"ఎలాంటి నియంత్రణ, అర్హత లేని, యోగ్యత కోల్పోయిన కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థ నేడు ప్రపంచ వ్యాపితంగా ఏర్పడింది. అది మురికి డబ్బు, అవినీతి, మత్తు మాదకాలు, అసభ్య శృంగారాలలో కూరుకుపోయింది." అని అమెరికన్ రచయిత, నటుడు, దర్శకుడు జాన్ మైఖేల్ గ్రీన్ వ్యాఖ్యానించారు. ఇదే మాఫియా క్యాపిటలిజం.మాఫియా: "గొర్రెలు ఊలు కోల్పోతాయి. తోడేళ్ళు వెంట్రుకలు పోగొట్టుకుంటాయి. కాని అలవాట్లను వదలవు" సిసిలియన్ సామెత. శిక్షిత శునకం యజమాని లేని సమయాల్లో కూడా గొర్రెలను మల్లేస్తుంది. మల్లకుంటే మొరిగి, కరిచి మల్లిస్తుంది. మాఫియా కూడా అంతే. మాఫియా వ్యవస్థీకృత నేరస్థుల అంతర్జాతీయ సంస్థ. మొదట సిసిలీ నుండి పనిచేసేది. ఇప్పుడు ఇటలీ, అమెరికా కేంద్రాలుగా కార్యకలాపాలు నడుస్తున్నాయి.
దాదాపు అన్ని దేశాలలో మాఫియా చర్యలు సాగుతున్నాయి.
- అవినీతి, అక్రమ వ్యాపారాలు చేసేవారిని రక్షించడం,
- నేరగాళ్ళకు మధ్యవర్తిత్వం వహించడం,
- చట్టరహిత ఒప్పందాల,
- లావాదేవీల నిర్వహణ,
- పర్యవేక్షణ దీని పని.
- జూదం,
- అప్పుల ఎగవేత,
- మత్తు పదార్థాల అక్రమ రవాణా,
- వ్యభిచారం,
- మోసం దీని అదనపు కార్యక్రమాలు.
సిసిలియన్ పదం 'మాఫియు' నుండి ఏర్పడిన మాఫియా పదానికి నాకు నమ్మకముంది, నేను సమర్థున్ని, నేను చేయగలను అన్న అర్థాలున్నాయి. తొలుత మాఫియా అంటే మంచివారే. సామ దాన భేద దండోపాయాలతో పనులు చేయించేవారే. గౌరవమర్యాదలకు, భయానికి మాఫియా పర్యాయపదం. కాలక్రమేణా దండోపాయం, భయ పెట్టడం మాఫియా లక్షణాలుగా స్థిరపడ్డాయి. మంచిగాని చెడుగాని మాటలతో కాని పనిని హింసతో, హత్యలతో చేయించడం మాఫియా అలవాటుగా మారింది. "చట్టవ్యతిరేక ప్రైవేటు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రోత్సహించి, అమ్ముకునే వాణిజ్య పరిశ్రమ మాఫియా" అని సిసిలీ రచయిత డీగో గాంబెట్ట నిర్వచించారు. సిసిలియన్ మాఫియా మూలాలతో, అమెరికాలో 1931 లో, సాల్వటోర్ మారంజనొ నేరస్థుల బృందం అమెరికన్ మాఫియా ను నిర్మించింది. వ్యవస్థీకృత నేరాలతో ప్రభుత్వం కలిసిపోయిన రాజ్య వ్యవస్థను మాఫియా రాజ్యం అంటారు. ఈ రాజ్య వ్యవస్థలో పాలకులు, ప్రభుత్వాధికారులు, పోలీసు యంత్రాంగం, సైన్యం అక్రమ వ్యాపారాల్లో భాగస్వాములే. సిసిలీ మాఫియాల తర్వాత అతి పెద్ద మాఫియా బెనిటొ ముసోలిని. ఈయన ఫాసిస్టు పార్టీ నాయకుడు, ఇటలీ దేశ మాజీ ప్రధాని (1922 - 1943). ప్రపంచ నియంతలు, ఫాసిస్టులు హిట్లర్, ముసోలినీలు క్యాపిటలిజం, ఆధునికతల సమస్యలను పరిష్కరిస్తామని నమ్మబలికి ప్రజాస్వామ్యబద్దంగానే అధికారం సాధించారు. మాఫియా క్యాపిటలిజాన్ని అనుసరించారు. నియంతలుగా, ఫాసిస్టులుగా మారారు. జీవానికి, జీవితానికి మూలాధారమైన ప్రతిఘటన బలహీనమైనప్పుడు ప్రభుత్వాలు అవినీతిమయమై చట్టబద్దత కోల్పోయినప్పుడు “దేవదూతలు” పుట్టుకొస్తారు. హిట్లర్, ముసోలిని, నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మొదలగు మిత మతవాదులు ఇలాంటివారే.
సిసిలీ లో వామపక్ష మేధావులు, పాత్రికేయులు మాఫియా ను గురించి అనేక విషయాలు ప్రస్తావించారు. మాఫియా శ్రమకు దూరంగా పెట్టుబడికి దగ్గరగా ఉండేది. వ్యాపారవేత్తలకు, భూస్వాములకు, రాజకీయులకు రుసుము తీసుకొని మధ్యవర్తిత్వం వహించి సహకరించేది. 1980 తర్వాత మాఫియా వ్యవస్థీకృతమైంది. ఆధునీకరణ చెందింది. విస్తృత విశ్వవ్యాపిత నిర్మాణంతో సాంకేతికతను వాడుకొని వాణిజ్యీకరణను సంతరించుకొంది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అధికారులతో సంబంధాలను పెంచుకొంది. నీకిది నాకది సూత్రాన్ని అనుసరించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. మాఫియా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. స్వతహాగా మాఫియా సంపద, అధికారాల సంపాదన కోసం పోటీ పడుతున్నది. మాఫియా రాజ్యంలో రాజ్యంగా మారింది. రాజ్యానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తోంది. రాజ్యం, మాఫియా పరస్పరాధారితాలయ్యాయి. మాఫియా తన విస్తృత ప్రచారం ద్వారా ఎన్నికలను, మాధ్యమాలలో పెట్టుబడులు, లాబీయింగ్ ద్వారా ప్రభుత్వ విధానాలను, అధిక రుసుములు చెల్లించి అతి మేధావులైన న్యాయవాదులను నియమించుకోవడం ద్వారా న్యాయ వ్యవస్థను, తారుమారు ప్రకటనలతో వినియోగదారులతో వాళ్ళకు అవసరం లేని తరచుగా హాని కలిగించే అపాయకరమైన వస్తువులను కొనిపించడం ద్వారా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా దూరింది. వినియోగదారులను, ఉద్యోగులను, తోటి కాంట్రాక్టర్లను బెదిరించి అవసరమైతే దేహశుద్ధికి పాల్పడి తమకు కావలసిన వాళ్ళకు కాంట్రాక్టులు కట్టబెట్టేటట్లు చేస్తుంది. తమ రాజకీయుల ప్రయోజనాలను కాపాడుతుంది.
అండర్ వర్ల్డ్ వ్యాపారాన్ని, వ్యవస్థీకృత నేరాలను పెంచి పోషిస్తున్న ఈ మాఫియా ప్రభుత్వాలతో, భద్రతా సేవా సంస్థలతో సంబంధాలు పెట్టుకొని పెట్టుబడిదారీ వ్యవస్థ మూలాలకే తుప్పుపట్టించి, కుళ్ళబెట్టి నాశనం చేస్తోంది. వికీలీక్స్, పనామా, పారడైజ్ పత్రాలలో బయట పడిన సంస్థల, వ్యక్తుల పన్ను ఎగవేత మురికి పనులను చూస్తే క్యాపిటలిజం ఎంత నీచానికి దిగిందో తెలుస్తుంది. మాఫియా ప్రాపకంలో పెట్టుబడిదారుల సంపద ఎంతగా పెరుగుతున్నదో, అక్రమాలు ఎలా దాచబడుతున్నాయో అంచనా వేయవచ్చు. ఈ మాఫియా కష్టజీవులు, శ్రామికులు, ఉద్యోగులలో మేమెందుకు నిజాయితీగా బతకాలన్న ప్రశ్నను లేవదీసింది. సోవియట్, తూర్పు ఐరోపా దేశాల పతనం, పాశ్చాత్య దేశాల విజృంభన మాఫియాకు మరింత ఊతమిచ్చింది. పెరిగిన ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఆధునిక సాంకేతికతలు మాఫియా వృద్ధికి దోహదపడ్డాయి. పాలకుల ఆదేశాలతో మాఫియా నిజాయితీ అధికారులను, పరిశోధనా ప్రజాపక్ష పాత్రికేయులను మట్టుబెడుతున్నది. మాఫియా లక్షల సంఖ్యలో బాలబాలికలను, యువతులను మాయం చేసింది. బాలలను దొంగతనాలకు, మాదక ద్రవ్యాల వ్యాపారినికి వాడుకుంటున్నారు. బాలికలను, యువతులను బలవంతంగా వ్యభిచార వృత్తిలో దింపి తమ పబ్బాలు గడుపుకుంటున్నారు. నూతన ఆర్థిక సరళీకరణ విధానాలలో భాగంగా ఎత్తివేసిన ఆర్థిక నియంత్రణలు, క్రమబద్దీకరణలు మాఫియా క్యాపిటలిస్టుల వ్యాపారాన్ని సులభతరం చేశాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో పునర్నిర్వచించబడిన దేశభక్తి, జాతీయతలతో మాఫియా క్యాపిటలిస్టులకు ప్రోత్సాహం పెరిగింది. వాళ్ళు ఉత్సాహంగా సమాజంలో కలిసిపోయి తిరుగుతున్నారు. మాఫియా క్యాపిటలిజం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్నది.
మాఫియా క్యాపిటలిజం: మాఫియా క్యాపిటలిజానికి చాలా ముఖాలున్నాయి. మర్చంట్, ఫైనాన్స్, ఇండుస్ట్రియల్, ప్రోటొ, క్రోనీ అందులో కొన్ని. ప్రజాసంక్షేమం కోసం వాణిజ్య, పారిశ్రామిక వ్యవహారాలను రాజ్యం నిర్వర్తించాలి. అలా కాకుండా లాభాల కోసం ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు నిర్వహించే ఆర్థిక రాజకీయ వ్యవస్థ ను క్యాపిటలిజం అంటారు. ఉత్పత్తి సాధనాలు, వాటి నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటాయి. ప్రైవేట్ ఆస్తులు, పెట్టుబడి పోగుచేయడం, వేతన కార్మికులు, ఐచ్ఛిక లావాదేవీలు, దళారీ నిర్ణయ ధరల పద్దతి, పోటీ మార్కెట్లు క్యాపిటలిజం కేంద్రీకృత, స్వాభావిక లక్షణాలు. ప్రజలలో అర్హతగలవారు తమలో కొందరిని ఎన్నుకొని వారిచే ఏర్పడిన ప్రభుత్వం ద్వారా ప్రజలను పాలించడాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇందులో అధికారం పరోక్షంగా ప్రజలదేనని సిద్దాంతీకరించబడింది. భారత్ లో వాస్తవానికి అవినీతి, అక్రమాల ద్వారా ధనవంతులు ప్రజాస్వామ్యాన్ని స్వాధీనపరుచుకున్నారని ప్రజాస్వామ్య పరిరక్షకుల సహేతుక వాదన.
1990 లలో రష్యన్ ఆర్థిక వ్యవస్థను వివరించడానికి 'మాఫియా క్యాపిటలిజం' అన్న పదాన్ని వాడేవారు. ఆర్థిక ప్రపంచీకరణలో, వాల్ స్ట్రీట్ ఆక్రమణ (ఆకుపై వాల్ స్ట్రీట్) ఉద్యమ నేపథ్యంలో పెరిగిన హింసాత్మక బలప్రయోగాలు, సంపన్నులు ఎగేసిన అప్పులు, తాకిళ్ళ నొక్కుళ్ళ ఒత్తిడి పరీక్షలను వ్యక్తీకరించడానికి అమెరికా సామాజిక శాస్త్రవేత్త డేవిడ్ గ్రీబర్ 2012 లో 'మాఫియా క్యాపిటలిజం' పదాన్ని ఉపయోగించారు. పెట్టుబడిదారీ విధాన పద్దతుల్లో ఆదిమ సంచయం ఎప్పుడూ ఒక భాగమేనని కార్ల్ మార్క్స్ అన్నారు. మాఫియా హింసాత్మక చర్యల అంతరాయం ఉత్పత్తిదారుల నుండి ఉత్పత్తి సాధనాలను వేరుచేసింది. పేద దేశాల, పేద ప్రజల అప్పులు విపరీతంగా పెరిగాయి. మాఫియా అప్పులు వసూలు చేసినట్లే మాఫియా క్యాపిటలిస్టు ప్రభుత్వాలు కూడా పేదల అప్పులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. పెద్దల అప్పులు వదిలేస్తున్నాయి, పన్నులు రద్దుచేస్తున్నాయి. బ్యాంకుల నిరర్థక ఆస్తులను పెంచుతున్నాయి. కుంటిసాకులతో పేదప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకిచ్చే రాయితీలను ఎత్తేస్తున్నాయి.
పాలకపక్షాలకూ, ప్రతిపక్షాలకూ తేడా లేదు. రాజకీయ నాయకుల నేర ప్రవృత్తి కారణంగా పార్టీలలో క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యం అంతరించాయి. ప్రజానాయకత్వం వల్ల కాక పోగుచేసుకున్న సంపదతో నాయకులు పార్టీలను స్వాధీనం చేసుకున్నారు. పూర్వపు భూస్వామ్య విధానాల కంటే కొత్త ధనబలం పార్టీలలో, ప్రభుత్వాలలో, అనువంశ పాలనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ధనబలంతో వోట్లను, సీట్లను పొందుతున్నారు. చట్టసభల సభ్యులను కూడా ధనబలంతో కొని ప్రభుత్వాలను నిలబెట్టుకుంటున్నారు, ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. మైనారిటీ పార్టీలు అధికారానికి వస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలను వాయిదా వేయడం, కుదించడం ద్వారా తమ ఆసక్తులను, అభిరుచులను అధికార పార్టీలు కాపాడుకుంటున్నాయి. ప్రజాస్వామ్యమంటే మెజారిటీల పాలన మాత్రమే కాదు. మైనారిటీ పక్షాల, ప్రజల రాజ్యాంగబద్ద రక్షణలను పరిరక్షించే సంకల్పం కూడా. దామాషా పద్దతి ఎన్నికల్లో ఈ రక్షణలకు అవకాశాలున్నా అధికార పక్షాలకు అనుకూలం కాని కారణాన ఆ విధానం అమలుకు నోచుకోదు. దురదృష్ట వశాత్తూ నేడు మాధ్యమాలన్నీ పెట్టుబడిదారీ బహుళజాతి సంస్థల స్వాధీనంలో ఉన్నాయి. అవన్నీ మాఫియా క్యాపిటలిజాన్ని సమర్థిస్తున్నాయి, పోషిస్తున్నాయి. న్యాయవ్యవస్థలో అవినీతి, అక్రమాలు, పాలకవర్గ జోక్యం దాని విశ్వాసపాత్రతను తగ్గించాయి. అధికారపక్ష నేరస్థులు నిర్దోషులుగా వదిలేయబడ్డారు. అమిత్ షా, మోదీ వీరిలో ముఖ్యులు. ఆర్థిక సామాజిక వ్యవస్థలతో పాటు న్యాయవ్యవస్థలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నది. సంఘ్ ప్రభుత్వ అజెండాయే న్యాయవ్యవస్థ అజెండా అయింది. ఇది మాఫియా ప్రభుత్వ చర్య కాక మరేమిటి? దీని ప్రతిఫలనంగా జనవరి 12 న పత్రికా సమావేశంలో నలుగురు వరిష్ట న్యాయమూర్తులు భారత ప్రధాన న్యాయమూర్తి తీరును ఆక్షేపించారు. ఇది ఆయనను ప్రోద్బలించిన ప్రధాని తీరును ఆక్షేపించినట్లే లెక్క. అధికారవర్గం పాలకుల చేతుల్లో బందీ అయింది. వీరి నైపుణ్యాలను పాలకులు ఉపయోగించుకోవడం లేదు. చట్టసభలలో పాలక పార్టీలకు ప్రయోజనం చేకూర్చే చట్టాలు చేయబడుతున్నాయి. ఫలితంగా రోగం కంటే చికిత్స అపాయకరంగా తయారయింది.
ప్రత్యామ్నాయ పక్షాల బాధ్యత: ప్రత్యామ్నాయ పక్షాల ఎత్తుగడలు, ప్రణాళికలు, ఐక్య కార్యాచరణలే మాఫియా క్యాపిటలిజం నుండి దేశాన్ని రక్షించగలవు. అమెరికాలో సామాజిక శాస్త్రవేత్తలు మాఫియాను కట్టడి చేయడానికి పూనుకున్నారు. దానికి మార్క్సిస్ట్ తత్వశాస్త్రాన్ని, ఆర్థికాంశాలను, జ్ఞాన మీమాంసను అధ్యయనం చేశారు. క్యాపిటలిజం చరిత్ర, క్యాపిటలిస్టు సంస్థల నిర్మాణం, నిర్వహణ, వర్గ నిర్మాణం, వర్గ సంబంధాలు, సాంస్కృతిక, భౌతిక పరిస్థితుల సంబంధాలు వాటిలో కొన్ని. ఏక వ్యక్తి పాలన వ్యవస్థీకృతమైంది. మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులు తాబేదారులుగా, తందానా వీరులుగా, ప్రోత్సాహక మద్దతుదారులుగా తయారయ్యారు. ప్రజల పాత్ర కేవలం సమయానుసారంగా ప్రతినిధులను ఎన్నుకోవడమే కాదు. ప్రభుత్వాల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, సమ్మెలు, సమావేశాలు, ఆందోళనలు, ప్రతిఘటనలు నిర్మించి నిర్వహించడం కూడా వారి బాధ్యత. ఈ ప్రజాస్వామిక కార్యక్రమాలను ప్రభుత్వాలు పాశువికంగా అణచివేస్తున్నాయి. భావవ్యక్తీకరణకు అవకాశమివ్వడం లేదు. అరుదుగా ప్రజాపక్షాన నిలుస్తున్న పాత్రికేయులను నిర్బంధిస్తున్నాయి. ఈ మాఫియా క్యాపిటలిస్టు ధోరణులు ప్రజాస్వామ్య వ్యతిరేకాలు, ప్రజాసంక్షేమానికి అపాయకరాలు.
పాలక, ప్రతిపక్షాల కార్యకలాపాలు అధికారం కోసమే. మాఫియా క్యాపిటలిజంలో భాగాలే. ప్రత్యామ్నాయ పక్షాలు సంపూర్ణ సమాచారాన్ని సేకరించాలి. శాస్త్రీయ విశ్లేషణలతో నిజనిర్ధారణ చేయాలి. ప్రజలకు నిర్దుష్ట సమాచారాన్ని అందించాలి. సమాచార సంపన్నులైన ప్రజల అభిప్రాయం ప్రజాస్వామ్యంలో విలువైనది. సుపరిపాలకులను ఎన్నుకోవడంలో సహకరించగలదు. గుజరాత్ నమూనా అభివృద్ధి డొల్లతనాన్ని వివరించడంలో ప్రతిపక్షాలే కాక ప్రత్యామ్నాయాలూ విఫలమయ్యాయని, ఫలితమే నేటి దుష్పరిపాలనని ప్రజలు బాధపడుతున్నారు. రాజ్యాంగమనే సామాజిక ఒప్పందపు పునాదుల మీద భారత దేశం నిర్మించబడింది. మెజారిటీ లేని "మెజారిటీ" ప్రభుత్వాలు తమ ఇష్టమొచ్చినట్లు రాజ్యాంగాన్ని అనువర్తింపజేయరాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. మాఫియా క్యాపిటలిజాన్ని బలోపేతం చేస్తుంది. సంతల్లో సరుకులపై పెత్తనం ఉత్పత్తిదారులకుండదు. దళారీలు, గుత్తసంస్థలు సంతల సామ్రాజ్యాలను ఏలుతారు. ఇప్పుడు మతాంధకార నిరంకుశ పాలకులు మాఫియా క్యాపిటలిజాన్ని సమర్థవంతంగా వాడుకొని ప్రజల బానిసత్వాన్ని స్థిరీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అధికారంతో ప్రజాసంపదల, ప్రజాసంస్థల నిర్వహణలో లభించే బహుముఖ లాభాల కోసం పాలకులు అధికారంలో కొనసాగాలనుకుంటారు. ప్రతిపక్షాలు అధికారం పొందాలనుకుంటాయి. మాఫియా, మాఫియా క్యాపిటలిజం ఇందుకు దోహదపడుతున్నాయి. ప్రత్యామ్నాయ పక్షాలు కేవలం అధికారం కోసం కాక ప్రజాశ్రేయస్సుకు పని చేస్తాయి.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి