ఎవరైనా మరణిస్తే లేదా దేని మరణమైనా చూస్తే నాకు ఆందోళనగా అనిపిస్తుంది – అది మా పెరట్లో పావురం కావచ్చు, రోడ్డు మీద కుక్క కావచ్చు. నాకెందుకలా అనిపిస్తుంది? మరణమంటే ఏమిటో నేను తెలుసుకోగలిగెట్లు చేయగలరా?
మృత్యువు – ప్రకృతి రిత్యా మీరు కూడా మర్త్యులు (mortal). ఈ విషయమే మీ భయానికి మూలం. మీరు మర్త్యులు కాకపోతే మీకు భయమే ఉండదు, మిమ్మల్ని ముక్కలుగా కోసినా మీరు మరణించరు. కాని దేన్ని గురించి భయపడాలి? మరణం చాలా అద్భుతమైనది; ఎన్నిటి నుంచో అది విముక్తి కలిగిస్తుంది. ప్రస్తుతం మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీకది భయంకరంగా అనిపించవచ్చు, కాని మీకు వెయ్యేళ్ల జీవితం ఉందనుకోండి, మరణం గొప్ప ఉపశమనంగా కనిపిస్తుంది. మీరిక్కడ సుదీర్ఘ కాలం ఉంటే మీరెప్పుడు పోతారోనని జనం ఎదురుచూస్తారు. అందువల్ల మరణం గొప్ప ఉపశమనం; అది అర్ధాంతరంగా జరగకూడదంతే. మనమింకా సృజించగల, లోకానికేదైనా ఇవ్వగల, పనిచేయగల స్థితిలో ఉన్నవారు చనిపోవడం బాధాకరం.
ఇలా కాకుండా, సరైన సమయంలో మీరు మరణించాలంటే మీరు సాధన చేయాలి. అప్పుడు మీరెప్పుడు మరణించాలో మీరే నిర్ణయించుకోగలుగుతారు. లేకపోతే మీరు చచ్చిన పావురాన్ని చూసినా మీ మృత్యువును గుర్తు చేసుకొంటారు. నిన్న ఎగురుతూ ఉన్నది ఇప్పుడు చనిపోయింది, రేపటికి ఎండిపోతుంది. మీ సంగతి కూడా ఒకనాడు ఇంతే అని ఊహించుకోవడం వల్ల భయం కలుగుతుంది. మీరు పోగుచేసుకున్న దానితో మిమ్మల్ని మీరు గుర్తించుకోవడం అన్నది మీకో నిర్బంధ చర్యగా మారిపోయింది. మీరు పోగుచేసుకున్నదంటే – మీ శరీరం. ఇది కేవలం చిన్న మట్టిముద్దే అని నేను అంటాను. మీరు పోగుచేసుకున్న ఈ శరీరం మట్టితో ఏర్పడినదే. మీ శరీరం, మీ గుర్తింపులు, మీలో ఎంత గాఢంగా నాటుకు పోయాయంటే, వాటిని కోల్పోవడం మీకు భయంకరంగా కనిపిస్తుంది.
మీ శరీరం, మీ గుర్తింపులు, మీలో ఎంత గాఢంగా నాటుకు పోయాయంటే, వాటిని కోల్పోవడం మీకు భయంకరంగా కనిపిస్తుంది.మీరు చాలా బరువున్నారనుకోండి, మీరొక పదికిలోలు తగ్గేటట్లు మేము చేస్తే మీరు భయపడి, ఏడుస్తారా? లేదు కదా! పదికిలోలు తగ్గినందుకు చాలామంది ఆనందంతో తబ్బిబ్బవుతారు. ఇప్పుడు మీ బరువు మొత్తం 50 కిలోలో, 60 కిలోలో మొత్తం నశించిపోతే మాత్రం, ఏమవుతుంది? జీవన విధానం ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకున్నప్పుడు మీరు పోగుచేసుకున్న గుట్టల్లో మీరు కూరుకుపోకుండా ఉనప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టడమన్నది పెద్ద విషయమేమీ కాదు.
పక్షులు, పురుగులు, కుక్కలు, మనుషులు..అందరి మృతదేహాలు మట్టి మాత్రమే. మట్టి మట్టిలో కలిసిపోతుంది. అదో పెద్ద నాటకమేమీ కాదు; అదొక సహజ ప్రక్రియ. మీరు తీసుకున్నది, తిరిగి ఇవ్వవలసిందే. దాన్ని రీసైకిల్ చేయవలసిందే. మీ జననం, జీవితం, మరణాలకు మీరెంతో ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కాని భూమాతకు సంబంధించి అది రీసైక్లింగ్ మాత్రమే. అది మిమ్మల్ని బయట పడేస్తుంది, లోపలికి లాక్కుంటుంది. మీ గురించి మీరు చాలా ఉహించుకోవచ్చు, కాని మీరు తీసుకుంది, తిరిగి ఇవ్వవలసిందే, అది మంచి అలవాటు. మీరెవరి దగ్గర ఏమితీసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు తిరిగి ఇవ్వాల్సిందే. మరణం మంచి అలవాటు; నన్ను నమ్మండి. __సద్గురు
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి