ఏదేని కారణంగా కాలు, చేయి వంటి శరీరంలోని ఒక అవయవాన్ని తొలగించడాన్ని యాంప్యుటేషన్ అంటారు. ఏ వయస్సులోని వారికైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడిన ప్పుడు యాంప్యుటేషన్ చేయాల్సి రావచ్చు.
యాంప్యుటేషన్‌కు కారణాలు
- వ్యాధులు(diseases) : శరీరంలోని ఒక భాగాన్ని తొలగించాల్సి రావడమనేది అనేక పరిస్థితుల్లో కలుగుతుంది. కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మధుమేహం, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు.
- ప్రమాదాలు (Accidents): సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, పరిశ్రమల్లో పని చేస్తే ప్రమాదాలకు గురైన వారికి యాంప్యుటేషన్ తప్పనిసరి అవుతుంటుంది.
- పుట్టుకతో వచ్చే లోపాలు(congenital defects) : పుట్టుకతో వచ్చే లోపాల్లో అవయవం లేకపోవడం కాని, అతి చిన్నగా ఉండటం కాని జరిగితే దానిని యాంప్యుటేషన్‌గానే గుర్తిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ప్రోస్థెటిక్ డివైస్‌ను రూపొందించి అమర్చడం జరుగుతుంది.
- కంతులు (Tumours): ఎముకలకు సోకే కంతులకు (ఆస్టియో సార్కోమా) చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని సార్లు ఆ అవయవాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోగికి కాలు తొలగించాల్సిన పరిస్థితి వస్తే పాదాల వేళ్ల దగ్గరనుంచి తుంటి కీలు వరకూ వివిధ రకాలుగా తొలగిం చడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకుందాం.
- ఫుట్ యాంప్యుటేషన్(Foot amputation) : పాదానికి సంబంధించినంత వరకూ అది కేవలం బొటన వేలుకో, కొన్ని వేళ్లకో పరిమితం కావచ్చు. లేదా పాదంలో కొంత భాగం వరకూ తొలగించాల్సి రావచ్చు. లేదా పాదం మొత్తంగా తొలగించాల్సి రావచ్చు.
- ట్రాన్సటిబియల్ యాంప్యుటేషన్(Trans Tibial amputation) : మోకాలి కింది భాగంనుంచి కాలి మడమ వరకూ ఉండే భాగాన్ని తొలగించాల్సి వస్తే దానిని ట్రాన్స్‌టిబియల్ యాంప్యుటేషన్స్ అంటారు.
- నీ డిసార్టిక్యులేషన్(Knee Dearticulation) : మోకాలి కీలు వద్ద చేసే యాంప్యు టేషన్ ఇది.
- ట్రాన్స్‌ఫిమొరల్ యాంప్యుటేషన్(Trans femoral amputation) : మోకాలి కీలు భాగం నుంచి పైన తుంటి కీలు భాగం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది.
- హిప్ డిసార్టిక్యులేషన్(Hip disarticulation) : ఈ రకమైన యాంప్యుటేషన్‌లో తుంటి కీలునుంచి మొత్తం తొడ భాగాన్ని తొలగించడం జరుగుతుంది. చేతికి సంబంధించిన యాంప్యుటేషన్ రకాలు ఈ కింది విధంగా ఉంటాయి.
- పార్షియల్ హ్యాండ్ యాంప్యుటేషన్(partial Hand amputation) : దీనిలో చేతి వేలును కాని, బొటన వేలును కాని, లేదా మణికట్టు కింద ఉండే చేతిలో భాగాన్ని తొలగించడం చేస్తారు.
- రిస్ట్ డిసార్టిక్యులేషన్(Wrist dearticulation) : చేతిని మణికట్టు వరకూ తొలగిస్తారు.
- ట్రాన్స్ రేడియల్ యాంప్యుటేషన్ : మోచేయి కింది భాగంనుంచి మణికట్టు వరకూ ఉండే భాగాన్ని తొలగించడం జరుగుతుంది.
- ట్రాన్స్‌హ్యూమరల్ యాంప్యుటేషన్(Trans humeral amputation) : మోచేయి పైనుంచి భుజం కింది వరకూ ఉండే భాగం ఇది.
- షోల్డర్ డిసార్టిక్యులేషన్(Shoulder Disarticulation) : భుజం వరకూ తొలగించే శస్త్ర చికిత్స ఇది. ఇందులో కాలర్ బోన్‌ను తొలగించవచ్చు. లేదా తొలగించకపోవచ్చు. షోల్డర్ బ్లేడ్‌ను మాత్రం అలాగే ఉంచుతారు.
- ఫోర్‌క్వార్టర్ యాంప్యుటేషన్(Four quarter amputation) : దీనిలో కాలర్‌బోన్, షోల్డర్ బ్లేడ్‌తో సహా మొత్తాన్ని తీసివేయడం జరుగుతుంది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి