నడుముకు గజ్జెలు, తలపై బోనం, చేతిలో వీరగల్లు...పరమశివుడే అణువణువూ నిండిపోయిన పారవశ్యంతో వూగిపోయే శివసత్తుల సందడి...ముగ్గుపట్నం వేసి, ముడుపులు చెల్లించి కోర్కెలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం...మార్గశిరం మొదలు ఫాల్గుణ మాసం దాకా... మూడు నెలల మహాజాతరకు వరంగల్ జిల్లాలోని కొమురవెల్లి ముస్తాబైంది.
వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో వెలసిన కొమురవెల్లి మల్లికార్జునుడు కొమురెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల ప్రజలకూ కొంగుబంగారమై అలరారుతున్నాడు. మార్గశిర మాసపు మొదటి ఆదివారం నుంచి దక్షిణభారత దేశంలోనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన కొమురవెల్లి జాతర ఆరంభమౌతుంది. ఆ మాసపు చివరి ఆదివారం (జనవరి 3) మల్లికార్జునుడి కళ్యాణం మహా వైభవంగా జరుపుతారు. వేలకొద్దీ భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారు. గతేడాది తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున స్వామి వార్లకు పట్టుబట్టలు సమర్పించడంతో వేడుక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
కుమారవెలి:
కొమురవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట. ఆ పేరు రాను రానూ ‘కొమురవెల్లి’గా మారిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది. పాతికేళ్ల క్రితం ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమయూన్ కాలంలోని నాణేలు దొరికాయి. దీన్ని బట్టి హుమయూన్ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ప్రసిద్ధమన్న విషయం తెలుస్తోంది. ఈ ఆలయాన్ని ఏ రాజులూ నిర్మించలేదనీ, అక్కడ ధ్వజ స్తంభం, రాజ శాసనాలూ లేకపోవడమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడనటానికి నిదర్శనాలనీ పూజారులు చెబుతారు. ‘ఖండోబా’ ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమురవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో, ఆ పూజారి ఇక్కడికి వచ్చాడనీ, అక్కడ నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయడం మొదలు పెట్టాడనీ కథనం. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పుట్ట పెరిగిందనీ, ఆ పుట్ట మట్టితోనే ఖండోబా స్వామి రూపంలోని విగ్రహాన్ని తయారు చేశారనీ ఆలయ అర్చకులు చెబుతారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర ముగ్గురు రాక్షసుల తలలుంటాయి. శివుడికి గంగా, పార్వతుల్లా ఇక్కడి స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు.
పట్నం అంటే...
ముగ్గూ ఐదు రకాల ప్రకృతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికనే ఇక్కడ పట్నంగా పిలుస్తారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గుపోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది. వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తారు. దాన్ని స్వామివారికి పట్నం వేయడం అని అంటారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడూ శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గూ అందులో స్వామివారి ఉత్సవ మూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్దపట్నంగా పిలుస్తారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలలో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులూ శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది.
వైవిధ్యంగా పూజ:
దాదాపు మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని ‘పట్టణం వారం’ (హైదరాబాద్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని)గా పిలుస్తారు. ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటిరోజు ‘పట్నం’ వైభవంగా నిర్వహిస్తారు. రెండో ఆదివారం ‘లష్కర్ వారం’ గా ప్రసిద్ధి. ఈ వారం సికింద్రాబాద్ లష్కర్ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువగా తరలివచ్చి స్వామికి బోనాల నైవేద్యం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు.
ఇక మార్గశిర మాసపు చివరి ఆదివారం జరిగే కల్యాణం ఓ ప్రత్యేక ఘట్టం. భక్తసందోహం నడుమ అచ్చంగా మనుషుల పెళ్లి జరిగినట్టే శివకల్యాణమూ జరుగుతుంది. ఇక్కడ స్వామి వారి కల్యాణం చేసే అర్చకులు రెండు వంశాలకు చెందిన వారున్నారు. మహదేవుని వంశంవారు అమ్మవార్ల తరఫున కన్యాదానం చేయగా, పడిగన్న వంశంవారు స్వామి తరఫు వారిగా ఉండి కల్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తారు. మూడునెలల పాటూ ఆది, బుధ వారాల్లో శివసత్తుల సందడి ఉంటుంది. చివరి రోజు అగ్ని గుండం తొక్కడంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచీ దాదాపు 300 మంది శివసత్తులు జాతర సమయంలో స్వామిని దర్శించుకుంటారు. దేవస్థానం తరఫున వీరికి చెల్ల, గంట, చీర, త్రిశూలం ఇచ్చి సన్మానించడం ఆనవాయితీ.
ప్రత్యేకతలు:
ఇక్కడి ఒళ్లు బండమీద చేతులు ఆన్చి మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. చుక్కలాది పర్వతం సూర్మాను గుండుగా పిలిచే రెండు పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు. ఆలయానికి సమీపంలో ఆంజనేయ, వీరభద్ర, రేణుక ఎల్లమ్మ, కొండపోచమ్మ దేవాలయాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఉండే గంగరేణి చెట్టునూ భక్తితో పూజిస్తారు.
రచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి