చింతామణి (కర్ణాటక): కొడుకు బతికుండగానే పట్టించుకోవడం లేదు.. ఇక ఉత్తర క్రియలు ఏం చేస్తాడోనని భావించిన ఓ అభాగ్య తండ్రి తన పెద్దకర్మ, వైకుంఠ సమారాధన స్వయంగా చేసుకున్న దయనీయ ఘటన కర్ణాటక చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి పట్టణ పొలిమేరల్లోని బుక్కనహళ్ళిలో జరిగింది. బాగేపల్లి తాలూకా మార్గానుకుంటేకు చెందిన మారప్పరెడ్డి(70) ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి. ఈయన కుమారుడు ఆస్తినంతా పాడుచేసి వూరొదిలి వెళ్లిపోయాడు. దీంతో ఏడేళ్ల క్రితం చింతామణి సమీప బుక్కనహళ్ళిలో నారాయణప్ప తోటలో వ్యవసాయ కూలీగా స్థిరపడ్డాడు. కొన్నాళ్లకు కొడుకు తిరిగి రావడంతో రూ.లక్షల్లో అప్పుచేసి హోటల్ పెట్టించాడు. భారీగా పెరిగిన ఆ రుణం తీర్చే బాధ్యత తనది కాదంటూ.. కొడుకు తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. కొద్దిరోజుల క్రితం రాజీ పేరిట తండ్రిని బాగేపల్లికి పిలిపించి తన అనుచరులతో దాడికి పాల్పడ్డాడు. తన ఈ దురవస్థను వివరిస్తూ రక్షణ కల్పించాలని అధికారులు, సీఎంకు లేఖ రాసినా ప్రయోజనం లేకపోయిందని మారప్పరెడ్డి వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తన మరణానంతరం కొడుకు అంత్యక్రియలు చేస్తాడనే నమ్మకమూ కోల్పోయానన్నారు. అందుకే పెద్దకర్మ, వైకుంఠ సమారాధన స్వయంగా చేసుకున్నానని తెలిపారు.
ఆర్థికసాయం కోరుతూ కరపత్రం: తన పెద్దకర్మ చేసుకునేందుకు డబ్బు లేదని, ఆర్థికంగా ఆదుకోవాలంటూ మారప్ప కరపత్రాన్ని ముద్రించి తెలిసిన వారందరికీ పంచారు. అలా సేకరించిన నగదుతో వైకుంఠ సమారాధన పత్రికను సిద్ధం చేసి బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. అందరి సమక్షంలో తన పిండాన్ని తనే పెట్టుకొని మంగళవారం పెద్దకర్మ చేసుకున్నారు. మరణానంతరం తన దేహం కోలార్ వైద్య కళాశాలకు చెందేలా దానపత్రం ఇచ్చేశానని ప్రకటించారు. Source: Eeenadu
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి