పురూహుతిక కుక్కుటేశ్వర స్వామి ఆలయం, పిఠాపురం
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పురూహుతికా కుక్కుటేశ్వరస్వామి ఆలయం నెలకొని ఉంది. కుక్కుటేశ్వర స్వామి దేవాలయం కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల నంది అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైల్వే స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉందంటారు. మహా శివరాత్రి, శరన్నవరాత్రి, కార్తీక మాసం వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
మాణిక్యాంబ, శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామం
ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసి ఉంది. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం అలరారుతోంది. శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకేరకంగా ఉంటుంది.
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ
అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మవిజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం మనకు గుర్తుకొస్తుంది. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలం తో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమ లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో వేంకటేశ్వరస్వామి గుడి తర్వాత అత్యంత జనాకర్షణ కలిగిన ఆలయం. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంధ్రకోటి బ్రహ్మాండాలను కాపాడుతోంది. భక్తుల కోరికలు తీరుస్తున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ. ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి.అంతేకాక శ్రీ శక్తి పీఠాల్లో ఈ ఆలయం ఒకటి.
చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాఱడిపుచ్చి నయమ్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ
దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
ఆలయ చరిత్ర:
దుర్గాదేవి గుడి బంగారు శిఖరంతో అత్యంత శోభాయమానంగా ఉంటుంది. కనకదుర్గమ్మకు సంబంధించి మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది ఇంద్రకీలుని కథ, రెండోది అర్జుని కథ, మూడోది మాధవవర్మ కథ. ఇంద్రకీలుని కథ ప్రకారం ఇంద్రకీలుడు జగన్మాత భక్తుడు. అతను చిరకాలం భక్తితో అమ్మవారిని ఆరాధించి దుర్గాదేవి దర్శనం పొందాడు. అమ్మవారు ఎల్లప్పుడు తన వద్దనే ఉండాలని వరంకోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు తర్వాత జన్మలో నీవు కొండ రూపం ధరిస్తావని, ఆ కొండమీద తను మహాలక్ష్మి రూపంలో అవతరిస్తానని వరమిచ్చింది. పాండవమధ్యముడు అయిన అర్జునుడు అరణ్యవాస సమయంలో తన అన్న ధర్మరాజు ఆజ్ఞమీద ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని కొరకు తపస్సు చేసాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశించి, పాశుపతాస్త్రం కొరకు శివుని ఆరాధించమని చెప్తాడు. అలా అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు, ఒకానొక రోజు అతి భయంకరమైన పెద్ద పంది ఒకటి వచ్చి తపస్సుకి భంగం కలిగించసాగింది. తపోభంగమైన అర్జునుడు దాన్ని వేటాడసాగాడు. కాని అది చాలా చురుకుగా బాణాలనుంచి తప్పించుకొని పారిపోయింది. ఎట్టకేలకు అర్జునుడు గురిచూసి దాని మీదకు బాణం వేసాడు. కాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. అంతలో ఒక కోయదొర వచ్చి ఆ పందిని తీసుకొని వెళ్ళసాగాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని నేను సంహరించాను కాబట్టి ఆ పంది నాది అని వాదించసాగాడు. దానికి ఆ కోయదొర నవ్వాడు. దానికి కోపం వచ్చిన అర్జునుడు అతనితో ఎవరు గొప్పో తేల్చుకుందామని యుద్ధానికి దిగాడు. అర్జునుడు ఎన్ని దివ్యాస్త్రాలు వేసినా కూడా ఆ కోయరాజుని ఏమీచేయలేక పోయాడు. తన దివ్యాస్త్రాలు వృధాఅయిన కారణంగా అర్జునుడు తన విల్లు తీసుకొని ఆ కోయరాజు తలమీద కొట్టబోతాడు. అప్పుడు ఆ కోయరాజు మాయమై ఆ ప్రదేశంలో పరమశివుడు ప్రత్యక్షమై నవ్వుతూ కనిపిస్తాడు. పరమశివుని తో యుద్ధం చేసిన కారణానికి అర్జునుడు ఎంతో సిగ్గుపడి, బాధపడతాడు. తర్వాత శివుని స్తుతిస్తాడు. దానికి సంతసించిన శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చి, దాన్ని అత్యవసర సందర్భాలలో, అరుదుగా మాత్రమే వాడాలి అని చెప్తాడు. తర్వాత శివుడు అర్జునికి నిగ్రహం సాధించమని చెప్పి అప్పుడు మాత్రమే అస్త్రాలు లోకకళ్యాణం కు ఉపయోగపడతాయి అని చెప్పి మాయమవుతాడు. అర్జునికి వరాలిచ్చిన మల్లేశ్వరస్వామి శక్తి కనక దుర్గ . ఇంద్రుడిచేత కీలితం చేయబడ్డాడు కాబట్టి అర్జునికి ఇంద్రకీలుడు అని కూడా పేరు వచ్చింది. అర్జునికి ఉన్న విజయనామం వల్ల యీ ప్రాంతానికి విజయపురి, విజయవాటిక, విజయవాడ, బెజవాడ, బెజ్జువాడ అని పేర్లు వచ్చాయని చెప్తారు.
మాధవవర్మ కథ:
మాధవవర్మ కథ ప్రకారం పూర్వం విజయవాడను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతను అతి జాగ్రత్తతో ప్రజలను కన్నబిడ్డలకంటే ఎక్కువగా చూసుకొనేవాడు. అతను నిత్యం మల్లేశ్వరస్వామికి పూజ చేసేవాడు. ఒకానొక రోజు అతని కుమారుడు రధం మీద విజయవాడ పురవీధులలో తిరుగుతున్నాడు. కానీ అనుకోకుండా ఒక చిన్నపిల్లవాడు అతివేగంగా వెళ్తున్న ఆ రధచక్రాల క్రింద పడి మరణిస్తాడు. ఆ పిల్లవాడు ఆ రాజ్యంలో నివసిస్తున్న ఒక పేద బిచ్చగత్తె ఒక్కగానొక్క కుమారుడు. ఆమె వెళ్ళి మాధవవర్మకు అతని కుమారుని కారణంగా తన బిడ్డ చనిపోయాడు అని ఫిర్యాదు చేస్తుంది. మాధవవర్మ తన జీవితంలో ఎప్పుడూ తప్పుడు తీర్పులు చెప్పలేదు. అతనికి ప్రస్తుత పరిస్థితి పరీక్షలాగా మారింది. అతను వెంటనే భవిష్యత్తు రాజు అయిన తన కుమారుడికి మరణ శిక్షవేసి అమలు పరిచాడు. అతని తీర్పుకి సంతసించిన దుర్గాదేవి కనక వర్షం కురిపించింది. కాబట్టి ఆమెకు కనకదుర్గ అని పేరు వచ్చింది. మల్లేశ్వరస్వామి ఇద్దరి బిడ్డలకు తిరిగి బ్రతికిస్తాడు.
మంటపాల సమూహం దుర్గమ్మ ఆలయం
కనకదుర్గమ్మను దర్శించేలోపు అనేక మంటపాలు మనకు దర్శనం ఇస్తాయి.
- భవానీ మంటపం: బస్ దిగిన వెంటనే మనకు ఎడమ వైపు భవానీ మంటపం కనిపిస్తుంది. అక్కడ చాముండీ, మహాకాళి మొదలైన ఉగ్రమైన అమ్మవారి రూపాలు కొండ మీద చెక్కబడి ఉన్నాయి. భవానీ మాల వేసుకున్న భక్తులు అక్కడ పూజలు చేస్తారు. ప్రతీరోజు అక్కడ ఉత్సవమూర్తులకు కుంకుమార్చన చేస్తారు. ఇదివరకు కాలంలో అక్కడ ఒక కోనేరు ఉండేది. దానిని దుర్గాకుండం అని పిలిచేవారు. బ్రహ్మాండపురాణంలో దాని మహాత్మ్యం గురించి చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో దేవస్థానం వారు ఇప్పుడు ఒక బిల్డింగు కట్టేశారు.
- అశ్వథ్థవృక్షం: అమ్మవారికి ఎదురుగా ఒక అశ్వథ్థవృక్షం ఉంది. దాని క్రింద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ గుడికి ఆయనే క్షేత్రపాలకుడు .
- మల్లేశ్వరస్వామి : మల్లేశ్వరస్వామి గుడి మెట్లమార్గంలో నుండి వస్తుంటే మొదట కనిపిస్తుంది. మల్లేశ్వరస్వామి కనక దుర్గమ్మ భర్త. విఘ్నేశ్వరుడు, నటరాజ స్వామి, శివకామ సుందరిల గుళ్ళు దుర్గాదేవి గుడికి మల్లేశ్వరస్వామి గుడికి మధ్యలో ఉన్నాయి. యీ మూడు గుళ్ళు ఒకే వరసలో ఉంటాయి.
- నాగేంద్ర స్వామి: దుర్గాదేవి గుడి ప్రక్కన ఉన్న సుబ్రమణ్యేశ్వర స్వామి గుడిలో ఉన్నది. పెళ్ళైన స్త్రీలు సంతాన ప్రాప్తికోసం నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తారు.
- లక్షకుంకుమార్చన స్థలం: ఇది అమ్మవారి ధ్వజస్థంభం దగ్గర ఉంది.
- నిత్యపూజా స్థానం: పూర్వకాలంలో యీ ప్రదేశంలో ఉన్న శ్రీచక్రం దగ్గర నిత్యపూజలు నిర్వహించేవారు. కాని ప్రస్తుతం రద్దీ పెరగటం వలన నిత్య పూజలను ప్రాకార మంటపం లోనికి మార్చారు.
- కళ్యాణ మంటపం: పూర్వం యీ ప్రదేశంలో అమ్మవారి కళ్యాణం నిర్వహించేవారు. ప్రస్తుతం భవానీ మంటపంలో దుర్గాదేవి కళ్యాణం చేస్తున్నారు.శంకరాచార్య మంటపం: ఇది మల్లేశ్వరస్వామి గుడి ప్రక్కన ఉంది. ఇందులో ఆదిశంకరాచార్య స్వామి విగ్రహం ఉంది.
- చండీహోమ మందిరం: ఇది ఆదిశంకరాచార్య మంటపం ప్రక్కన ఉంది. ఇందులో ప్రతీరోజు చండీ హోమం చేస్తారు.ఇంకా కనక దుర్గ గుడి ప్రాంగణంలో నవగ్రహాలయం, శాంతి కళ్యాణ వేదిక, గోపీకృష్ణుని విగ్రహం, నిత్యాన్నదాన భవనం, అద్దాల మంటపం ఉన్నాయి.
దసరా తొమ్మిది రోజులు-తొమ్మిది అవతారాలు:
- మొదటి రోజు – శ్రీ బాల త్రిపుర సుందరీదేవి
- రెండవ రోజు – శ్రీ అన్నపూర్ణాదేవి
- మూడవరోజు – శ్రీ గాయత్రీదేవి
- నాల్గవ రోజు – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఐదవరోజు – శ్రీ మహాలక్ష్మీదేవి
- ఆరవరోజు – శ్రీ సరస్వతీదేవి
- ఏడవరోజు – శ్రీ దుర్గాదేవి
- ఎనిమిదవ రోజు – శ్రీ మహిషాసురమర్దినీ
- తొమ్మిదవ రోజు – శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.
విజయవాడ బస్టాండ్ నుండి, రైల్వేస్టేషను నుండి కనక దుర్గమ్మగుడి వద్దకు వెళ్ళటానికి దేవస్థానం వారు ఉచిత బస్ సర్వీసులు నడుపుతున్నారు. కొండ మీదకు ఘాట్ రోడ్డు ఉంది. ఆటోలు, టాక్సీలు కూడా కొండ మీదకు వెళ్తాయి. కొండ మీదకు వెళ్ళటానికి మెట్లమార్గం కూడా ఉంది. విజయవాడ రైల్వే జంక్షన్ కావడంతో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. విమానాల్లో రావాలనుకునే భక్తులు గన్నవరంలో దిగి దేవస్థానానికి రావచ్చు. హైదరాబాద్ నుంచి 275 కిలోమీటర్ల దూరంగా విజయవాడ ఉంది. అక్కడ్నించి బస్సు, రైలు, విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. గన్నవరం విజయవాడకు 30కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకూ అమ్మవారిని దర్శించుకోవచ్చు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి