మహావిష్ణువు దశావతారాల్లో నేరుగా రాక్షస సంహారం లక్ష్యంగా గోచరించకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించినది కూర్మావతారం. పూర్వము దేవతలు దూర్వాసమహర్షి శాపముతొ దానవులచే జయించబడి రాజ్యాన్ని పోగొట్టుకొని అసురుల వేధింపులకు తాళలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మతో కలిసి పురుషోత్తముని ప్రార్థించారు. కరుణాంతరంగుడైన శ్రీహరి అమృతోత్పాదన యత్నాన్ని సూచించాడు. పాలసముద్రంలో సర్వతృణాలు, లతలు, ఔషధాలు వేసి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి మహాసర్పాన్ని తరితాడుగా చేసి మధిస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయని, అమృతం లభిస్తుందని పలికాడు. ఆ మేరకు ఇంద్రుడు దానవులను కూడా సాగర మథనానికి అంగీకరింపజేశాడు.
దేవదానవులు మందరాన్ని కవ్వంగా తెచ్చి వాసుకిని తాడుగా చేసుకున్నారు. పాముకు విషం తలభాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు, తమస్సు పాపభూయిష్ఠం. దాన్ని అణచివేస్తేతప్ప లోకంలోనైనా, మనసులోనైనా ప్రకాశం కలగదు. అందుచేత శ్రీహరి రాక్షసుల్ని మృత్యుస్వరూపమైన వాసుకి ముఖంవద్ద నిలిపాడు.
మధనంలో- బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవడంతో పర్వతం సముద్రంలో మునిగిపోయింది. అప్పటి శ్రీహరిలీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపించే పరిమాణంలో సుందర కూర్మరూపంలో మహావిష్ణువు అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని పైకెత్తి తన కర్పరంపై నిలిపాడు.
క్షీరసాగర మథనంలో చిట్టచివరిగా లభించిన అమృతకలశాన్ని విష్ణువు మోహినిరూపం దాల్చి రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసి దేవతలకు అమృతం ప్రసాదించాడు. అమృతము లబించకపోవడము తో రాక్షసులు దేవతలచే ఓడిపోతారు . దేవతలకు తిరిగి స్వర్గాధిపత్యము లభిస్తుంది . ఇది కూర్మావతార కధగా ప్రసిద్ధికెక్కినది . శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై, విశ్వరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం చెబుతోంది.
ఆ కూర్మానికి వెన్నులో మేష, వృషభ రాశులు; తలలో మిథున, కర్కాటకాలు; ఆగ్నేయంలో సింహరాశి; దక్షిణ ఉదర భాగంలో కన్య, తులలు; నైరుతిలో వృశ్చికం; తోకపై ధనుస్సు; వాయవ్యాన మకరం; ఎడమ వైపు కుంభం; ఈశాన్యంలో మీనరాశి ఆక్రమించుకొని ఉంటాయంటారు. దాన్నే కాలానికి ప్రతీకగా చెబుతారు.
జలంలో నివసించే కూర్మం తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదలిస్తుంది. సంకల్పరహితంగా ఉన్నప్పుడు నీట్లో స్తంభించి ఉంటుంది. అవసరం లేనప్పుడు ఇంద్రియాలను విషయ సుఖాలనుంచి మరల్చగలగడమనే స్థితప్రజ్ఞకు, బహిర్ముఖ ప్రవృత్తి నిలుపుచేసికొని అంతర్ముఖ ప్రవృత్తిలోనికి వెళ్ళగలిగే చిత్తవృత్తికి కూర్మం ప్రతీక. అనంతమైన పొడవు వెడల్పులు దేహం అనాదిగా అనంతంగా ఉండే వస్తువుకే ఉంటాయి తప్ప- జనన నాశనాలు కలిగిన వాటికి సంభవించదు. అనంతమైన దేహంతో జలమంతా నిండి క్రీడిస్తున్నట్లు సర్వాధిష్ఠాన, చైతన్యాత్మ స్వరూప నారాయణుడు జీవకోటి అంతటా నిండి ఉండి క్రీడిస్తున్నాడు. కనుక కూర్మం సర్వాధిష్ఠాన భగవత్ స్వరూపం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి