మాతృగర్భము - మరుభూమి.:
మనము అందరమూ ఆలోచించే శక్తికలవారము. భగవంతుడు మనకు మాత్రమే అంతటి జ్ఞానాన్ని శక్తిని ఇచ్చాడు. దయచేసి బాగా నిస్వార్థంగా ఆలోచించండి.
ఎంతటి వారైనా కోటీశ్వరుడైనా, మిలీనియరైనా, బిలీనీయరైనా, చక్రవర్తి అయినా, ఎవరైనా ఈ భూమి మీదకు రావడానికి ద్వారం మాతృగర్భమే. ఈ కలియుగంలో కరాచరణాదులతో కదలాడే ఎంతటి వారైనా స్వాములు అయినా భాగవతులైనా మాతృగర్భంనుండే వస్తారు. మరలా వెళ్ళేది మరుభూమికే. అవునా? మాతృ గర్భంనుండి రావడానికి రెండు మార్గాలు.
1). సహజ జననం (సాధారణ కాన్పు)
2). వైద్యవిధమైన క్లిష్టమయిన కాన్పు(సిజేరియన్) కత్తులతో కోసి బిడ్డను తల్లిని రక్షించడం.
అంటే జననం ఎలా జరిగినా మాతృగర్భంనుండే జరుగుతుంది.
మరణం తర్వాత ఈ మరణిచిన శరీరం వెళ్లిపోవడానికి రెండే రెండు మార్గాలు:-
1). ఖననం చేయడం. (శరీరమును భూమిలో గొయ్యి తీసి భూమిలో కప్పేయడం.
2). దహనము. చితిపేర్చి అగ్నితో దహింప చేయడం. ఏదైనా మరుభూమిలోనే జరుగుతుంది.
ఇపుడు ఆలోచిస్తే మరుభూమికి, మాతృగర్భానికి ఎలాంటి తేడాలేదు. మాతృగర్భం మురికి కూపం, మల మూత్రాల నిలయం. దుర్గంధ భూయిష్టం. అలాగే మరుభూమి కూడా బహు జుగుప్సాకర ప్రదేశం. బహు భయంకరమై భయమును కల్గించే ప్రదేశం. దుర్వాసనలతో, దుర్గంధ పూరితమైన స్థలం. మరి రెంటికీ తేడా ఏమిటి.
మాతృ గర్భము నుండి జననము జరిగే సమయంలో, బంధువులు మిత్రులు అందరూ ఎప్పుడెప్పుడు జననం జరుగుతుందా బిడ్డను చూద్దామా అని ఆదుర్ధాగా ఉంటారు. మరి మరుభూమిలో ఎప్పుడు ఈ కార్యక్రమం అయిపోతుందా ఎంత తొందరగా ఇంటికి వెళదామా అని ఆదుర్దా? అవునా? ఆలోచించండి. అందుకే మన పెద్దలు అన్నారు “ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని”.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి