విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం .
భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు .
ధనుర్మాసం అంటే
- ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట .
- ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు .
- ప్రతీ ధనుర్మాసము లోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాసురాల విశేషం .
- ధనుర్మాసం అరంబాన్నే పల్లెటూర్లలొ "సంక్రాంతి "నెల పట్టడము అంటారు .ఈ నెల రోజులూ హరిదాసులకీర్తనలతొ,జంగమ దేవర లతో ,గంగిరెద్దుల ను ఆడించేవారితోనూ ,సందడిగా వుంటుంది . ముంగిళ్ళలో కల్లాపి జల్లి, ముత్యాలముగ్గుల తో కనుల విందు గా వుంటాయి .ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతు ల సంభారాలతో పల్లెలు "సంక్రాంతి "పండుగ కోసం యెదురుచూస్తూ వుంటాయి .
కాలమానము |
తెలుగు పండుగలలో మొదటి పండుగ ఉగాది. ఇది తెలుగువారి చాంద్రమాన సంవత్సరాది. ఈ చాంద్రమానం అంటే ఏమిటీ, తెలుగు కాలమానం ఎలా విభజించబడింది తెలుసుకుందాం.
ఉగాది అనగా సంవత్సరాది అనగా కొత్త సంవత్సర ప్రారంభం. మనము ప్రస్తుతము ఈ ఉగాది పండుగను చైత్ర మాస శుద్ధ పాఢ్యమి నాడు వేడుకగా జరుపుకుంటున్నాము. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి అనేది ఎట్లా వచ్చినది అని తెలుసుకొనుటకు చాల పూర్వ చరిత్ర కలదు. ఆ చరిత్రకు మూలము - ఆది మానవుడు. ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు మొదలుగునవి.
ఆది మానవుడు తన జీవితగమనములో కొంత సమయము వెలుగుతోను కొంత సమయము చీకటిలోను వుండుటను, అదే పరిస్ధితి మరల మరల జరుగుటును గమనించెను. వెలుగులో ఆకసము నందు తీక్షణమైన కాంతితో ఒక పెద్ద బింబమును, చీకటి సమయంలో ఆకసము నందు ఏవో మిళుకు మిళుకు మనునవి అనేకములు, తెల్లని కాంతితో ఒక బింబము కొన్ని సమయములలో పెరుగుతూనూ, ఇదే విషయము మరల మరల జరుగుటను గమనించెను. ఈ విధమైన గమనములో కొంత బుద్ధి వికాసము కలిగి మానవుడు వెలుగు సమయమును పగలు అని, చీకటి సమయమును రాత్రి అని, పగలు కనపడిన బింబమును సూర్యుడు అని, రాత్రి బింబమును చంద్రుడు అని, మిళుకు మిళుకు మను వాటిని నక్షత్రములని గుర్తించాడు.
ఈ గుర్తింపుతో కాలమును లెక్క కట్టుట అనేదాన్ని నేర్చాడు. ఆ విధంగా
1. ఒక పగలు.. ఒక రాత్రి కలిసి ఒక రోజు అని...
2. చంద్రుని కాంతి తరుగుదల 15 రోజులని , పెరుగుదల మరో 15 రోజులని మొత్తంగా 30 రోజులు ఈ విధంగా జరిగి మరల యిదే జరుగుతున్నదని... కావున ఈ 30 రోజుల సమయానికి నెల లేక మాసము అని పేరు పెట్టెను.
ఆ తరువాత పరిశీలనలో 12 మాసములు. చంద్రునికి దగ్గరగా ఉండే ప్రధాన నక్షత్రాలను, చంద్రుడు ఆ నక్షత్రములను సమీపించుటతో ప్రకృతి లో కలుగుతున్న మార్పులను పరిశీలించెను మానవుడు. అట్టి నక్షత్ర మండలమునకు పేర్లు పెట్ఠి, ఆ మండలములో చంద్రుడు ప్రవేశించినపుడు ఆయా నెలలకు ఆయా నక్షత్రముల పేర్లతో వచ్చు పేర్లను పెట్టారు. అదెట్లన పూర్ణ చంద్రుడు ఉన్న నక్షత్రం పేరుతో అనగా పూర్ణ చంద్రుడు చిత్త నక్షత్రముతో వున్నపుడు చైత్ర మాసమని, ఆ విధంగా...
- 1. చిత్త తో వున్న........చైత్రమాసము
- 2. విశాఖ తో వున్న........వైశాఖ మాసము
- 3. జ్యేష్ట తో వున్న........జ్యేష్ట మాసము
- 4. పూర్వాషాడ లేక ఉత్తరాషాడ........ఆషాడ మాసము
- 5. శ్రవణం తో వున్న........శ్రావణ మాసము
- 6. పూర్వాభాద్ర లేక ఉత్తరాభాద్ర తో వున్న........భాద్ర పద మాసము
- 7. అశ్వని తో వున్న........ఆశ్వయుజ మాసము
- 8. కృత్తిక తో వున్న........కార్తీక మాసము
- 9. మృగశిర తో వున్న........మార్గశిర మాసము
- 10. పుష్యమి తో వున్న........పుష్యమాసము
- 11. మఘ తో వున్న........మాఘ మాసము
- 12. పూర్వఫల్గుణి లేక ఉత్తర ఫల్గుణి తో వున్న........ఫాల్గుణ మాసము.
- 1. వృద్ధి చంద్రుడు........శుక్ల/శుద్ధ పక్షము
- 2. క్షీణ చంద్రుడు........కృష్ణ / బహుళ పక్షము (కృష్ణ శబ్దమునకు నల్లనిది అని అర్ధం).
ఈ ఆరు ఋతువులకాలమును ఒక సంవత్సరముగా పిలుచుకోటం మొదలు పెట్టాడు. వసంత ఋతువు నుండి శిశిర ఋతువు అయి పోయి మరల వసంత ఋతువు ప్రారంభం కాగానే క్రొత్త సంవత్సరము ప్రారంభమైనట్లు. అంటే చైత్ర శుద్ధ పాడ్యమి - క్రొత్త సంవత్సరం ఆరంభం. దాన్నే ఉగాది అని జరుపుకుంటాము.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి