మన దేశము లో నాలుగు దిక్కులావున్న పవిత్ర పుణ్యక్షేతాలను ' చార్ ధామ్' గా పిలుస్తారు .
- ఉత్తరాన - బదరీ,
- దక్షినాన - రామేశ్వరము ,
- పడమరన - ద్వారక ,
- తూర్పున - పూరీ క్షేత్రాలు ఉన్నాయి .
పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన మరియు ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర మరియు బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం) మరియు నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు మరియు కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.
ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా మరియు అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది. వైష్ణవ సంప్రదాయాలకు మరియు ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు.
పూరి జగన్నాథుని ఆలయ శిఖరాలపై సుదర్శన చక్రానికి సంబంధమున్న వైదికర్మల చక్రాలు మరియు పతాకాలు. ఎరుపు పతాకం జగన్నాథుడు భవనంలోనే ఉన్నాడని సూచిక.దేవాలయ మూలాలు:
ఈ మధ్యనే కనుగొన్నగంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న
జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు. ఈ ఆలయంలోని జగన్మోహన మరియు విమన భాగాలు అతని హయాం (1078 - 1148 CE) లోనే నిర్మింపబడ్డాయి. కాని 1174 CE లో ఒడిషా పాలకుడైన అనంగ భీమదేవ దీన్ని పునఃనిర్మించి ఈ ఆలయానికి ప్రస్తుతమున్న రూపునిచ్చాడు. 1558లో ఒడిషాపై ఆఫ్ఘన్ సేనాధిపతి కాలాపహాడ్ దాడి చేయక ముందు వరకు ఆలయంలో జగన్నాథున్ని కొలవటం కొనసాగింది. తర్వాత కాలంలో రామ చంద్ర దేవ, ఖుర్దా అనే స్వతంత్ర రాజ్యాన్ని ఒడిషాలో ఏర్పరిచినప్పుడు ఈ ఆలయాన్ని పవిత్రం చేసి, విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాడు.
ఐతిహ్యం:
ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగదేవ్ మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు. విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి తెలివిగా దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిదీ అందుకేనంటారు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.
దేవాలయ మూలాలకు సంభందించిన కథ:
ఈ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారం, క్రిత యుగం చివరలో అసలు రూపంలో జగన్నాథుడు (విష్ణువు విగ్రహరూపం), పూరి సముద్రతీర సమీపంలోని మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశావంతమైనదంటే దాన్ని చూసినవారికి తక్షణ మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు లేక యముడు దాన్ని భూమిలో దాచిపెట్టాలనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు.ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలని సంకల్పించి తన లక్ష్యం కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యి, పూరి సముద్ర తీరానికి వెళ్లి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాండంలో నుంచి తనకు కావలసిన రూపును తయారు చేసుకొమ్మని అతన్ని ఆజ్ఞాపించాడు. ఆ రాజు చెక్క దుంగను కనుక్కొన్నాడు.తర్వాత అతను అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞనరసింహరాజు ప్రత్యక్షమై నారాయణున్ని నాలుగు అక్షలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముణ్ణి వాసుదేవుని లాగా, వ్యూహని సంకర్షణ వలె, యోగమయని సుభద్ర లాగా మరియు విభవున్ని సుదర్శన వలె నిర్మించామన్నాడు. రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టునుంచి జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల రూపాలను తయారు చేశాడు.
ఆచార్యులు మరియు జగన్నాథ పూరి:
మాధవాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరు ఆచార్యులు దర్శించారు.ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.దీంతో పాటు రామానుజాచార్య, నింబర్కాచార్య మరియు గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చు. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరిని సందర్శించినప్పుడు ఇక్కడ తన భైఠకాన్ని ఏర్పరుచుకున్నారు. గురునానక్, కబీర్ మరియు తులసీదాస్ లు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి.
ఆలయ నిర్మాణం:
ఈ భారీ ఆలయ భవనం 400,000 square feet (37,000 m2) కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళూ మరియు పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను మరియు అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.
ప్రధాన ఆలయం కిందనుంచి పైకి కొంచెం వంపులు తిరిగి ఉండి దానిపైన విష్ణువుకు చెందిన శ్రీచక్ర (ఎనిమిది ఆకుల చక్రం) వుంటుంది. "నీలచక్ర"గా కూడా పిలవబడి, అష్టదాతుతో తయారైన ఈ చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ ఆలయ ధ్వజస్తంభం ఎత్తైన ఒక రాతి దిమ్మపై నిర్మింపబడింది. ఇది విగ్రహాలు వున్న గర్భగుడి కన్నా ఎత్తు 214 feet (65 m)లో ఉంది చుట్టు పక్కల పరిసరాలలో పెద్దదిగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న గుళ్ళు, మండపాల యొక్క న్యూచగస్తూప రూపంలోని గోపురాలు ధ్వజస్తంభం చుట్టూ మెట్లుగా ఉండి పర్వతశ్రేణిని తలపిస్తాయి.
ప్రధాన పూజాస్థలం ఎత్తైన గోడతో చుట్టబడి 20 feet (6.1 m) ఉంటుంది. ఇంకొక గోడ ప్రధాన ఆలయాన్ని చుట్టి ఉంటుంది.
1870లో సింహాల శిలలు మరియు ముందువరుసలో అరుణ స్తంభాన్ని కలిగిన సింగద్వారం. |
సంస్కృతంలో సింగద్వారం గా పిలవబడే సింహ ప్రవేశం ఆలయంలోని నాలుగు ద్వారాలలో ఒకటి మరియు ఆలయం లోపలికి వెళ్ళటానికి ప్రధాన ప్రవేశద్వారం. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఆ ద్వారం రెండు ప్రక్కల ఉన్న గాండ్రించే సింహాల పెద్ద రాతి శిలలు. ఈ ద్వారం తూర్పు ముఖంగా ఉండి బడా దందా లేదా పెద్ద రోడ్డుకు దారి చూపుతుంది .బైసీ పహచ లేదా ఇరవై రెండు మెట్ల వరుస ఆలయ భవనంలోకి దారి చూపుస్తుంది. సంస్కృతంలో పతిత పావన గా పిలిచే జగన్నాథుని శిల్పం ప్రవేశంలో కుడివైపున చెక్కివుంటుంది. పతిత పావన అంటే అణగారిన మరియు దిగజారిన వారి బాంధవుడు అని అర్థం. ప్రాచీన కాలంలో ఆలయంలోకి అంతరానివాళ్ళకు ప్రవేశం వుండేది కాదు కనుక వాళ్ళు ఈ పతిత పావనున్ని పూజించేవాళ్ళు. జయ, విజయ అనే ఇద్దరు ద్వారపాలకుల ద్వారానికి రెండు వైపులా నుంచుని వుంటారు. రథయాత్ర మొదలయ్యే ముందు జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను ఈ దారిలోనే తీసుకెళ్తారు.వాటిని గుండీచ మందిరం నుంచి తీసుకు వచ్చేటప్పుడు తనను నిర్లక్ష్యం చేసి తమతో పాటు యాత్రకు తీసుకు వెళ్లనందుకు అలిగిన మహాలక్ష్మిని జాతర రూపంలో శాంత పరుస్తారు. అప్పుడే విగ్రహరూపంలో ఈ ద్వారా తలుపులపైన ఉన్న మహాలక్ష్మి వారిని ఆలయంలోకి రావడానికి అనుమతిని ఇస్తుంది. ప్రధాన ద్వారం ముందు అద్భుతమైన పదహారు ముఖ ఏకశిలా స్తంభామైన అరుణ స్తంభం కూడా ఉంది. దీని పైభాగంలో సూర్య భగవానుడి రథసారథి అయిన అరుణుడి విగ్రహం వుంటుంది. అసలు ఈ స్తంభం కోణార్క్ లోని సూర్య ఆలయంలో ఉంటే, ఖుర్దా రాజు ఇక్కడికి మార్పిడి చేయించాడు.
జగన్నాథ, బలభద్ర మరియు సుభద్రల నకలులు. |
గర్భగుడిలో త్రిమూర్తులుగా పిలిచే జగన్నాథ్, బలభద్ర మరియు సుభద్రల మూల విరాట్టులు రాత్నవేది అనే ఆభరణాలతో అలంకరించిన దిమ్మెపై కొలువు తీరి ఉంటారు. వీటితో పాటే సుదర్శన చక్ర, మదనమోహన, శ్రీదేవి మరియు విశ్వధాత్రిల విగ్రహాలు కూడా రాత్నవేదిపై ఉంటాయి. జగన్నాథ్, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన చక్రాల విగ్రహాలు దారు బ్రహ్మగా పిలిచే పవిత్రమైన వేప కాండాల నుంచి తయారయ్యాయి.కాలాలను బట్టి ప్రతిమల నగలు, దుస్తులను మార్పు చేస్తుంటారు. వీటిని కొలవటం ఆలయ నిర్మాణం ముందు నుంచే అంటే ప్రాచీన ఆదివాసుల కాలం నుంచే ఉండేది.
ఆలయ వంటశాల మరియు మహాప్రసాదం:
జగన్నాథ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. సంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని శ్రీమందిర రాణి అయిన మహాలక్ష్మి దేవి పర్యవేక్షిస్తుందని అంటారు. ఒకవేళ అక్కడ తయారైన వంటలలో ఏదైనా లోపం వుంటే వంటశాల దగ్గర కుక్క నీడ కనిపిస్తుందని చెబుతుంటారు.మహాసురులుగా పిలిచే వంటవాళ్ళు దీన్ని మహాలక్ష్మిదేవి కలతకు ప్రతీకగా భావించి ఆ వంటను సమాధి చేసి మళ్ళీ కొత్తగా వంట మొదలు పెడతారు. ఇక్కడ మొత్తం వంటంతా హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది. వంటకు మట్టి కుండలను మాత్రమే ఉపయోగిస్తారు. వంట కోసం వంటశాల దగ్గర వున్నా గంగ, యమునా అనే రెండు పవిత్ర బావుల నుంచి తోడిన నీటిని మాత్రమే ఉపయోగిస్తారు.ఇక్కడ ఐదు ప్రత్యేక ముహుర్తా లలో రత్నవేది మరియు భోగ మండపాలలో ఉన్న ప్రతిమలకు పెట్టడానికి 56 రకాల నైవేద్యాలు ఉన్నాయి.ఆలయ వైదిక కర్మల ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. జగన్నాథునికి సమర్పించిన తర్వాత ఈ భోజనాన్ని తగినంత మొత్తంలో మహా ప్రసాదంగా ఆలయంలోని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు. అక్కడి భక్తులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు.
జగన్నాధుని పండుగలు:
స్నాన యాత్రా సందర్భంగా పూరి జగన్నాథ ఆలయాన్ని ధర్శించుకుంటున్న భక్తులు.
రోజూవారి ఆరాధనా సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమయినది జూన్ లో జరిగే రథయాత్రగా పిలిచే రథాల ఉత్సవం పండుగ. ఈ బ్రహ్మాండమైన పండుగలో జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రల విగ్రహాలు ఉన్న మూడు పెద్ద రథాలను ఊరేగిస్తారు.ఈ ఊరేగింపు బడా దందా గా పిలిచే పూరిలోనే అతిపెద్ద మార్గంనుంచి చివరి గమ్యస్థలమైన గుండీచ ఆలయం వరకు జరుగుతుంది.
ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్ళకొకసారి ఏ ఎడాదిలోనైతే ఆషాఢ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందనయాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర మరియు వర్షాకాలంలో ఝులన్ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం మరియు దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.
అలాగే విమలాదేవి కోసం ఆశ్వీజ మాసం యొక్క మహాలయ ప్రారంభానికి 8 రోజుల ముందు అలాగే విజయదశమి ముగింపునకు సూచకంగా జరిగే షోడశ దినాత్మక అనే 16 రోజుల పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో మదనమోహన మరియు విమల యొక్క ఉత్సవ మూర్తులు పాలు పంచుకుంటాయి.
బ్రహ్మపరివర్తన వేడుక
పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది, ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు.
అనావాసర లేదా అనాసర
వాడుక భాషలో విహార యాత్ర అని అర్థం.ప్రతీ ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నాన యాత్ర తర్వాత జగన్నాధ, బలభద్ర, సుభద్ర మరియు సుదర్శన విగ్రహాలు అనవాసర ఘర్గా పిలిచే రహస్య మందిరానికి వెళ్లి అక్కడే తర్వాత కృష్ణ పక్షం వరకు ఉంటాయి.కాబట్టి అప్పుడు వాటిని భక్తులు చూడడానికి వీలు పడదు.బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరులో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు.భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటి చూపు దక్కుతుంది. దీనిని నవయవ్వన అని అంటారు. అధిక స్నానం తర్వాత దేవుళ్ళకు జ్వరం చేసిందని అందుకే పదిహేను రోజులపాటు రాజ వైద్యునితోటి చికిత్స చేయిస్తారు.
జగన్నాధుని చేరుటకు ప్రయాణ మార్గాలు:
- ఒడిశాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది.
- భువనేశ్వర్లోని బిజూపట్నాయక్ విమానాశ్రయం పూరికి 60 కి.మీ. దూరంలో ఉంది.
- దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.
- కోల్కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్ రైల్వేస్టేషన్ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.
- భువనేశ్వర్, కోల్కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.
- Shree Jagannath Temple
- Administration, Puri
- Phone : +91-6752-222002/252900
- Fax : +91-6752-252100
- E-Mail : jagannath[dot]or[at]nic.in
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి