ఎయిడ్స్ నిర్వచనము : - మనిషి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషి యెన్సీ వైరస్ లేదా హెచ్ఐవి) కారణంగా వ్యాధినిరోధక శక్తి నశించి, పలువ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్ లేదా ఎయిడ్స్ అని వ్యవహరిస్తాము. 25నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్స్.
ఇదే వయస్సున్న స్త్రీలలో మరణాలు సంభవించడానికి నాలుగవ అతి పెద్ద కారణం ఎయిడ్సే.హెచ్ఐవి క్రిములు మానవ శరీరంలోకి ప్రవే శించి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి దానిని నిర్వీర్యం చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి నశించడంతో వివిధ రకాలైన ప్రాణాంతక వ్యాధులకు గురి కావడం జరుగుతుంది.
ఎయిడ్స్ ఎలా? ఎక్కడ నుండి వచ్చింది?
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం హెచ్ఐవి వైరసు సోకిన మొదటి వ్యక్తి ఆఫ్రికా ఖండంలోనే ఉండాలి. ఇది 1915, 1941ల మధ్య జరిగి ఉండవచ్చని ఊహిస్తున్నారు. అప్పట్లో అక్కడ గ్రీన్ చింపాంజీలకు ఎస్ఐవి (SIV) సోకుతూ ఉండేది, ఇది హెచ్ఐవిగా రూపాంతరం చెంది మనుషులకు సోకటం ప్రారంభించింది అని చెబుతారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం జూన్ 18, 1981న అమెరికాలో మొదటి ఎయిడ్స్ కేసు నమోదయింది. దీనిని మొదట స్వలింగ సంపర్కంలో పాల్గొనే పురుషులకు సోకే వ్యాధి అని అపోహ పడ్డారు. కాని వచ్చిన కేసులలో సగంపైగా స్వలింగ సంపర్కంలో పాల్గొనని వారు కావటం వలన అందరికీ వచ్చే జబ్బుగా నిర్ధారించారు.
హెచ్ ఐ వి H.I.V లక్షణాలు:
సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల) వరకు రక్త పరీక్ష ల ద్వారా వైరస్ జాడ కనుగోనలేము. దీనినె Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగులలో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు . ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వారా ఎయిడ్స్ రొగుల జీవితకాలం పెరుగుతు ఉంటుంది.
ఎయిడ్స్ లక్షణాలు:
- హెచ్ఐవి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఎలాంటి లక్షణాలు కనిపించక పోవచ్చు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరు వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అత్యధిక భాగం హెచ్ఐవి క్రిముల కారణంగా కాకుండా, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి.
- హెచ్ఐవి సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణాలు కొన్ని వారాలనుంచి కొన్ని నెలలపాటు కొనసాగవచ్చు. ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా కనిపి స్తాయి కనుక బాధితుడికి తనకు హెచ్ఐవి సోకిందనే అనుమానం కలుగకపోవచ్చు. హెచ్ఐవికి సంబంధించిన పరీక్షలను ఒకటికి రెండుసార్లు చేయించుకుని, స్పష్టమైన నిర్ధారణకు వస్తే తప్ప ఈ లక్షణాలు హెచ్ఐవి వ్యాధికి సంబంధించినవి నిర్ధారించకూడదు.
- హెచ్ఐవి క్రిములు శరీరంలోకి చేరిన తరువాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాలనుంచి నెలల వరకూ పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయిం చుకుంటే హెచ్ఐవి పాజిటివ్ అని ఫలితం రాదు. అయితే, బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింప చేయగలిగే స్థితిలో ఉంటారు.
- హెచ్ఐవి క్రిములతో పోరాడటానికి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటిబాడీస్‌ను తయారు చేయనారంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్ఐవి పాజిటివ్ అని ఫలితం వస్తుంది. హెచ్ఐవి శరీరంలోకి చేరిన తరువాత తొలిదశలో కనిపించే.. ఫ్లూ వంటి లక్షణాలు తగ్గి పోయిన తరువాత బాధితులు కనీసం పదేళ్ల వరకూ ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో హెచ్ఐవి క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి.
- వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సిడి4 కణాల సంఖ్యను బట్టి తెలుసుకోవచ్చు. సిడి 4 కణాలను టి-హె ల్పర్ కణాలని కూడా అంటారు. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతులలో సిడి4 కణాలు ప్రతి మిల్లీ లీటర్ రక్తంలో 500 నుంచి 1500 వరకూ ఉంటాయి. సరైన చికిత్స తీసుకోని పక్షంలో సిడి4 కౌంట్ గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్ఐవి వ్యాధి తాలూకు లక్షణాలు కనిపించడం ఆరంభమవుతుంది.
- లైంగిక సంపర్కం వలన. ప్రపంచంలోని అత్యధికులు ఈ మార్గం ద్వారానే ఎయిడ్స్ బారిన పడుతున్నారు.
- రక్తం ద్వారా. పచ్చబొట్లు పొడిపించుకోవటం వలన, వ్యాధి గ్రస్తుని రక్తదానం వలన కూడా ఎయిడ్స్ వ్యాపించ వచ్చు. పచ్చబొట్టు వల్ల ఎందుకంటే, వారు ఒకరికి ఉపయోగించిన సూదినే మళ్ళీ ఇంకొకరికి ఉపయోగిస్తారు, అయితే ఇలాంటి కోవాకే చెందిన క్షవరం, సుంతీ, ఇంజెక్షను మొదలగునవి చేయించుకునేటప్పుడు అప్రమత్తతో మెలగ వలెను.
- తల్లి నుండి బిడ్డకు. తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఆఖరి వారాలలో ఈ వ్యాధి కోకే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడూ చనుబాల వలన కూడా సంక్రమిస్తుంది. సరయిన చికిత్స తీసుకోనప్పుడు ఈ రకమయిన వ్యాప్తికి ఆస్కారం 20% అయితే, సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసి సరయిన చికిత్స ఇవ్వగలిగితే అప్పుడు ఎయిడ్స్ వ్యాప్తిని ఒక్క శాతానికి తగ్గించవచ్చు.
ఈ క్రింది మార్గాలలో ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదు:
- దోమ కాటు,పిల్లుల కాటు,కుక్క కాటు, దగ్గు, తుమ్ముల వల్ల, ముద్దుల వల్ల
- స్పర్శించటం వలన,హెచ్ఐవి/ఎయిడ్స్ సోకిన వ్యక్తిని కౌగలించుకొవడం వలన
- వ్యాధిగ్రస్తుని బట్టలు ధరించటం వలన,ఒకే మరుగు దొడ్లను, ఒకే స్విమ్మింగ్ పూల్‌లను ఉపయోగించటం ద్వారా
- ఎయిడ్స్‌గల వారితో కలిసిమెలిసి జీవించడం వల్ల
- ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
- హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు.
హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.
హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే:
- రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య 200 కంటే తక్కువ ఉన్నప్పుడు
- ఎయిడ్స్ కలిగించిన రుగ్మత ( Opportunitic Infections )
మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుందిటాయి. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతులు శరీరంలోకి చేరుకుంటాయి.ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు.
ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు:
- హర్ప్‌స్ జొస్టర్ ( శింగెల్స్ గజకర్ణము ) Herpes Zoster Virus (shingles)
- కపోసీస్ సర్కోమా (Kaposi's Sarcoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు.
- సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు.
- న్యుమోనియా (PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది.
- టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది.
- క్షయ (Tuberculosis)
- ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు.
హెచ్ఐవి వైరసు మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాధి నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాధులు రావటం అరుదు.
హె.ఐ.వి. పరీక్షలు:
బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్, 2.వెస్ట్రన్ బ్లాట్, 3.సి.డి సెల్ కౌంట్.
- ట్రైడాట్: ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన 'హెఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు (Antibodies)తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది . ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు.
- వెస్ట్రన్ బ్లాట్: హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి.
- సిడి4 కణాల సంఖ్య : మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ధ్రువపరుస్తారు.
సాధారణముగా హెఐవి సోకిన తల్లులకు పుట్టిన బిడ్డలకు హెచ్ఐవి సోకిందో లేదో తెలుసుకోడానికి కనీషము 18 నెలలు వ్యవధి కావాలి. హెచ్ఐవి తల్లుల సాదారణ పురుడులో 30% వరకూ,హెఐవి సోకిన తల్లి పాలు తాగిన పిల్లలకు 10%-15% వరకూ,సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టినపిల్లలకు 1% జబ్బు అంటుకునే అవకాశాలున్నాయి. హెచ్ఐవి తల్లులకు గర్భినిగా ఉన్నపుడు 'ఎ.అర్.టి.' మందులు వాడమువలన బిడ్డలకు 'హెచ్ ఐ వి' సోకే అవకాశము 1-2% వరకు తగ్గుతుంది. 18 నెలలు వ్యవధిలో బిడ్డకు హెచ్ ఐవి జబ్బు ముదిరిపోయే అవకాశము ఎక్కువే కావున మామూలు పరీక్షలతో నిర్ధారణ చేయడము కంటే వేగవంతమైన పరీక్ష ఉంటే బాగుండుననే ఉద్దేశముతో ఈ మధ్యన డిఎన్ఎ-పిసీర్ పరీక్ష ద్వారా 0-7 రోజుల వయసులో హెచ్ఐవి పరీక్షలు ఇర్వహించి తొందరగా హె ఐవి ట్రీట్మెంట్ ప్రారంభించి పూర్తిగా హెచ్ఐవి లేకుండా నివారించే అవకాశాముంది. ఈ పద్ధతి ద్వారా శిశువు కాలు వద్ద ప్రికింగ్ చేసి (రక్తసేకరణ) డిఎన్ఎ-పిసీర్ పరీక్షచేసి హెచైవి నిర్ధారణ చేస్తారు.
హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స :
HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాద్యం.
- కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం (Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన ఆహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తె జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే.
- కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగె ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
- హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's (Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసె తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికె మందులను మరియు చౌకగా దొరికే వాటిని మాత్రమే పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు ఉన్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
WHO 2009 సంవత్సరపు మార్గదర్శకాల ప్రకారం CD4 350 cells/mm3 కంటే తక్కువగా ఉన్న ప్రతిఒక్కరు మొదలు పెట్టాలి లేదా CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి మీకు ఎయిడ్స్ కలిగించె రుగ్మత ఏది వచ్చిన వెంబడె ప్రారంభించాలి అలాగే CD4 సంఖ్య ఎంత ఉన్నప్పటికి గర్భవతిగా ఉన్న ప్రతి మహిళ మందులు ప్రారంబించాలి.
అయితే ఈ మార్గదర్శకాలను ప్రతి దేశం వారి ఆర్థికవనరులను బట్టి మార్చుకుంటుంది. బ్రిటన్‌లో అయితే CD4 500 cells/mm3 కంటే తగ్గినప్పుడు, అమెరికా సంయుక్త రాష్ట్రంలో అయితే HIV ఉన్న ప్రతి ఒక్కరు వారి CD4 సంఖ్య ఎంత అనే సంబంధం లేకుండ వెంబడే ప్రారంభించేటట్లుగా మార్చుకున్నారు.
ఎయిడ్స్‌ని అరికట్టడం ఎలా?
అయితే ఎయిడ్స్‌ను పూర్తిగా నివారించె చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.
సురక్షితమయిన శృంగారం
తొడుగులను (కండోమ్) ఉపయోగించండి. తొడుగులను ఉపయోగించటం వలన ఎయిడ్స్ వ్యాప్తి దాదాపు సున్నాగా ఉంటుంది. దాదాపుగా, యెందుకంటే అప్పుడప్పుడు కొంతమంది తొడుగును సరిగ్గా ఉపయోగించరు కాబట్టి. కాబట్టి సాధ్యమయినంత వరకూ తెలియని వారితో సంపర్కించవద్దు. భారత దేశంలో ఇప్పుడు ప్రభుత్వం ఈ తొడుగులను ప్రజలకు విరివిగా అందుబాటులో ఉండాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు ఒక సారి వాడిన తొడుగులను ఎట్టి పరిస్థితుల్లోను రెండోసారి వాడరాదు. తొడుగులకు కూడా గడువు పూర్తి అయ్యె తేది ఉంటుంది, ఒక సారి పరిశీలించి తీసుకోండి. తొడుగులు మగవారికే కాదు ఆడవారికి కూడా లభ్యమవుతున్నాయి.
హెచ్ ఐ వి రొగి తీసుకొనవలసిన జాగ్రత్తలు
- పౌష్టికరమైన (Protein Rich Food )ఆహారం సమయానికి తీసుకొవటం, శరీరానికి తగినంత విశ్రాంతి ( నిద్ర), తగినంతగా వ్యాయామం చేయాలి, ప్రశాంతమైన జీవితం.
- వేళకు తప్పకుండా మందులు వెసుకోవాలి ( Drug Adherence ), డాక్టరు అపాయింట్మెంట్ లను, Lab Test లను మరవకూడదు.
- వైరల్ వ్యాధులు వ్యాపించిన ప్రదేశాలకు అలాంటి రోగులకు దూరంగా వుండాలి.
- http://www.thebody.com/content/40480/living-with-hiv-aids.html?ic=3001 సూచించిన టీకాలు తీసుకొవటం వల్ల కొన్ని వ్యాధులను నివారించవచ్చు.
- ఎలాంటి వ్యాదులైన వస్తె సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
- దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
- మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం. ఎయిడ్స్ కు సంబంధించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి