"గంగాధరా హర హర నమో" అని శివుణ్ణి ప్రార్ధిస్తాము . గంగను ధరించిన ఓ శివా నీకు నమష్కారము అని అంటాం. మరి ఆ గంగాదేవి ఎప్పుడు అవతరించినట్లూ , అంటే అందుకో పౌరాణిక కధ ఉంది. గంగాదేవికి అత్యంత ఇష్టమైన రోజూ , ఆమె ను అంతా పూజించవలసిన రోజూ ఏదంటే ... ఆ రోజే " గంగా సప్తమి " అనగా వైశాఖ శుక్లపక్ష సప్తమి -- గంగా సప్తమి .
పురాణ గాధ:
ఒకప్పుడు సగరుడు అనే సూర్యవంశ రాజు ఉండేవాడు . సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అంశుమంతుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సాగరరాజు అశ్వమేథ యాగం చేయతలపెట్టగా ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి, కుయుక్తితో దానిని కపిల మాహర్షి దగ్గర కట్టి వేశాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన యువ రాజులు కపిలుడే దానిని బంధించాడని భావించి, ఆయనను ఘాటుగా విమర్శించారు. అందుకు ఆగ్రహించిన ఆ ఋషి రాజకుమారులందరినీ భస్మంగా మారుస్తాడు.
సాగర చక్రవర్తి రెండవ భార్య కుమారుడు అసమంజ. అతని కుమారుడైన అంసుమాన్ తమ తప్పును క్షమించి శాంతించమని ఆ ఋషిని వేడుకున్నాడు. దాంతో శాంతించిన రుషి దేవలోకం నుండి గంగను భూమి మీదకు తేగలిగితే, రాకుమారుల ఆత్మలు శాంతిస్తాయన్నారు.
దివినుంచి భూమికి గంగను తీసుకురావడానికి ఆ రాకుమారుడు చేసిన ప్రయత్నం విఫలం అయింది. దాంతో అతని మనుమడయిన భగీరధుడు కఠోర తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి గంగను భూమి మీదకు పంపవలసిందిగా ప్రార్థించాడు. అందుకు బ్రహ్మ కరుణించి గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదని, ఆ శక్తి ఒక్క శివునికే ఉందని చెప్పాడు. దాంతో భగీరధుడు శివుని గూర్చి ఘోరతపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై అతని కోర్కెను తీర్చడానికి అంగీకరించడమే కాక, గంగను తన తలమీదనే ఉంచుకుంటానని చెప్పాడు. అయితే, గంగ అహంకారంతో శివుడి తలనే వంచానని విర్రవీగింది. గంగ అహాన్ని గమనించిన శివుడు ఆమెను ఏకంగా తన జటాజూటంలో బంధించాడు.
మార్గంతరం లేని భగీరధుడు మరలా తపమాచరించి గంగను క్షమించి, భూమిపైకి పంపమని శివ మహారాజును కోరగా, అందుకు ఆయన అంగీకరించి గంగను భూమిమీదకు పంపాడు. భగీరధుడు గంగా ప్రవాహాన్ని ఎంతగా క్రమబద్ధం చేస్తున్న ప్పటికీ, అత్యుత్సాహంతో గంగ మహర్షి జాహ్నవి హోమాన్ని చిందరవందర చేసింది. దానికి ఆగ్రహించిన ఆయన గంగను ఔపాసన పట్టడంతో భగీరధుని సమస్య మరలా మొదటి కొచ్చింది. పట్టువీడని భగీరధుడు గంగను కరుణించి విడుదల చేయమని మహర్షిని కోరాడు. అందుకు జాహ్నవి అంగీకరించి ఆమెను తన చెవినుండి విడవడంతో తన పూర్వీకుల భస్మాలపై గంగను ప్రవహింపజేసి, వారికి ముక్తి కలిగించాడు.జాహ్నచి ముని చెవినుండి జన్మించినది కావున గంగను " జాహ్నవి" అని పేరు వచ్చింది. " భగీరదుడు జన్మించాడు .
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి