2008, జనవరి ,21న మేరీ స్మిత్ జోన్స్ మరణించింది. ఆమె అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో ఇండియన్ మూలాలకు చెందిన ఒక సాధారణ ఆదివాసీ మహీళ. జార్ఖండ్ రాజధాని రాంచీకి ఆనుకొని వున్న అనాగరిక ప్రాంతాల్లోని సంతల్లో తిరిగే ఒక మహిళలానో , లేకపోతే రాజమహళ్ళకు సుదూరంగా కొండకోనల్లో పర్వత పంక్తుల్లో నివసించే బిర్ హార్, అసుర్ లేదా ఇతర కొండప్రాంతపు ఆదివాసీ గుంపుల్లో సభ్యురాలి వంటి స్త్రీ ఆమె. అంతర్జాతీయ స్తాయీ గౌరవాలు పొందటం వల్లనో , గొప్ప గొప్ప పనులు చేయడం వల్లనో మనం ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరంలేదు. ఆమె ఒక సాధారణ మహిళ మాత్రమే కానీ 1918 మే 14న పుట్టిన మేరీ స్మిత్ 2008 జనవరి 21న తన తన ఆఖరి శ్వాస తీసుకుంటున్న సమయంలో ప్రపంచం చూపులన్నీ ఆమెమీద కేంద్రీకృతమయ్యాయి. ఎందుకంటే ఆమె అమెరికాలోని సౌత్ సెంట్రల్ అలాస్కాలోని కొర్దోవా ప్రాంతములోని ఇయాక్ ఆదివాసీ సమూహంలో తమ మాతృభాష అయిన ఇయాక్ లో మాట్లాడడం తెలిసిన చివరి మహిళ. ప్రపంచంలోని 6000 భాషలలో ఒకటైన ‘ ఇయాక్ ‘ 2009 జనవరి 21న మేరీ స్మిత్ మరణంతో ఈ ప్రపంచం నుండి పూర్తిగా నిష్క్రమించింది. 21వ శతాబ్దంలో భాషలు మరణిస్తున్న సందర్భం ఇదొక్కటే కాదు. 20వ శతాబ్దంలో వలసరాజుల కాలంలోనూ , తర్వాత కాలంలోనూ వందల సంఖ్యలో భాషలు ఈ ప్రపంచం నుండి అదృశ్యమయ్యాయి. మేరీస్మిత్ జోన్స్ ను స్మరించుకోవడానికి ఇంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఇది ఒక భాష మరణిస్తున్న తాజా సందర్భం అవటమే.
యునెస్కో ‘ప్రమాదంలో ప్రపంచ మాతృ భాషలు – 2017’ అనే రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టులో 196 భారతీయ భాషల అస్థిత్వం కూడా ప్రమాదంలో ఉందని తెలియజేస్తుంది. ఈ 196 భారతీయ భాషలలో 8 భాషలు ( ‘ ఆంగిక ’ భాషను కలుపుకుంటే 9 ) జార్ఖండుకు చెందినవి. ఒబామా కేవలం 20 భారతీయ భాషలను గురించి మాట్లాడితేనే మీడియా దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. కానీ యునెస్కో ప్రకటనను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీటిలో ఏవో కొన్ని మినహాయిస్తే అన్నీ ఆదివాసీ భాషలే. ఈ ఆదివాసీ భాషలన్నింటినీ ఒబామా చెబుతున్న భాషలే మింగివేస్తున్నాయి.భారతదేశంలో 1650 భాషలూ, మాండలీకాలూ ఉన్నాయి. వాటిలో 400 భాషలు వాడుకలో ఉన్నాయి. రాజ్యాంగపరంగా చూస్తే 22 భాషలు మాత్రమే అధికార భాషలుగా గౌరవం పొందుతున్నాయి. వాటిలో సంతాలీ , బోడో మాత్రమే ఆదివాసీ భాషలు. యునెస్కో విడుదల చేసిన భాషల స్థితిగతుల రిపోర్టు 2009 ( 20 ఫిబ్రవరి 2009 ) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1500 భాషల పరిస్థితి గురించి వివరణ ఇవ్వబడినది. ఈ భాషలన్నీ 21వ శతాబ్దాంతానికి మృతభాషలుగా మారనున్నాయి. ఈ క్రమం 5 విభాగాలుగా గుర్తించింది. మొదటి విభాగంలో ఇప్పటితరం మాట్లాడడనికీ, వ్యవహారానికీ భాషగా వినియోగించకుండా ఎప్పుడైనా బలవంతంగా ఇంట్లో మాట్లాడే భాషలు. 2వ విభాగంలోనూతన తరం తమ మాతృభాషగా స్వంతం చేసుకోవడానికి నిరాకరించే భాషలున్నాయి. తాతలూ,నానమ్మలు మాట్లాడగలిగితే , తల్లిదండ్రులు కేవలం అర్ధం చేసికోగలుగుతారు. కానీ నూతన తరానికి ఏమీ తెలియని, అర్ధం కాని భాషలు మూడవ తరంలో ఉన్నాయి. నాలుగవ విభాగంలో భాషలైతే తాతయ్య నాయనమ్మలు అర్ధం చేసుకోగలరు కానీ మాట్లాడలేరు. తల్లిదండ్రులకైతే వారిమాతృభాష రానేరాదు. ఇక చివరి ఐదవ విభాగంలో ఉన్న భాషలు మాట్లాడేవాళ్ళు చెదురుమదురుగా అక్కడక్కడా ఉండవచ్చు లేదా ఎవ్వరూ మిగిలియుండకపోవచ్చుకూడా. మొదటి విభాగంలో 84 భారతీయ భాషలున్నాయి. 2వ విభాగంలో 62, మూడవ విభాగంలో 6, నాల్గవ విభాగంలో 35, ఐదవ విభాగంలో 9 భారతీయ భాషలున్నాయి.
ఈ ప్రపంచంలో ఆదివాసీ భాషలెప్పుడూ చిన్నచూపు చూడబడుతూనే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలలో లభించే వనరులను దోపిడీ చేయడానికిగాను రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ వారి భాషా సంస్కృతులపై దాడి జరుగుతూనేవుంది. హిందీ భాషాసమాజం తెలిసోతెలియకో ఆదివాసీ భాషలను రూపుమాపే కుట్రలో భాగమవడం అనేది విచారకరమైన విషయం. గౌరవపూర్వకమైన స్థానం గానీ, భాగస్వామ్యం గానీ లభించకపోవడం వల్లనే ఇతర భాషలు హిందీభాషకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. హిందీ భాష కంటే గ్లోబల్ భాషైన ఇంగ్లీషును నేర్చుకోంటే మంచిదనే భావనలో ఉన్నాయి. మాతృభాషలో ప్రాధమిక స్థాయిలో విద్యాబోధన జరగాలనే ప్రభుత్వ సూచనలు అమలు జరగడంలేదు. ఫలితంగా ప్రాంతీయభాషల, ఆదివాసీ భాషల మనుగడ ప్రశ్నార్ధకంగా మారి, భాషల చిత్రపటంనుండి అవే పూర్తిగా కనుమరుగవబోతున్నాయి.
– అశ్వనీకుమార్ పంకజ్.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి