే సర్పాకారపు పడవల పందెము, ఇది పంపానదిలో జరుగుతుంది. ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ, అలంకరించబడిన పడవలను నడపటం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది.
- ఓణం నాడు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది, ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు. పురుషులు తలప్పంతుకలి (బంతితో ఆడేది), అంబెయ్యల్ (విలువిద్య), కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు మరియు కయ్యంకలి మరియు అట్టకలం అని పిలవబడే జగడములలో పాల్గొంటారు. స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమములలో మునిగిపోతారు. మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో, పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు. కైకొట్టికలి మరియు తుంబి తుల్లాల్ అనే రెండు రకముల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు. కుమ్మట్టికలి మరియు పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి.
- మహాబలి యొక్క పరిపాలన కేరళలో స్వర్ణ యుగంగా భావించబడుతుంది.
కేరళ ఓణం పండుగ సందర్బంగా ఊరేగుతున్న గజరాజులు. |
మహాబలి ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ, విష్ణువు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాదుని ఒడిలో ఉండగానే విష్ణువుపైన ప్రేమను మరియు భక్తిని అలవరుచుకున్నాడు.
మహాబలి ముల్లోకములను జయించుట
కశ్యపుడుకి ఇద్దరు భార్యలు, దితి మరియు అదితి, వీరు రాక్షసులు మరియు దేవతల (అసురులు మరియు దేవతలు) తల్లితండ్రులు. తపస్సు చేసుకోవటానికి హిమాలయములకు వెళ్ళిన కశ్యపుడు, తిరిగి వచ్చి అదితి శోకిస్తూ ఉండటాన్ని కనుగొంటాడు. దివ్య దృష్టితో కశ్యపుడు వెంటనే ఆమె బాధకు కారణమును కనుగొంటాడు. ఈ ప్రపంచములో దేవుని ఇష్టం లేకుండా ఏదీ జరగదనీ మరియు ప్రజలు వారి విధులు నిర్వర్తిస్తూ ఉండాలని చెపుతూ ఆయన, ఆమెను సమాధాన పరచటానికి ప్రయత్నించాడు. ఆయన, ఆమెకు విష్ణునును పూజించమని చెపుతూ పయోవ్రతమును బోధించాడు, ఇది కార్తీక మాసము యొక్క శుక్ల పక్షములో పన్నెండవ రోజు (శుక్ల-పక్ష ద్వాదశి) నుండి చేయవలసిన క్రతువు. అదితి భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించటం వలన, విష్ణువు ఆమెకు దర్శనమిచ్చి తను ఇంద్రునికి సహాయం చేస్తానని ఆమెకు తెలియజేసాడు.
ఇంకొక ప్రక్క, దేవతలను ఓడించి మహాబలి ముల్లోకములకు పాలకుడు అవటంతో దేవతలందరూ చాలా చిరాకు పడ్డారు. దేవతలు హింసించబడ్డారు. దేవతలు విష్ణువును కలిసి సహాయం అర్ధించారు. మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు మరియు అతను సురుడు (దేవుడు) అవటానికి అర్హుడు అని విష్ణువు దేవతలతో చెప్పాడు. దేవతలారా మీరు దీని గురించి ఈర్ష్య చెందకండి. అసూయ మిమ్ములను అసురులుగా చేస్తుంది. విష్ణువు మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు.
అదే సమయంలో, మహాబలి నర్మదా నది ఒడ్డున విశ్వజిత్ యాగం లేదా అశ్వమేధ యాగం నిర్వర్తిస్తున్నాడు. ఈ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తను ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు.
మహాబలి మరియు వామన |
ఆ యాగమును మరియు మహాబలి యొక్క ప్రకటనను అదునుగా తీసుకుని, వామనుడు (మహావిష్ణువు బ్రాహ్మణుడిగా మారువేషంలో) ఆ యాగశాల వద్దకు వచ్చాడు. అతను వారిని సమీపించగానే, అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్నపిల్లవాని యొక్క దివ్యమైన తేజస్సును కనుగొన్నారు.
- మహాబలి ఆ బ్రాహ్మణ బాలుని సకల మర్యాదలతో స్వాగతించాడు మరియు ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నతాసనములో కూర్చుండబెట్టాడు.
- సహాయం కోరుతూ వచ్చిన ప్రజలకు ఇచ్చే సాధారణ మర్యాదతో మహాబలి, వామనునితో ఆయన రాకతో తనను పావనం చేయటం తన అదృష్టమని చెప్పాడు.
- వామనుడు ఏది కోరుకుంటే, అది తీర్చటానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు.
- వామనుడు చిరునవ్వు నవ్వి ఈవిధంగా చెప్పాడు: "నువ్వు నాకు గొప్పది ఏదీ ఇవ్వనక్కరలేదు. నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు" .
సాంప్రదాయక దుస్తులలో ఉన్న ఒనపొట్టాన్, కేరళ ఉత్తర ప్రాథములలో ఒక ఆచారంఓణం సమయంలో ఒనపొట్టాన్ ఇంటింటికీ తిరిగి దీవెనలు అందిస్తాడు. ప్రస్తుతం ఒనపొట్టాన్ చాలా అరుదుగా అగుపిస్తున్నాడు, కేవలం గ్రామాలకే పరిమితమైనాడు.
వామనుడుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్న మహాబలి, తన గురువు మాటను మన్నించనందుకు ఆయనను క్షమాపణ కోరుకున్నాడు. పూర్వం, మహాబలి ఇంద్రునిపై యుద్ధానికి దండెత్తి వెళుతున్నప్పుడు, తన గురువైన శుక్రాచార్యుని కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసాడు మరియు ఆయన సలహాపైనే విశ్వజిత్ యాగమును ప్రారంభించాడు, దీని నుండే అతను కొన్ని శక్తివంతమైన ఆయుధాలను సంపాదించాడు. కేవలం శుక్రాచార్యుని సహాయం వలనే అతను ఇంద్రుడిని జయించగలిగాడు. మహాబలి తిరస్కారం శుక్రాచార్యునికి ఆగ్రహం తెప్పించింది.
ఆయన మహాబలిని ఈవిధంగా శపించాడు:
'నీ గురువు మాటలను లక్ష్య పెట్టనందుకు, నీవు బూడిద అయిపోతావు'.
మహాబలి దృఢంగా ఉండి ఈ విధంగా సమాధానం చెప్పాడు:
'నేను ఏ విధమైన పరిణామములను ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ నా మాటను వెనక్కి తీసుకోను'.
మహాబలి యొక్క ఏలుబడి ముగుస్తుంది
ఆ విధంగా చెపుతూ, అతను వామనుడుని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కొలవమని అడిగాడు.
- మహాబలిని వారించటానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నములన్నీ విఫలమయ్యాయి. తన వద్దకు సహాయం కొరకు వచ్చిన ప్రతిఒక్కరినీ దేవునిగానే మహాబలి భావించాడు మరియు వారు కోరినది ఏదీ అతను కాదనలేదు.
- మహాబలి తన గురువుతో ఈ విధంగా చెప్పాడు: "ప్రాణము (జీవం) మరియు మానము (మర్యాద) అనేవి మనిషికి రెండు కళ్ళ వంటివి. ప్రాణం పోయినా, మానం రక్షించబడాలి. ఇప్పుడు వచ్చిన వాడు దేవుడే అని తెలుసుకుంటే, మానవులకు అన్నీ ఇచ్చే భగవంతుడు, నా నుండి ఏదో ఆశిస్తున్నాడంటే, నేను చాలా అదృష్టవంతుడిని అవుతాను. " ఒకవేళ విష్ణువే తన క్రతువు వద్దకు వచ్చి ఏదైనా కోరుకుంటే, తను తప్పకుండా దానిని తీరుస్తానని కూడా మహాబలి గొప్పగా చెప్పాడు.
విష్ణువు యొక్క దీవెనలు:
రాక్షసుడు అయిన మహాబలి భక్తికి మెచ్చి, విష్ణువు (వామనుడు) అతనికి పాతాళమును
పాలించే వరం ఇచ్చాడు. ఒక మన్వంతరం అతను ఇంద్ర పదవిని అధిష్టించే వరం కూడా ఇచ్చాడు, ఆ విధంగా తన భక్తుని కోరికను నెరవేర్చాడు (ప్రతి మన్వంతరమునకు ఒకసారి ఇంద్ర పదవిని కొత్తవారు అధిష్టిస్తారు).
ఆఖరి వరంగా, మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు. ఆవిధంగా, తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరము వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్ధం కేరళ ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారు. ఆడిన మాట ("సత్యము") కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్థకం చేసుకున్నాడు.మహాబలి అనగా గొప్ప త్యాగము అని అర్ధం.
- ఓణం సమయంలో, విందు మరియు చక్కగా ముస్తాబైన ప్రజల యొక్క పండుగ ఉత్సాహం మహాబలి యొక్క మచ్చలేని పాలన సమయంలోని ప్రజల సుసంపన్నమైన మరియు నిజాయితీ అయిన జీవితానికి స్మృతిగా భావిస్తారు.
- ఓణం సమయంలో ప్రజలు కొత్త దుస్తులు (వస్త్రములు) ధరిస్తారు. 'వస్త్రము' అనగా హృదయము అని కూడా అర్ధం. ఆవిధంగా చెడ్డ ఆలోచనలను మరియు చెడ్డ భావములను తొలగించి హృదయమును నూతనముగా చేయటమే, కొత్త వస్త్రములు ధరించటం యొక్క ప్రాముఖ్యత. వారి మత అభిమానములను ప్రక్కన పెట్టి, ప్రజలందరూ కలిసికట్టుగా పవిత్రమైన 'తిరుఓణం' దినానికి స్వాగతం చెపుతారు.
తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.. >>
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి