నాలుగు పదుల వయసొచ్చిందంటే అనారోగ్య సూచనలు కనబడుతుంటాయి. 'వయసు పెరిగిపోతోందిలే...' అని సరిపెట్టుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.
- ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
- నిద్రపోయే ముందూ నిద్ర లేచాక కూడా చేయాల్సిన పనుల గురించి సతమతమయ్యే వారు చాలామందే. దీనివల్ల ఒరిగేదేమీ లేకపోయినా ఒత్తిడి పెరిగిపోతుంది. రక్తపోటు సమస్య ఇబ్బందిపెడుతుంది. వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే ఉదయం కాసేపు వ్యాయామం చేయాలి. యోగాకు సమయం కేటాయించాలి. ఓ అరగంట మొక్కలకు నీళ్లుపెట్టడం, ప్రూనింగ్ చేయడం వంటి పనులు మనసుని తేలిక పరుస్తాయి. శరీరానికి చురుకుదనం వస్తుంది.
- పెరిగే వయసుని తెలిపేవి ముఖంపై ముడతలే. వయసు పెరిగే కొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. అందువల్లే చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఇలాంటప్పుడు నీటి శాతం అధికంగా ఉండి చర్మాన్ని తాజాగా ఉంచే కీర, సొరకాయ, ఆకుపచ్చని ఆకు కూరల్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో మాంసకృత్తులు లభించే కోడి గుడ్డుని తీసుకోవాలి. ఇవన్నీ చర్మాన్ని తాజాగా ఉంచడానికి ఉపయోగపడతాయి.