మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి.
గురువు తన విద్యార్ధులకు నేర్పవలసిన సూత్రాలు:
- శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి.
- కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి.
- పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు సంతోషించాలనీ నేర్పించండి. అసూయకు దూరంగా వుండడం, నిశ్శబ్దంగా సంతోషించడం నేర్పించండి.
- సోమరిపోతులు ఆశపోతులనే విషయం అతనికి తొందరగా తెలియజెప్పండి.
- వీలుంటే పుస్తకాలలోని అద్భుతాలను అతనికి వివరించండి. అయితే ఆకాశంలో పక్షులు ఎగరగలగడం, మండుటెండలో తేనెటీగలు సంచరించడం, పచ్చని కొండచరియల్లో పువ్వులు వికసించడం తాలూకు రహస్యాలు ఛేదించడానికి అతనికి తగిన సమయం ఇవ్వండి.
- మోసం చెయ్యడం కంటే విఫలమవడంలోనే గౌరవముందని మీ బడిలో నేర్పండి.
- ప్రతివొక్కరూ తప్పు అని చెప్పినాసరే తన స్వంత ఆలోచనలమీద విశ్వాసముంచాలని అతనికి తెలియజేయండి.
- ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలనీ, దుండగులతో కఠినంగా వ్యవహరించాలనీ నేర్పించండి.
- అందరూ గుంపుగా చేరినప్పుడు అతను కూడా వాళ్ళలో కలసిపోకుండా వుండగలిగే శక్తిని సంపాదించుకోమనండి.
- ఎవరు చెప్పినా వినాలనీ, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తరువాత మాత్రమే అంగీకరించాలని నేర్పించండి.
- మీకు వీలయితే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ వుండగలగడం నేర్పించండి.
- అయితే కన్నీళ్ళు పెట్టుకోవడానికి సిగ్గుపడ నక్కరలేదని చెప్పండి.
- తప్పులెన్నేవారిని లెక్కచేయకూడదనీ, తియ్యటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా వుండాలనీ తెలియ జెప్పండి.
- శరీర దారుఢ్యాన్నీ, మేధాశక్తిని ఎక్కువ వెల ఇవ్వగలిగిన వారికే అమ్ముకోవాలనీ, అయితే హృదయానికీ, ఆత్మకూ మాత్రం ఎన్నటికీ వెలకట్టగూడదనీ అతనికి తెలియజేయండి.
- అల్లరి మూకల కేకలు చెవినిపెట్టకుండా , తన ఆలోచన సరియైనదైతే నిలబడి పోరాడాలని నేర్పించండి.
- సున్నితంగా బోధించండి గానీ గారాబం చెయ్యవద్దు. కాల్చినప్పుడేకదా ఉక్కు గట్టిపడేది. అసహనంగా వుండడంలో గల సాహసాన్ని గుర్తించమనండి.
- ధైర్యశీలికి కావలసిన సహనాన్ని అలవరచుకోమనండి. తన మీద తనకు అచంచలమైన విశ్వాసం కలిగివుండాలని బోధించండి.
- అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు.