పూర్వం శిలాదుడనే ముని యజ్ఞం చేస్తుండగా, యజ్ఞశాలలో శివలింగం వద్ద అతనికొక శిశువు లభించాడు. అతడు ఆ పసివాడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.
నందికి ఏడేళ్లు నిండాయి. కైలాసానికి నడిచివెళ్లి శివుణ్ని చూడాలన్న గట్టి కోరిక వాడికి కలిగింది. సరాసరి హిమాలయాలకు బయలుదేరాడు. ఎక్కడెక్కడో వెతికాడు కానీ, కైలాసం కనిపించలేదు. ఏం చెయ్యాలో తోచక శివుణ్ని గురించి తపస్సు చెయ్యసాగాడు. వాడి భక్తికి మెచ్చి పార్వతీ పరమేశ్వరులు వాడి ముందర ప్రత్యక్షమయ్యారు. 'నాకు చిరాయువుతోబాటు, ఎప్పుడూ కైలాసంలో ఉండేలా వరమివ్వండి' అని కోరాడు నంది.
శివుడు తన జటాజూటంలో నుంచి పవిత్ర గంగా జలాన్ని రప్పించి నందిని గణాధిపతిగా అభిషేకించాడు. ఆ అభిషేక జలం నంది శిరస్సునుండి నేలమీదికి జారి, ఐదుపాయలుగా చీలి, త్రిశ్రోతి, జటోదక, స్వర్ణోదక, జంబూ, వృషద్వజ అనే నదులుగా ఏర్పడ్డాయి. నంది పార్వతీ పరమేశ్వరులవెంట కైలాసానికి వెళ్లాడు.
అతనికి యుక్త వయస్సు వచ్చాక సుకీర్తి అనే కన్యను పెళ్లాడాడు. నందీశ్వరుడనే పేరుతో ప్రమథగణాలతో కొన్నిటికి నాయకుడుగా పదవిని చేపట్టి కైలాసంలోనే ఉండిపోయాడు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి