తిరువనంతపురం: ఇక్కడి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాస్ దేవస్థానం అధికారులకు వినతిపత్రం పంపించారు. ఎలాంటి అనుమతి లేకుండానే హిందువులు ఈ దేవాలయ ప్రవేశం చేయవచ్చు. ఇతర మతస్థులు, విదేశీయులు మాత్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. క్రైస్తవ (రోమన్ కేథలిక్) మతానికి చెందిన ఏసుదాస్.. తనకు హిందూ మతంపై విశ్వాసం ఉందని, ఆలయ ప్రవేశం కల్పించాలని కోరారు.
ఈ మేరకు లేఖను, మతంపై విశ్వాసం ఉందని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాన్ని శనివారం సాయంత్రం ఓ వ్యక్తి ద్వారా ఆలయ అధికారులకు పంపించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.రతీశన్ (ఐ.ఏ.ఎస్.) మాట్లాడుతూ ఎప్పుడు వచ్చేది ఆ లేఖలో పేర్కొనలేదని, విజయదశమి రోజున (ఈ నెల30) వచ్చే అవకాశం ఉందని లేఖ తెచ్చిన వ్యక్తి చెప్పారని పేర్కొన్నారు. హిందూ మతంపై ఏసుదాస్కు ఉన్న విశ్వాసం అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు ధ్రువీకరణ పత్రం కూడా పంపినందున ప్రస్తుతానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
Source: eenadu
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి