మనసు బుద్ధి దేనిని ఏది సంస్కరించాలి?:
భగవంతుడు కేవలం శరీరమును మాత్రమే సృజింపడు. దానితో పాటు ఒక మనస్సును కూడా ఇస్తాడు. ఈ మనస్సు ఉందే, అది తోకలేని కోతి. ఈ మనస్సు ఎప్పుడూ సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. ఇందులో స్పందన వేరు, కదలిక వేరు, కార్యము వేరు.
ఉదా: ఒక బావిలో కానీ, ఒక కొలనులో కానీ, నీరు చాలా ప్రశాంతముగా ఎలాంటి స్పందన, కదలిక లేకుండా ఉంటాయి. అందులో మనము ఒక రాయి వేస్తే, ఆ రాయి వెళ్ళి నీళ్ళ పై పడినపుడు, ఆ నీళ్ళలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల వలన స్పందన కలుగుతుంధి. ఆ స్పందన వలన సంకల్పము జరుగుతుంది. ఎప్పుడూ సంకల్పము జరిగిందో అది కార్యరూపము దాల్చుతుంది. కార్యమైతుంది.
మనసు నిజంగా చిన్నపిల్లవాడు లాంటిది. పిల్లవాడికి, నీటికి-మూత్రమునకు తేడా తెలియదు. అన్నానికి-మలమునకు తేడా తెలియదు. అగ్గికి-చల్లదనమునకు తేడా తెలియదు. మనస్సు కూడా అంతే.
- సంకల్పము - పట్టుకోవడం
- వికల్పము - విడిచిపెట్టడం
- మనస్సు - చిన్నపిల్లవాడు
- బుద్ధి - అమ్మ
కాబట్టి బుద్ధి బాగా పనిచేస్తే మనస్సు సంస్కరింపబడుతుంది. ఆ మనసు సంస్కరింపబడితే మనసు బుద్ధి రెండూ కలసి మంచి పనులు చేస్తాయి. అందుకే ఒక కవిగారన్నారు.
“గొరుగుచుందురు జుత్తు కొన్నివందల సార్లుచూశారా మనసు పరిస్థితి.
దాని పాపమేమె కానరాదు
అఖిల పాపములకు నిలయమైన
మనసు గొరగడేమి మానవుండు”
మనసు ముందుకెళ్ళడానికి సాధన అవసరంలేదు. ముందుకు అంటే అనవసర ఆలోచనలకు అరిషడ్వర్గావలంబనకు సాధన సహాయము ఆసరా అవసరం లేదు.
ఉదా:- చిన్న బిడ్డను ఏదైనా అడిగితే “ఆ ఇది నాది” అంటాడు. ఎవరునేర్పారు. అలాగే మనస్సును వెనుకకు సత్యశోధనకు లాగడానికి సాధన కావలయును. హంస అంటే నీటిని, పాలను వేరు చేయగలదు. అవునా?ఎవరైనా హంసను చూచిన దాఖలాలు, చూచినట్లు సాక్ష్యం ఉందా? లేదు. అందుకే పరమహంస అంటే పరమాత్మను,జగత్తును విడకొట్టి సత్యాసత్యములను తెలియజేయునది. ఇది గ్రహిస్తే మనము ఏమిటో, మనకు మన పరిస్థితి తెలుస్తుంది. పూజ ఎందుకో భక్తి ఎందుకో మనకే అర్థమవుతుంది. మనము ఏమి చేయాలి అనే విషయం మనకే తెలుస్తుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి