పరమ గురువు దక్షిణామూర్తి
అనాదిగా వస్తున్న గురుపరంపర సంప్రదాయానికి మూల పురుషుడు ఆ త్రినేత్రుడేననీ... గురుదక్షిణామూర్తి రూపంలో అవతరించి సనకసనందాది మునులకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడనీ పురాణప్రతీతి. ఈనెల 12న మహాశివరాత్రి సందర్భంగా... దేశవ్యాప్తంగా ఆ జ్ఞానస్వరూపుడు కొలువై ఉన్న ఆలయాల గురించి తెలుసుకుందాం.''బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు తనకు సహాయంగా ఉండటానికి నలుగురు కుమారులను సృష్టించాడు. వారే సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. బ్రహ్మ మానసపుత్రులైన ఆ నలుగురి మనసుల్లో ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాడు చతుర్ముఖుడు. ఆ ప్రశ్నలకు సమాధానం దొరక్కుండా అన్యమనస్కంగా సృష్టిని కొనసాగించే ప్రక్రియలో పాల్గొనలేమని చెప్పి విష్ణువు దగ్గరకు బయల్దేరారు వారు. వైకుంఠంలోనూ వారి ప్రశ్నలకు బదులు దొరకలేదు. వారి అవస్థను గమనించాడు పరమశివుడు. వారువెళ్లే దారిలో ఒక మర్రిచెట్టు కింద అర్ధనిమీలిత నేత్రుడై దక్షిణామూర్తిగా అవతరించాడు. ధ్యానంలో నిమగ్నమై ఉన్న ఆ స్వామిని గమనించిన సనకసనందాదులు అటుగా వెళ్లి హరుడి పాదాలచుట్టూ ఆశీనులయ్యారు. శంకరుడు వారిని గమనించనట్టుగా ధ్యానంలోనే ఉన్నాడు. కానీ ఆ మౌనంలోనే వారి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. అప్రయత్నంగానే బ్రహ్మజ్ఞానం లభించింది.'' జ్ఞానస్వరూపుడుగా పేరుగాంచిన పరమశివుడి దక్షిణామూర్తి అవతారం గురించి పురాణాల్లో కనిపించే వివరణ ఇది. దేశవ్యాప్తంగా ఆ స్వామి అనేక క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు. వాటిలో ముఖ్యమైన కొన్ని ఆలయాలివి...
మహాకాళేశ్వరుడు
ద్వాదశజ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని(మధ్యప్రదేశ్)లో శివుడు మహాకాళేశ్వరుడు. ఈ పన్నెండు క్షేత్రాల్లోనూ శంకరుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్న తీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ ఈ ప్రత్యేకత లేదు. దక్షిణాభిముఖంగా స్వయంభువై వెలసిన మహాకాళేశ్వర ఆరాధనలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. శ్మశానం నుంచి తెచ్చిన చితాభస్మంతో ఈస్వామికి భస్మఆరతి ఇస్తారు. స్థలపురాణం ప్రకారం... క్షిప్రానది ఒడ్డున ఉన్న ఉజ్జయినీ సామ్రాజ్యాన్ని కుట్రతో ఆక్రమించుకునేందుకు ఇరుగుపొరుగు రాజులు కాచుకుని కూర్చుంటారు. ఉజ్జయిని రాజు విధించిన శిక్షకు గురైన శ్రీకరుడనే చిన్నారి ఆ అపాయాన్ని గ్రహించి ఆ వూరిపూజారికి చెబుతాడు. ఆవిషయం రాజుగారికి చెప్పేలోగానే... బ్రహ్మవరంతో మాయారూపుడై సంచరించే దూషణాసురుడనే రాక్షసుడి అండతో శత్రువులు విరుచుకుపడ్డారట. అప్పుడు శ్రీకరుడు, పూజారి కలిసి కైలాసనాథుణ్ని ఆర్తిగా ప్రార్థించారట. వారి వెుర ఆలకించిన రుద్రుడు ప్రళయకాల ఘోషతో మహాకాళేశ్వరుడిగా ఉగ్రరూపంలో అవతరించి శత్రుసేనలను చెల్లాచెదురు చేసి, దుషణాసురుణ్ని సంహరించి రాజ్యాన్ని కాపాడాడట. అనంతరం భక్తుల కోరికమేరకు మహాకాళేశ్వరుడి పేరిట జ్యోతిర్లింగంగా ఇక్కడ దక్షిణాభిముఖుడై వెలశాడనీ దక్షిణామూర్తిగా పూజలందుకుంటున్నాడనీ ప్రతీతి.వైకోమ్ మహాదేవుడు
కేరళలోని వైకోమ్ ప్రాంతాన దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉన్న శంకరుడు మహాదేవుడు. ఈ స్వామిని స్థానికులు వైకుంఠప్పన్గా వ్యవహరించడం విశేషం. స్థలపురాణం ప్రకారం... ఖరుడు అనే రాక్షసుడు చిదంబరంలో శివుణ్ని పూజించి మూడు శివలింగాలను పొందాడట. అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో వైకోమ్ ప్రాంతంలో అలుపు తీర్చుకోవడానికి ఆగి ఒక శివలింగాన్ని నేలపై పెట్టగా అది భూమిలోకి కూరుకుపోయిందట. ఎంతలాగినా పైకి రాకపోవడంతో మిగతా రెండు లింగాలను కూడా మహాదేవుడికి సమానదూరాల్లో ప్రతిష్ఠించాడట. అనంతర కాలంలో వ్యాఘ్రపాద మహర్షి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి దక్షిణామూర్తిగా పూజలందుకుంటున్నాడని ప్రతీతి. ఒకప్పుడు ఈస్వామి నిలువనీడ లేకుండా వోకాలులోతు నీటిలో ఉండేవాడట. ఈ దారి వెంట వెళ్తున్న పరశురాముడు వెలుగులు విరజిమ్ముతున్న దక్షిణామూర్తిని గమనించి ఆ ఆస్వామికి గుడి కట్టించి ఆలయానికొక వ్యవస్థనూ పూజావిధానాలనూ ఏర్పరచాడని చెబుతారు. పరశురాముడు ఏర్పరచిన విధానాల మేరకు మహాదేవుణ్ని ఇక్కడ ఉదయాన్నే దక్షిణామూర్తిగానూ మధ్యాహ్నం పూట కిరాతమూర్తిగానూ సాయంకాలాన సచ్చిదానందమూర్తిగానూ కొలుస్తారు. శివుడు అభిషేకప్రియుడు కాబట్టి నిత్యం ఈ స్వామికి సహస్రకలశాభిషేకం జరిపిస్తారు.వైకోమ్ మహాదేవుణ్ని అన్నదాన ప్రభువు అని కూడా పిలుస్తారు అక్కడివారు. ఎందుకంటే దూరతీరాలనుంచి మహాదేవుణ్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా కడుపునిండా అన్నం పెడతారు. ఆ ప్రసాదం తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని అనారోగ్యాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. యేటా కార్తీకమాసంలో అష్టమినాడు వైకోమ్ మహాదేవుడికి ప్రత్యేకపూజలు జరిపిస్తారు. ఆ రోజును 'వైకట్టు అష్టమి'గా వ్యవహరిస్తారు.
అలన్గుడి ఆపద్బాంధవుడు
శివుడు దేవగురువు బృహస్పతి నామధేయంతో గురుదక్షిణామూర్తిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రమిది. తమిళనాడులో ప్రఖ్యాతిగాంచిన దివ్యక్షేత్రం కుంభకోణానికి పదిహేడు కి.మీ. దూరంలో ఉందీ ఆలయం. క్షీరసాగరమథనంలో ముల్లోకాలనూ దహించివేసేంత వేడితో హాలాహలం బయటికొచ్చిందట. దాని ధాటికి తట్టుకోలేక దేవతలంతా హాహాకారాలు చేస్తుంటే భోళాశంకరుడు ఆ గరళాన్ని సేవించి గొంతులో నిలుపుకొన్న చోటు ఇదేనని స్థలపురాణం. అలా ఆపద నుంచి గట్టెక్కించిన శివుణ్ని 'ఆపత్సహాయేశ్వరర్(ఆపద్బాంధవుడు)'గా కొలిచారు దేవతలు. విషాన్ని మింగి గరళకంఠుడైన సదాశివుడు అక్కడే దేవదానవులకు జ్ఞానబోధ చేసి గురుదక్షిణామూర్తిగా వెలశాడని నమ్మిక. గురుడికి ఇష్టమైన గురువారం నాడు, సంక్రమణం(గురుగ్రహం ఒక్కొక్క రాశినీ దాటే) రోజుల్లోనూ ఇక్కడ ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. పసుపుపచ్చటి వస్త్రాలు, శనగలు స్వామికి సమర్పిస్తారు భక్తులు. చదువులో వెనకబడిన విద్యార్థులు ఈ స్వామిని దర్శించుకుని నానబెట్టిన శనగలతో కట్టిన మాల వేసి పూజిస్తే తప్పక ఉత్తీర్ణులవుతారని విశ్వాసం. గురుగ్రహానికి సంబంధించిన దోషాలున్నవారు అలన్గుడి దక్షిణామూర్తి గుడి చుట్టూ 24ప్రదక్షిణాలు చేసి ఆస్వామి సన్నిధిలో నేతితో 24దీపాలు వెలిగిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మిక.తమిళనాడులోనే దక్షిణామూర్తి కొలువై ఉన్న మరో ఆలయం తిరుపంతురైలోని శివనందేశ్వరర్ గుడి. ఈ గుళ్లో కుమారస్వామి మూలవిరాట్టు చిన్ముద్రతో శివుడికి జ్ఞానబోధ చేస్తున్నట్టుగా ఉండటం విశేషం. శివుడు ఇక్కడ అర్ధనారీశ్వరదక్షిణామూర్తిగా ఆలయవిమానంపై గోచరిస్తాడు. అలాగే శుకమహర్షి పూజించిన మరో దక్షిణామూర్తి ఆలయం కేరళలోని పాల్ఘాట్ రోడ్లో ఉంది. దీన్ని 'శుకపురం దక్షిణామూర్తి గుడి'గా వ్యవహరిస్తారు భక్తులు.
మనరాష్ట్రంలో...
దక్షిణామూర్తి ప్రధానమూర్తిగా లేకపోయినా ఆ స్వామి కొలువై ఉన్న ఆలయాలు మనరాష్ట్రంలోనూ కొన్ని ఉన్నాయి. వాటిలోనూ చిత్తూరుజిల్లాలోనే మూడు గుడులు ఉండటం విశేషం. నాగలాపురంలోని వేదనారాయణస్వామి ఆలయంలో దక్షిణభాగాన దక్షిణామూర్తి కొలువై ఉన్నాడు. నాగలాపురం మండలంలోనే సురుటుపల్లి పళ్లికొండేశ్వరస్వామి క్షేత్రంలో కూడా దక్షిణామూర్తి అమ్మవారితోసహా కనిపిస్తాడు. క్షీరసాగరమథనంలో హాలాహాలాన్ని సేవించిన శివుడు అక్కణ్నుంచి కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యంలో మైకం కమ్మి ఈ గ్రామంలో కొద్దిసేపు విశ్రమించాడట. అమ్మవారు సర్వమంగళ ఒడిలో విశ్రమించిన శివుణ్ని ఇక్కడ పళ్లికొండేశ్వరస్వామిగా అర్చిస్తారు.ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయానికి పక్కగా నందివాహనాన్ని అధిష్ఠించిన దక్షిణామూర్తి ప్రతిష్ఠితమై ఉన్నాడు. పార్వతీదేవి ఆ స్వామిని ఎడమవైపు నుంచి ఆలింగనం చేసుకున్న రీతిలో గోచరిస్తుంది. శృంగారభరితంగా ఉండే ఈస్వామిని దాంపత్యదక్షిణామూర్తిగా పూజిస్తారు భక్తులు. ఆయనను దర్శించుకుంటే పెళ్లికానివారికి వెంటనే వివాహం అవుతుందనీ పెళ్త్లెనా పిల్లలు పుట్టని వారికి సంతానం కలుగుతుందనీ నమ్మిక. అలాగే శ్రీకాళహస్తిలో కొలువై ఉన్న వాయులింగేశ్వర స్వామి ఆలయంలోనూ దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుంది. కోటప్పకొండ ప్రాచిన కోటేశ్వర ఆలయంలో శివుడు మేథా దక్షిణామూర్తిగా వెలశాడని ప్రతీతి.
ఇలా దక్షిణామూర్తి అవతారంలో కొలువైఉన్న క్షేత్రాల్లో పరమశివుణ్ని గురువారం పూట అర్చిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడనీ రోగాల నుంచి విముక్తి కల్పిస్తాడనీ భక్తుల ప్రగాఢవిశ్వాసం.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి