ప్రతి మనిషికీ ఎంతోకొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ, కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే, మనమూ బాగుంతామని గుర్తించి, గుర్తుంచుకోవాలి. మహర్షులు ఎన్నో సందర్భాలలో 'పరోపకారార్థమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ధి వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు.
మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది. మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట!
ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్భంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది
. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వర్షాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం.
హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు.
తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు. హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది.
శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు.ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది.
హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి. పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి